Begin typing your search above and press return to search.

ఎన్టీఆర్ ఘాట్ ద‌గ్గ‌ర చిన్న‌మ్మ మాట‌లు విన్నారా?

By:  Tupaki Desk   |   28 May 2018 7:13 AM GMT
ఎన్టీఆర్ ఘాట్ ద‌గ్గ‌ర చిన్న‌మ్మ మాట‌లు విన్నారా?
X
తెలుగువారికి ఇద్ద‌రు చిన్న‌మ్మ‌లు ఉన్నారు. ఒక‌రు తెలుగు చిన్న‌మ్మ (పురంధేశ్వ‌రి) అయితే.. మ‌రొక‌రు ఉత్త‌రాది చిన్న‌మ్మ (సుష్మా స్వ‌రాజ్). ఇద్ద‌రూ ఇద్ద‌రే. ఇద్ద‌రిని ఎంతో అప్యాయంగా చిన్న‌మ్మ అని తెలుగోళ్లు నోరారా పిలుచుకున్నా.. తెలుగు రాష్ట్రాల‌కు చేసిందేమీ లేదు. ఉత్త‌రాది చిన్న‌మ్మ‌కు తెలుగు రాష్ట్రాల మీద మ‌క్కువ ఎందుకు ఉంటుంద‌నుకొని స‌ర్దిచెప్పుకోవ‌చ్చు.కానీ.. మ‌న తెలుగు చిన్న‌మ్మకు తెలుగు రాష్ట్రాలు ఎందుకు ప‌ట్ట‌వో అర్థం కాదు. అన్నింటికి మించి ఆమె ప్రాతినిధ్యం వ‌హించే ఏపీ విష‌యంలో ఆమె తీరు ఎప్పుడూ చిత్రంగా ఉంటుంది. విభ‌జ‌న వేళ‌.. త‌న‌కు మంత్రి ప‌ద‌వులు ఇచ్చినందుకు సోనియ‌మ్మ‌కు విదేయురాలిగా ఉన్న ఆమె.. విభ‌జ‌న త‌ర్వాత బీజేపీలో చేరి.. ప్ర‌త్యేక హోదాకు హ్యాండ్ ఇచ్చినా పెద్ద‌గా ఫీల్ కాన‌ట్లుగా ఉంటారు. ఏ పార్టీలో ఉంటారో ఆ పార్టీ ప్ర‌యోజ‌నాలే త‌ప్పించి ప్ర‌జా ప్ర‌యోజ‌నాలు ఎంత‌మాత్రం ప‌ట్టని తీరు పురంధేశ్వ‌రిలో ఎక్కువేన‌న్న విమ‌ర్శ జోరుగా వినిపిస్తూ ఉంటుంది. ఆస‌క్తిక‌ర‌మైన మ‌రో అంశం ఏమిటంటే.. నిత్యం ఏపీ గురించి మాట్లాడే ఆమె.. త‌న నివాసాన్ని మాత్రం హైద‌రాబాద్ కే ప‌రిమితం చేసుకోవ‌టం క‌నిపిస్తుంది. అత్త‌గారిల్లు ప్ర‌కాశం జిల్లా కారంచేడులో ఉన్నా.. అక్క‌డి కంటే హైద‌రాబాద్‌ లోనే ఎక్కువ‌గా ఉంటుంటారు.

తాజాగా త‌న తండ్రిఎన్టీఆర్ జ‌యంతిని పుర‌స్క‌రించుకొని నెక్లెస్ రోడ్డులోని ఘాట్ వ‌ద్ద ఎన్టీఆర్ కు నివాళులు అర్పించేందుకు వ‌చ్చారు.ఈ సంద‌ర్భంగా ఏపీ విప‌క్ష నేత జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి.. ఎన్టీఆర్ కుమారుడు హ‌రికృష్ణ‌తో పాటు.. ప‌లువురు ప్ర‌ముఖులు చేసే డిమాండ్ల‌ను క‌లిపేసి.. అన్నింటిని ఒక‌టిగా చేసేస్తూ మీడియా ముందు డిమాండ్ల చిట్టా విప్పారు.తాము అధికారంలోకి వ‌చ్చిన వెంట‌నే కృష్ణా జిల్లాను ఎన్టీఆర్ జిల్లా పేరుతో మారుస్తామంటూ జ‌గ‌న్ హామీ ఇచ్చిన సంగ‌తి తెలిసిందే. ఇప్పుడు పురంధేశ్వ‌రి.. అదే హామీని.. డిమాండ్ గా మార్చి వెంట‌నే మార్చాల‌ని కోరుతున్నారు. అంతేనా.. మ‌హానాడును జ‌రిపిన‌ట్లే ఎన్టీఆర్ జ‌యంతిని ఘ‌నంగా నిర్వ‌హించాల‌ని, దానిని జాతి పండుగ‌లా జ‌ర‌పాల‌ని కోరారు. ఎన్టీఆర్ చ‌రిత్ర‌ను పాఠ్యాంశంగా మార్చాలంటూ హ‌రికృష్ణ చేసిన డిమాండ్‌ను త‌న ఖాతాలో వేసుకొని మీడియా ముందు మాట్లాడ‌టం విశేషం. ఇదంతా ఒక ఎత్తు అయితే.. త‌న సోద‌రుడు హ‌రికృష్ణ మ‌హానాడు వేదిక మీద ఉంటే బాగుండేద‌ని అభిప్రాయ‌ప‌డ్డారు.

ఎన్టీఆర్‌ గురించి తెలుగు ప్రజలకు తాను కొత్తగా చెప్పాల్సింది ఏమీ లేదని, ఆయన గురించి అందరికీ తెలిసిందేనని పురంధేశ్వ‌రి అన్నారు. అప్ప‌ట్లో దక్షిణ భారతీయులను మద్రాసీలుగా భావించేవార‌ని గుర్తు చేశారు. ఆ స‌మ‌యంలో తెలుగువారి ఖ్యాతిని ప్ర‌పంచ‌వ్యాప్తంగా చాటిచెప్పిన మహనీయులు ఎన్టీఆర్ అని అన్నారు. తెలుగుజాతి గొప్ప‌ద‌నాన్ని ఎన్టీఆర్ ద‌శ‌దిశ‌లా వ్యాపింప‌జేశార‌ని అన్నారు. రాజకీయాల్లో కొత్త​ ఒరవడిని సృష్టించారని, అనేక సంస్కరణలు చేప‌ట్టి ప్రజాపాల‌న చేశార‌ని పురుంధేశ్వరి చెప్పారు. ఇదంతా బాగానే ఉంది కానీ... ఢిల్లీ పెద్ద‌ల‌కు ఎదురొడ్డి తెలుగు జాతి పౌరుషాన్ని చాటి చెప్పిన అన్న‌గారి కుమార్తె అయిన పురంధ‌రేశ్వ‌రి....ప్ర‌త్యేక హోదాపై - ఏపీకి జ‌రిగిన అన్యాయంపై నోరు మెద‌ప‌క‌పోవ‌డంపై పురంధ‌రేశ్వ‌రి ఆత్మావ‌లోక‌నం చేసుకోవాల్సిన అవ‌సరం ఎంతైనా ఉంది. ఏ ఎండ‌కా గొడుగు అన్న చందంగా విభ‌జ‌న స‌మ‌యంలో కాంగ్రెస్ కు....విభ‌జ‌నానంత‌రం బీజేపీకి వంత‌పాడుతోన్న పురంధ‌రేశ్వ‌రి డిమాండ్ల‌ను ప‌ట్టించుకునేవారెవ‌ర‌న్న‌దే ప్ర‌శ్నార్థ‌కం!