Begin typing your search above and press return to search.

మాటల ‘దాడి’.. మరిలేదిక దారి

By:  Tupaki Desk   |   18 Oct 2016 8:45 AM GMT
మాటల ‘దాడి’.. మరిలేదిక దారి
X
రాజకీయ నిరుద్యోగి అయిన మాజీ మంత్రి దాడి వీరభద్రరావుకు టీడీపీలోకి రావడానికి అన్ని దారులు మూసుకుపోయినట్లుగా కనిపిస్తున్నాయి. ఒకప్పుడు టీడీపీలో ఒక వెలుగు వెలిగి ఆ తరువాత పార్టీలు మారి..వాటి నుంచి బయటకు వచ్చేసి ఇప్పుడు ఏ పార్టీలోనూ లేకుండా ఖాళీగా ఉన్న ఆయన కొన్నాళ్లుగా టీడీపీలోకి వచ్చేందుకు విశ్వప్రయత్నాలు చేస్తున్నారు. అయితే.. విశాఖలో ఇప్పటికే అయ్యన్న - గంటా రెండు వర్గాలుగా ఉండడంతో మళ్లీ దాడిని తెచ్చి నెత్తిన పెట్టుకోవడం ఎందుకున్న ఉద్దేశంలో చంద్రబాబు ఆయన అప్లికేషన్ ను పెండింగులో పెట్టారు. అయితే... ఈలోగా దాడి తాజాగా చేసిన వ్యాఖ్యలు చంద్రబాబు పెండింగులో ఉన్న ఆ అప్లికేషన్ ను చెత్తబుట్టలో పడేసే పరిస్థితులు కల్పిస్తున్నాయి. దీంతో దాడికి దారి దొరకడం కష్టమేనని తెలుస్తోంది.

టీడీపీలో చేరేందుకు విశ్వప్రయత్నాలు చేస్తున్న దాడి కొన్నాళ్లుగా తన నోటిని అదుపులో పెట్టుకుని కామ్ గా ఉన్నారు. కానీ,ఇంతలో ఏమైందో ఏమో కానీ సడెన్ గా చంద్రబాబుపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఎన్టీఆర్ కు వీరాభిమాని అయిన ఆయన ఎన్టీఆర్ కు భారతరత్న కోరకపోవడంపై చంద్రబాబుపై పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఒక టీవీ చానెల్ ఇంటర్వ్యూలో ఆయన చేసినవ్యాఖ్యలు చంద్రబాబుకు కోపం తెప్పించినట్లు తెలుస్తోంది. ఎన్టీఆర్‌ కు భారతరత్న ఇప్పించడంలో చంద్రబాబు విఫలమయ్యారని..ఆయన తలచుకుంటే ఎన్టీఆర్ కు భారతరత్న ఇవ్వడం ఏమంత కష్టం కాదని.. కానీ.. ఎన్టీఆర్ కు భారత రత్న ప్రకటిస్తే ఆయన భార్యగా లక్ష్మీపార్వతి ఆ అవార్డును అందుకుంటారనే ఉద్దేశంతో చంద్రబాబు ఎన్టీఆర్‌ కు భారతరత్న రాకుండా మోకాలడ్డుతున్నారని ఆయన అన్నారు.

మరోవైపు ప్రత్యేక హోదా సాధించడంలో కూడా చంద్రబాబు సీరియస్ గా లేరని దాడి అన్నారు. కేంద్రంపై చంద్రబాబు ఒత్తిడి తేగలరని.. కానీ, ప్రత్యేక హోదా కోసం పెద్దగా ప్రయత్నించడం లేదని ఆరోపించారు. అంతేకాదు.. రుణమాఫీ పథకం అమలులోని లోపాలను కూడా దాడి ఎత్తి చూపారు. చంద్రబాబును అంత సునిశితంగా విమర్శించిన తరువాత కూడా ఆయన్ను టీడీపీలోకి రానివ్వడం కష్టమేనని అంటున్నారు. దీంతో అటు వైసీపీలోకి వెళ్లలేక... టీడీపీలోకి రానివ్వక దాడి మళ్లీ త్రిశంకు స్వర్గంలో ఉండక తప్పదంటున్నారు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/