Begin typing your search above and press return to search.

జగన్ గేమ్ ప్లాన్ లో అదొక్కటే వర్కవుట్ కాలేదు!

By:  Tupaki Desk   |   29 May 2019 8:38 AM GMT
జగన్ గేమ్ ప్లాన్ లో అదొక్కటే వర్కవుట్ కాలేదు!
X
ఈ ఎన్నికల్లో దాదాపుగా జగన్ పట్టిందల్లా బంగారం అయ్యింది. అసలు పోటీ ఇస్తారా? అనే సందేహాన్ని కలిగించిన వారు కూడా భారీ మెజారిటీలతో నెగ్గారు. అంతా గాలి మహత్యం. వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గాలి గట్టిగా వీయడంతో అనేక మంది అనూహ్యంగా భారీ మెజారిటీలతో విజయం సాధించారు. ఏపీలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ స్వీప్ చేసింది. తెలుగుదేశం పార్టీ తన చరిత్రలోనూ ఎన్నడూ లేనంత స్థాయి తక్కువ సీట్లకు పరిమితం అయ్యింది.

అయితే ఈ గాలిలో కూడా ఒక్కోచోట మాత్రం జగన్ మోహన్ రెడ్డి ప్లాన్స్ వర్కవుట్ కాలేదు. చంద్రబాబుకు గట్టి ఝలక్ ఇచ్చేందుకు జగన్ వేసిన స్కెచ్ లు చాలా వరకూ వర్కవుట్ అయినా, ఒకటీ రెండు చోట్ల మాత్రం అవి వర్కవుట్ కాలేదు. అలాంటి వాటిల్లో ప్రముఖమైనది దగ్గుబాటి వెంకటేశ్వరరావు ఓటమి.

ఎన్టీఆర్ పెద్దల్లుడిని జగన్ ఈ ఎన్నికల్లో ప్రయోగించిన సంగతి తెలిసిందే. ఎన్నికలకు కొన్ని రోజుల ముందు దగ్గుబాటిని, ఆయన తనయుడుని జగన్ మోహన్ రెడ్డి పార్టీలోకి చేర్చుకున్నారు. ముందుగా దగ్గుబాటి తనయుడిని పర్చూరు నుంచి పోటీ చేయించాలని జగన్ భావించారు. అయితే అతడికి పౌరసత్వ వివాదం ఉండటంతో.. దగ్గుబాటే స్వయంగా పర్చూరు నుంచి పోటీ చేశారు.

ఆయన గెలవడం గ్యారెంటీ - ఆయనను అసెంబ్లీలో స్పీకర్ గా చేసి చంద్రబాబు చేత 'అధ్యక్షా..' అని జగన్ పిలిపించడం గ్యారెంటీ అనే అభిప్రాయాలు వినిపించాయి. అయితే దగ్గుబాటి వెంకటేశ్వరరావు అనూహ్యంగా ఓడిపోయారు. తెలుగుదేశం అభ్యర్థి చేతిలో స్వల్పమైన ఓట్ల తేడాతోనే దగ్గుబాటి వెంకటేశ్వరరావు ఓడిపోయారు. ఇలా జగన్ వేసిన స్కెచ్ దగ్గుబాటి విషయంలో పూర్తిగా పారలేదు.

అయినా జగన్ దగ్గుబాటికి సరైన ప్రాధాన్యతను ఇచ్చే అవకాశం ఉందని, బహుశా ఎమ్మెల్సీగా నామినేట్ చేసే అవకాశం ఉందని విశ్లేషకులు వ్యాఖ్యానిస్తున్నారు.