Begin typing your search above and press return to search.

మంత్రి గారి బాధితులకు సజ్జల ఓదార్పు దక్కిందా...?

By:  Tupaki Desk   |   22 Aug 2022 2:30 AM GMT
మంత్రి గారి బాధితులకు సజ్జల ఓదార్పు దక్కిందా...?
X
ఉమ్మడి విశాఖ జిల్లాలో ఆయన పేరున్న రాజకీయ నాయకుడు. ఆయనే మాజీ మంత్రి దాడి వీరభద్రరావు. ఆయన టీడీపీలో ఉన్నపుడు ఒక వెలుగు వెలిగారు. అదేంటో ఒక్కసారి సైకిల్ దిగిపోయాక ఆయన మళ్లీ పదవి చేపడితే ఒట్టు అన్నట్లుగా పొలిటికల్ సీన్ తయారైంది. దాంతో ఆయన అటు తిరిగి ఇటు తిరిగి వైసీపీలో ఇప్పటిదాకా ఉంటూ వచ్చారు. తన సీనియారిటీకి కనీసం ఎమ్మెల్సీ అయినా ఇస్తారు అనుకుంటే అదీ దక్కలేదు. తన రాజకీయ వారసుడు కుమారుడు దాడి రత్నాకర్ కి నామినేటెడ్ పదవి కూడా దక్కలేదు.

దాంతో దీనికంతటికీ అనకాపల్లి ఎమ్మెల్యే కమ్ యువ మంత్రి అయిన గుడివాడ అమరానాధ్ కారణమని దాడి ఫ్యామిలీ అనుమానించి ఆగ్రహిస్తోంది. గుడివాడ ఎక్కడ నుంచో అనకాపల్లి వచ్చి పోటీ చేస్తే తమ వంతుగా సహకరించి గెలిపించామని ఆయన ఆ తరువాత తమను ఏ మాత్రం ఖాతరు చేయడంలేదు అన్న బాధా వారికి ఉంది. దానికి తోడు జగన్ వద్ద ఉన్న సాన్నిహిత్యంతో అమరనాధ్ తమకు ఏ రాజకీయ అవకాశం లేకుండా చేస్తున్నారని కూడా అనుమానిస్తున్నారు.

అంతేకాదు పార్టీ నుంచి తాము వెళ్ళిపోయేలా కూడా చేస్తున్నారు అని మధన పడుతున్నారుట. తమ గోడుని చెప్పుకుందామనుకుంటే విజయసాయిరెడ్డి కూడా అమరనాధ్ కే మద్దతు ఇచ్చేవారు. ఇక కొత్తగా రీజనల్ కో ఆర్డినేటర్ అయిన వైవీ సుబ్బారెడ్డికి కూడా తమ గోడు చెప్పుకున్నా ఏమీ ప్రయోజనం సమకూరలేదు. ఈ నేపధ్యంలో అనుకోని వరంలా అనకాపల్లికే నేరుగా ప్రభుత్వ సలహాదారు, జగన్ కుడి భుజం అయిన సజ్జల రామక్రిష్ణారెడ్డి రావడంతో దాడి ఫ్యామిలీ ఆయన్ని కలసి తమ గోడు అంతా చెప్పుకుంది అని అంటున్నారు.

ఆయన కూడా మాజీ మంత్రి ఆయన కుమారుడు చెప్పిన దాన్ని సాదరంగా విన్నారని అంటున్నారు. అదే సమయంలో పెందుర్తి ఎమ్మెల్యే అదీప్ రాజ్ కూడా సజ్జలను కలసి తన గోడు కూడా వెళ్ళబోసుకున్నారని భోగట్టా. తన సీటుకు ఎసరు పెట్టేలా మంత్రి గుడివాడ చేస్తున్నారని ఆయన చెప్పుకున్నట్లుగా తెలుస్తోంది. తనకు మళ్లీ వచ్చే ఎన్నికల్లో టికెట్ ఇవ్వాలని కూడా ఆయన కోరినట్లుగా చెబుతున్నారు.

మొత్తానికి చూస్తే దాడి ఫ్యామిలీ సహా మంత్రి బాధితులు సజ్జల ముందు తమ బాధను చెప్పుకున్నారని ప్రచారం అయితే సాగుతోంది. మరి సజ్జల ఈ విషయాలు అన్నీ జగన్ ముందు పెట్టి వీరికి న్యాయం చేస్తారా లేక వారి వద్ద ఉన్న నివేదికల మేరకే నిర్ణయం తీసుకుంటారా అన్నది చూడాలి. ఏది ఏమైనా తమకు వైసీపీలో మొర ఆలకించి తగిన చాన్స్ ఇవ్వకపోతే వేరే పార్టీలోకి వెళ్లడానికి కూడా మంత్రి బాధితులు ప్లాన్ బీ రెడీ చేసుకున్నారని అంటున్నారు.