Begin typing your search above and press return to search.

టార్గెట్ టీడీపీ : బీజేపీ ప్రెసిడెంట్ గా అన్న గారి అమ్మాయి...?

By:  Tupaki Desk   |   20 Jun 2022 1:52 PM GMT
టార్గెట్ టీడీపీ  :  బీజేపీ ప్రెసిడెంట్ గా  అన్న గారి అమ్మాయి...?
X
ఎన్టీయార్ రాజకీయ రంగంలో సృష్టించిన రికార్డులు ఇన్నీ అన్నీ కావు. అయితే ఆయన వారసులు మాత్రం అంతలా రాణించలేకపోయారు అన్న బాధ అయితే ఫ్యాన్స్ లో ఉంది. ఉన్నంతలో కూతురు దగ్గుబాటి పురంధేశ్వరి రాజకీయాల్లో బాగానే తన వంతుగా కృషి చేస్తున్నారు. ఆమె కాంగ్రెస్ లో చేరి ఫస్ట్ అటెంప్ట్ తోనే ఎంపీ అయ్యారు. కేంద్ర మంత్రిగా కూడా పనిచేశారు. ఇక బీజేపీలో చేరి జాతీయ స్థాయిలో కీలకమైన పదవిలో ఉన్నా కూడా ఆమె ఇంకా అదృష్టం కోసం ఎదురుచూస్తూ వస్తున్నారు.

అయితే తెలుగు రాష్ట్రాల మీద దృష్టి సారించిన బీజేపీ అధినాయకత్వానికి అన్న గారి అమ్మాయి గుర్తుకు వచ్చింది. ఆమెను తెచ్చి ఏపీ బీజేపీకి కొత్త ప్రెసిడెంట్ ని చేస్తే ఎలా ఉంటుంది అన్నదే అమిత్ షా మాస్టర్ ప్లాన్. ఆమె కోస్తాలోని బలమైన సామాజిక వర్గానికి చెందిన వారు. కేంద్ర మంత్రిగా కూడా పనిచేశారు. ఇక ఎన్టీయార్ తనయ అన్న గ్లామర్ ఎటూ ఉంది.

దానికి తోడు ఏపీలో రాజకీయ పరిణామాలను నిశితంగా గమనిస్తున్న బీజేపీ టీడీపీ మీదనే ఫోకస్ పెట్టింది. చంద్రబాబు రాజకీయానికి ఆట కట్టిస్తే అటక మీద ఉన్న బీజేపీకి మహర్దశ దక్కుతుందన్న లెక్కలేవో ఉన్నాయి. పైగా ఏపీలో కమ్మ సామాజికవర్గానికి ఈ రోజుకీ టీడీపీయే దిక్కుగా ఉంటోంది.

దానికి పోటీగా ఏకంగా అన్న గారి కూతురినే ఇటు వైపు పెట్టి ఆకట్టుకునేలా చేస్తే పార్టీ బలపడుతుంది అన్న అంచనాలు ఉన్నాయట. అంతే కాదు, టీడీపీ నుంచి కూడా పెద్ద ఎత్తున వలసలు ప్రోత్సహించాలన్న ఆలోచనలు కూడా ఉన్నట్లు కనిపిస్తోంది. మంచి వక్తగా సమకాలీన రాజకీయల మీద అవగాహన కలిగిన దగ్గుబాటి పురంధేశ్వరిని కనుక బీజేపీ అధ్యక్షురాలిని చేస్తే ఎన్నో రాజకీయ లాభాలు కలుగుతాయని బీజేపీ అంచనా వేస్తోంది.

ఇక కాపు సామాజికవర్గానికి చెందిన సోము వీర్రాజుని బీజేపీ ప్రెసిడెంట్ గా చేసినా పార్టీ పెద్దగా ఎత్తిగిల్లలేదు. దాంతో కేంద్ర నాయకత్వం మరో ప్రయోగం చేస్తోంది. ఈ ప్రయోగం గురి కచ్చితంగా టీడీపీ మీదనే ఉందని పురంధేశ్వరిని ఎంపిక చేయాలనుకోవడం తోనే అర్ధమవుతోంది.

మరి పురంధేశ్వరి ఏపీలో బీజేపీని ఎంతవరకూ పటిష్టం చేయగలరు అన్నది చూడాలి. కొద్ది రోజులలో ముగియబోతున్న సోము వీర్రాజు పదవీకాలం తరువాత చిన్నమ్మకే పార్టీ పగ్గాలు దక్కుతాయని అంటున్నారు. ఏపీలో వైసీపీ టీడీపీ, జనసేన వంటి మూడు ప్రాంతీయ పార్టీల మధ్య నిలదొక్కుకుని వాటిలో ఉన్న అసంతృప్తిని బీజేపీ వైపుగా మళ్ళించగలిగే నేర్పు, ఓర్పు పురంధేశ్వరి కనబరాల్సి ఉంది.

ఏది ఏమైనా బీజేపీ ఈ ఎన్నికలు కాదు, 2029 ఎన్నికల మీద దృష్టి పెట్టింది అంటున్నారు. అంటే 2024లో టీడీపీని దెబ్బతీసి తాము ముందు వరసకు రావాలని, 2029 నాటికి ఏకంగా అధికారం చేపట్టాలని ప్లాన్ చేస్తోంది. ఇక మిత్రపక్షంగా జనసేన ఉంది. పవన్ కళ్యాణ్ ఎటూ బలమైన సామాజికవర్గానికి చెందిన వారే కాబట్టి కోస్తాలో మరో బలమైన సామాజికవర్గానికి చెందిన పురంధేశ్వరిని ఎంచుకున్నారని తెలుస్తోంది. మొత్తానికి అన్న గారి కూతురు అధ్యక్షురాలు అయితే ఏపీ బీజేపీలో కొత్తదనం రావడం ఖాయం అనే చెప్పాలి.