Begin typing your search above and press return to search.

కేసీఆర్ ఫార్ములాతో ఆయ‌న‌కే షాకిచ్చిన డీఎస్‌

By:  Tupaki Desk   |   28 Oct 2018 1:09 PM GMT
కేసీఆర్ ఫార్ములాతో ఆయ‌న‌కే షాకిచ్చిన డీఎస్‌
X
గులాబీ ద‌ళ‌ప‌తి - టీఆర్ ఎస్ పార్టీ అధినేత కేసీఆర్‌ కు అదే పార్టీకి చెందిన ఎంపీ డి.శ్రీ‌నివాస్ షాక్ ఇచ్చారా? కేసీఆర్ అమ‌ల్లో పెట్టిన ఫార్ములాతోనే ఆయ‌న‌కు ట్విస్ట్ ఇచ్చారా? ప‌ద‌వులు - జంపింగ్ విష‌యంలో డీఎస్ కొత్త ఒర‌వ‌డికి శ్రీ‌కారం చుట్టారా అంటే అవున‌నే స‌మాధానం వ‌స్తోంది. కాంగ్రెస్ పార్టీలో కీలక నేతగా..సీనియర్ నేతగా వుండే డీఎస్ 2014 ఎన్నికల తరువాత టీఆర్ ఎస్ గూటికి చేరుకున్నారు. అనంత‌రం ఆయ‌న‌కు రాజ్య‌స‌భ ప‌దవి ద‌క్కింది. అయితే, టీఆర్ ఎస్ పార్టీలో వర్గపోరు డీఎస్ కు పెద్ద తలనొప్పిగా మారింది. పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నాడనే నెపంతో డీ.శ్రీనివాస్‌ పై నిజామాబాద్ జిల్లాకు చెందిన టీఆర్ ఎస్ నేతలు సీఎం కేసీఆర్‌ కు ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదుపై డి.శ్రీనివాస్‌ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. టీఆర్ ఎస్‌ లో తనకు సరైన గుర్తింపు లేదని డీఎస్ ఆవేదన వ్యక్తం చేశారు. త‌న‌పై వ‌చ్చిన ఫిర్యాదు మేరకు తనను పార్టీ నుండి సస్పెండ్ చేయాలని కూడా డి.శ్రీనివాస్ టీఆర్ ఎస్ అధిష్టానంపై అసహానాన్ని వ్యక్తం చేశారు.

అయితే, ఆ చ‌ర్య‌ను గులాబీ ద‌ళ‌ప‌తి తీసుకోలేదు. దీంతో డీఎస్‌ తిరిగి కాంగ్రెస్ గూటికి చేరనున్నారని చ‌ర్చ మొద‌లైంది. గత రెండు నెలలుగా అదిగో చేరుతా ఇదిగో చేరుతా అంటూ ఆయ‌న లీకులు ఇచ్చారు. అయితే, ఈ ముసుగులో గుద్దులాటలకు డీఎస్ స్వస్తి పలికి కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు రాహుల్ గాంధీ సమక్షంలో పార్టీ తీర్థం పుచ్చుకోనున్నారని - అందులో భాగంగా డీఎస్ ఇప్పటికే హస్తినకు బయలుదేరారని. శనివారం ఉదయం 10 గంటలకు రాహుల్ గాంధీతో సమావేశం కానున్నారని వార్త‌లు వ‌చ్చాయి. అయితే, ఇక్క‌డే అస‌లు ట్విస్ట్ చోటుచేసుకుంది. రాహుల్ గాంధీతో స‌మావేశ‌మైన డీఎస్ కాంగ్రెస్ కండువా కప్పుకోలేదు! కేవ‌లం ఆయ‌న‌తో స‌మావేశ‌మై `ముఖ్య‌మైన అంశాల‌`పై చ‌ర్చించారు!!. అనంత‌రం ఢిల్లీలో మీడియాతో మాట్లాడుతూ తాను కాంగ్రెస్ చేరిన‌ట్లు ఎవ‌రు చెప్పారని ప్ర‌శ్నించారు.

అయితే, డీఎస్ ఈ ట్విస్ట్ ఇవ్వ‌డం వెనుక కేసీఆర్ స్ఫూర్తి అని అంటున్నారు. కాంగ్రెస్ పార్టీ త‌ర‌ఫున ఎంపీగా గెలిచి టీఆర్ ఎస్‌ లో చేరిన ఎంపీ గుత్తా సుఖేంద‌ర్‌ రెడ్డి విష‌యంలో కేసీఆర్ ఇదే ఫార్ములా అమ‌లుచేశారు. ఆయ‌న‌కు పార్టీ కండువా క‌ప్ప‌లేదు. త‌ద్వారా అన‌ర్హ‌త వేటు ప‌డ‌కుండా తెలివిగా వ్య‌వ‌హ‌రించారు! స‌రిగ్గా అదే ఫార్ములాను డీఎస్ అమ‌ల్లో పెట్టారు!! పార్టీ కాంగ్రెస్‌ కు చేరువ అయిన‌ప్ప‌టికీ...ఆయ‌న కండువా క‌ప్పుకోలేదు, చేరినట్లుగా ప్ర‌క‌టించ‌లేదు. దీంతో...అన‌ర్హ‌త వేటుకు అవ‌కాశం లేదు. స్థూలంగా డీఎస్‌...కేసీఆర్ ఫార్ములాతోనే...ఆయ‌న‌కు షాక్ ఇచ్చార‌ని అంటున్నారు.