Begin typing your search above and press return to search.

వైసీపీకీ గట్టి పాఠమే : దాడి మాస్టారు సైకిలెక్కేస్తారా...?

By:  Tupaki Desk   |   19 Jun 2022 5:30 AM GMT
వైసీపీకీ గట్టి పాఠమే :  దాడి మాస్టారు సైకిలెక్కేస్తారా...?
X
ఎన్టీయార్ డిస్కవరి దాడి మాస్టార్. ఆయన అనకాపల్లి నుంచి 1985లో ఎన్టీయార్ చలవతో తొలిసారి గెలిచారు. 1983లో టీడీపీ అభ్యర్ధిగా తొలి ఎన్నికల్లో రాజా కన్నబాబు గెలిచి నాదెండ్ల భాస్కరరావు వర్గంలోకి ఫిరాయించడంతో అప్పట్లో స్థానికంగా మాస్టారుగా ఉన్న దాడి వీరభద్రరావుని పిలిచి మరీ ఎన్టీయార్ టికెట్ ఇచ్చారు. అలా రాజకీయ ప్రవేశం చేసిన దాడి 1999 ఎన్నికలతో కలిపి నాలుగు సార్లు గెలిచి 19 ఏళ్ళ పాటు ఎమ్మెల్యేగా మంత్రిగా పనిచేశారు.

ఇక ఆయన ఇప్పటికి 23 ఏళ్ళుగా ఎమ్మెల్యేగా అనకాపల్లి సీటులో నెగ్గలేదు. అయితే 2006లో ఏర్పడిన శాసనమండ‌లికి ఒకసారి ఎమ్మెల్సీగా నెగ్గి ఆరేళ్ల పాటు అక్కడ పనిచేశారు. అలాగే శాసనమండలిలో విపక్ష నేతగా కూడా ఆయన ఉన్నారు. రెండవమారు ఎమ్మెల్సీ ఇవ్వలేదు అన్న కారణంతో టీడీపీకి గుడ్ బై కొట్టి జగన్ పార్టీలో చేరారు. 2014లో తన కుమారుడు రత్నాకర్ కి వైసీపీ తరఫున టికెట్ ఇప్పించుకున్నా ఓడిపోయారు. దాంతో వైసీపీకి గుడ్ బై కొట్టారు.

ఇక 2019 ఎన్నికలలో తిరిగి మరోమారు వైసీపీ చేరినా జగన్ అయితే టికెట్ ఇవ్వలేదు. మూడేళ్ళు గడిచేసరికి దాడి మాస్టార్ కి అన్నీ అర్ధం అయిపోయాయి. వైసీపీలో తనకు ఎమ్మెల్సీ ఇవ్వలేదు. తన కుమారుడికి వచ్చే ఎన్నికల్లో టికెట్ దక్కదని కూడా తేలిపోయిన క్రమంలో ఆయన చాలా కాలంగా పక్క చూపులు చూస్తున్నారు అని టాక్ నడుస్తోంది. ఇక ఆ మధ్య దాడి జనసేనలో చేరుతారు అని ప్రచారం అయితే గట్టిగా సాగింది.

విశాఖ టూర్ లో భాగంగా 2018లో జనసేనాని పవన్ కళ్యాణ్ దాడి వీరభద్రరావు ఇంటికి వెళ్ళి ఆయనకు కలిశారు. ఈ సందర్భంగా పార్టీలో చేరమని కోరారు. కానీ దాడి ఆ ఆఫర్ ని కాదని వైసీపీలో చేరారు. దాంతో ఆయన జనసేనలోకి వెళ్ళాలనుకున్నా అక్కడ వర్కౌట్ కాదని భావిస్తున్నారుట. దాంతో ఇపుడు ఆయన చూపు మాతృ సంస్థ టీడీపీ మీద పడింది అంటున్నారు.

ఇక ఉమ్మడి విశాఖ జిల్లాలో చంద్రబాబు టూర్ గ్రాండ్ సక్సెస్ కావడంతో దాడి అనుచరులు సైతం మాస్టార్ మీద తెగ వత్తిడి తెస్తున్నారుట. ఇక మంచి రోజు చూసుకుని దాడి మాస్టార్ టీడీపీ అధినాయకత్వం టచ్ లోకి వెళ్తారు అని అంటున్నారు. దాడి వీరభద్రరావు తన కుమారుడు రత్నాకర్ కి అనకాపల్లి టికెట్ అడుగుతున్నారు. దానికి కనుక హామీ లభిస్తే ఆయన పార్టీలో చేరిపోవడం ఖాయం అని అంటున్నారు.

ఒకవేళ అనకాపల్లి నుంచి ఎంపీ టికెట్ ఇచ్చినా ఓకే అనేస్తారు అంటున్నారు. ఎందుకంటే ఎంపీ సీటుకు టీడీపీ ఇంకా అభ్యర్ధులు ఎవరూ లేరు. అందుకే కర్చీఫ్ ముందుగా వేసేస్తే బాగుంటుంది అని ఆలోచిస్తున్నారుట. మొత్తానికి దాడి మాస్టార్ సైకిలెక్కేయడం ఖాయమని గట్టిగా ప్రచారంలో ఉన్న వార్త.