Begin typing your search above and press return to search.

అక్క ఆనందం...మరి తమ్ముడు... ?

By:  Tupaki Desk   |   26 Jan 2022 12:30 PM GMT
అక్క ఆనందం...మరి తమ్ముడు... ?
X
కొత్త జిల్లాల ఏర్పాటు అన్నది ఒక కీలక నిర్ణయం అయితే తెలుగు వల్లభుడు, తెలుగు జాతి నిత్య‌ చైతన్యం అయిన ఎన్టీయార్ పేరు ఒక జిల్లాకు పెట్టడం సంచలనం. మరి ఎన్టీయార్ కి ఈ పేరు పెట్టడంతో ఆయన ఒకే రీతిన ఏలిన సినీ రాజకీయ రంగాల స్పందన ఎలా ఉంటుందో అన్న ఆసక్తి అయితే సర్వత్రా ఉంది. సినీ రంగంలో శిఖరాయమానమైన కీర్తిని ఆర్జించిన ఎన్టీయార్ పేరుతో జిల్లా వస్తూంటే ఆ రంగంలో లబ్ద ప్రతిష్టులు అయిన వారు ఎలా స్వాగతిస్తారు, ఎలా దీన్ని అక్కున చేర్చుకుంటున్నారు అన్నది ఒక ఇంటరెస్టింగ్ మ్యాటర్.

అదే టైమ్ లో ఆయన పెట్టిన పార్టీ ఈ రోజుకీ ఏపీలో ఉంది. అది ఫ్రంట్ లైన్ లో ఉంటూ రేపటి రోజున అధికారం అని పోరాడుతోంది. మరి ఆ పార్టీ రెస్పాన్స్ ఏంటి అంటే ఫుల్ సైలెన్స్ అన్నట్లుగా ఇప్పటికి సీన్ ఉంది. దానికి రాజకీయ కారణాలు ఉన్నాయనుకున్నా ఎన్టీయార్ ఫ్యామిలీ మెంబర్స్ ఎలా రియాక్ట్ అవుతున్నారు అన్నది కూడా ప్రజలలో చర్చగా ఉంది.

అయితే ఎన్టీయార్ కుమార్తె. కేంద్ర మాజీ మంత్రి, బీజేపీ సీనియర్ నాయకురాలు అయిన దగ్గుబాటి పురంధేశ్వరి ఈ నిర్ణయం పట్ల హర్షం వ్యక్తం చేయడం విశేషం. ఎన్టీయార్ పుట్టిన గడ్డకు ఆయన పేరుతో జిల్లాను చేయడం మంచి పరిణామమని, స్వాగతిస్తున్నామని పురంధేశ్వరి చెప్పారు. తెలుగు జాతి అంతా ఏనాటి నుంచి అది కోరుకుంటోందని కూడా పురంధేశ్వరి అన్నారు.

మొత్తానికి అన్న గారింట పురంధేశ్వరి రియాక్ట్ అయి హర్షం వ్యక్తం చేశారు. మరి ఆయన కుమారుడు, పురంధేశ్వరి తమ్ముడు నందమూరి బాలక్రిష్ణ ఉన్నారు. ఆయన టాలీవుడ్ లో టాప్ హీరో, అంతే కాదు, హిందూపురం ఎమ్మెల్యే. మరి ఆయన ప్రాతినిధ్యం వహిస్తున్న హిందూపురాన్ని కూడా జిల్లాగా చేశారు. ఇక ఏకంగా తండ్రి పేరిట జిల్లాను ప్రకటించారు. మరి బాలయ్య రియాక్షన్ ఏంటి అన్నది కూడా అంతా ఎదురుచూస్తున్నారు.

మరో వైపు ఏకంగా ఎన్టీయార్ పేరునే పెట్టుకుని మనవడు సినీ రంగాన మూడవ తరం హీరోగా ఉన్నారు. ఆయనే జూనియర్ ఎన్టీయార్. దీని మీద ఇప్పటివరకూ ఆయన స్పందిన లేదు. మరి ఆయన తాత పేరును శాశ్వతం చేస్తూ కొత్త జిల్లా రావడం పట్ల ఎలా రెస్పాండ్ అవుతారో చూడాలి.

ఏది ఏమైనా ఎన్టీయార్ తెలుగు వారి ఆస్తి, ఆయన అందరివాడు. ఆయనకు రాజకీయాలు లేవు. ఆయనకు అవి తెలియదు కూడా. అంతటి మహా నాయకుడు, మేరు నగధీరుడు అయిన ఎన్టీయార్ పేరిట ఒక మంచి కార్యక్రమాన్ని తీసుకుంటే దానికి సినీ రాజకీయ రంగాల నుంచి పెద్ద ఎత్తున స్వాగతించే పరిస్థితి ఉండాలని అంతా కోరుకోవడంలో తప్పులేదు. అలా జరగాలని అంతా ఆశిస్తున్నారు కూడా.