Begin typing your search above and press return to search.

బీజేపీకి నోటా కంటే ఎక్కువ ఓట్లు వ‌చ్చేనా చిన్న‌మ్మా?

By:  Tupaki Desk   |   14 July 2022 2:30 PM GMT
బీజేపీకి నోటా కంటే ఎక్కువ ఓట్లు వ‌చ్చేనా చిన్న‌మ్మా?
X
2004, 2009 ఎన్నిక‌ల్లో బాప‌ట్ల‌, విశాఖ‌పట్నం ఎంపీగా గెలిచారు.. ద‌గ్గుబాటి పురందేశ్వ‌రి. కాంగ్రెస్ పార్టీ నుంచి గెలిచిన చిన్న‌మ్మ (పురందేశ్వ‌రిని ఇలాగే పిలుస్తారు) ఆ త‌ర్వాత కేంద్రంలోని కాంగ్రెస్ ప్ర‌భుత్వంలో కేంద్ర స‌హాయ మంత్రిగానూ ఛాన్సు కొట్టేశారు. ఆ త‌ర్వాత ఏపీ విభ‌జ‌న‌తో కాంగ్రెస్ ఏపీలో నామ‌రూపాల్లేకుండా తుడిచిపెట్టుకుపోవ‌డంతో పురందేశ్వ‌రి కూడా త‌న రాజ‌కీయ భ‌విష్య‌త్తు కోసం బీజేపీలో చేరిపోయారు. ప్ర‌స్తుతం బీజేపీలో జాతీయ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి హోదాలో ఉన్నారు.

ఈ నేప‌థ్యంలో వ‌చ్చే అసెంబ్లీ ఎన్నిక‌ల్లో ఆంధ్ర‌ప్ర‌దేశ్ లో బీజేపీ 175కి 175 సీట్లు సాధించాల‌ని ల‌క్ష్యంగా పెట్టుకున్న‌ట్టు చిన్న‌మ్మ చెబుతున్నారు. దీనిపై ఏపీ ప్ర‌జ‌లు, నెటిజ‌న్లు పురందేశ్వ‌రిపై సెటైర్లు వేస్తున్నారు. అస‌లు నోటా కంటే ఎక్కువ ఓట్లు వ‌స్తే చాల‌ని.. 175కి 175 సీట్లు సీట్లు సాధించాల‌నే ల‌క్ష్యం ఏమిటంటూ ఎద్దేవా చేస్తున్నారు. ఏదైనా పార్టీతో పొత్తు పెట్టుకుంటే త‌ప్ప ఇంత‌వ‌ర‌కు ఏదో ఒక‌టి రెండు సంద‌ర్భాల్లో మిన‌హాయించి.. బీజేపీ ఒక్క సీటు కూడా గెలిచినా దాఖ‌లా ఏపీలో లేదు. అలాంటిది 175కి 175 అసెంబ్లీ సీట్లు సాధించాల‌నే ల‌క్ష్యం పెట్టుకోవ‌డంపై ప్ర‌జ‌లు, నెటిజ‌న్లు సెటైర్లు వేస్తున్నారు.

ప్ర‌స్తుతం బీజేపీ-జ‌న‌సేన‌తో పొత్తు పెట్టుకుంది. అయితే ఇటీవ‌ల ప‌రిణామాల‌తో ఈ రెండు పార్టీల మ‌ధ్య అగాధం ఏర్ప‌డింద‌ని చెబుతున్నారు. ప‌వ‌న్ క‌ల్యాణ్ ను త‌మ కూట‌మి త‌ర‌ఫున ముఖ్య‌మంత్రి అభ్య‌ర్థిగా ప్ర‌క‌టించ‌క‌పోవ‌డం, ప్ర‌ధాని న‌రేంద్ర మోదీ, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ న‌డ్డా ఆంధ్రాలో ప‌ర్య‌టించినా ప‌వ‌న్ క‌ల్యాణ్ ను పట్టించుకోక‌పోవ‌డం వంటి చ‌ర్య‌లు జ‌న‌సేన పార్టీకి ఆగ్ర‌హం తెప్పించాయ‌ని చెబుతున్నారు.

జ‌న‌సేన‌తో పొత్తు ఉంటే ఏ ఒక‌టో, రెండో సీట్లైనా బీజేపీ గెలుచుకునే అవ‌కాశం ఉండేది. ఇప్పుడు జ‌న‌సేన కూడా బీజేపీ పొత్తు నుంచి బ‌య‌ట‌ప‌డుతుంద‌ని చెబుతున్నారు. ఈ నేప‌థ్యంలో బీజేపీతో అంట‌కాగ‌డానికి ఎవ‌రూ సిద్ధంగా లేర‌ని అంటున్నారు. ఈ నేప‌థ్యంలో బీజేపీ అస‌లు ఒక్క చోట గెలుచుకున్నా అది ఎనిమిదో వింతేన‌ని పేర్కొంటున్నారు. అలాంటిది 175కి 175 సీట్లు లక్ష్యం ఎలా సాధ్యం చిన్న‌మ్మా అని నిల‌దీస్తున్నారు.

కేంద్రంలోని బీజేపీ ప్ర‌భుత్వం రాష్ట్రానికి చేసిందేమీ లేద‌ని అంటున్నారు. ప్ర‌త్యేక హోదా, విశాఖ రైల్వే జోన్, విశాఖ స్టీల్ ప్లాంట్ ఇలా ప్ర‌తి వ్య‌వ‌హారంలోనూ ఏపీకి సున్న‌మేసింద‌ని గుర్తు చేస్తున్నారు. ఇలాంటి ప‌రిస్థితుల్లో బీజేపీకి 175కి 175 సీట్లు ల‌క్ష్యం నెర‌వేర‌డం అసాధ్య‌మ‌ని చెబుతున్నారు. 2019 ఎన్నిక‌ల్లో ఏపీలో ఒక్క‌చోట కూడా బీజేపీకి డిపాజిట్ కూడా రాలేద‌ని గుర్తు చేస్తున్నారు. ఆ త‌ర్వాత జ‌రిగిన బ‌ద్వేలు, ఆత్మ‌కూరు శాస‌న‌స‌భ స్థానాల ఉప ఎన్నిక‌లు, తిరుప‌తి పార్ల‌మెంట్ ఉప ఎన్నిక‌ల్లోనూ బీజేపీకి ఇదే గ‌తి ప‌ట్టింద‌ని చెబుతున్నారు. ఈ నేప‌థ్యంలో వ‌చ్చే ఎన్నికల్లోనూ ఆ పార్టీకి గుండు సున్నానే ల‌భిస్తుంద‌ని ఢంకా బ‌జాయించి పేర్కొంటున్నారు.

అస‌లు 175కి 175 నియోజ‌క‌వ‌ర్గాలు అనే ల‌క్ష్యం కంటే ముందు అన్ని నియోజ‌క‌వ‌ర్గాల్లో పోటీ చేయ‌డ‌మే బీజేపీకి ఎక్కువ అంటున్నారు. 175 నియోజకవర్గాల్లో పోటీ చేయ‌డానికి అభ్య‌ర్థులు కూడా లేర‌ని గుర్తు చేస్తున్నారు. ముందు ఈ లక్ష్యాన్ని సాధించాల‌ని ఎద్దేవా చేస్తున్నారు. అలాగే బీజేపీ నోటాకు వ‌చ్చిన ఓట్ల‌ను మించి సాధించినా గొప్పేన‌ని అంటున్నారు. నోటాను మించి ముందు ఓట్లు సాధించాల‌ని చిన్న‌మ్మ‌కు ప్ర‌జ‌లు, నెటిజ‌న్లు స‌వాలు విసురుతున్నారు.