Begin typing your search above and press return to search.

జగన్ తో దగ్గుబాటి!..పార్టీలో చేరిక‌పై విస్పష్ట ప్రకటన!

By:  Tupaki Desk   |   27 Jan 2019 11:01 AM GMT
జగన్ తో దగ్గుబాటి!..పార్టీలో చేరిక‌పై విస్పష్ట ప్రకటన!
X
ఏపీలో ఎన్నిక‌ల‌కు స‌మ‌యం ద‌గ్గ‌ర‌ప‌డుతున్న కొద్దీ విప‌క్ష వైసీపీ బ‌లోపేతం అవుతోంది. ఇప్ప‌టికే రాష్ట్రంలోని అన్ని నియోజ‌కవ‌ర్గాల్లో మంచి కేడ‌ర్ ఉన్న ఈ పార్టీకి కొన్ని నియోజ‌క‌వ‌ర్గాల్లో నాయ‌క‌త్వ లేమి కాస్తంత ఇబ్బంది క‌లిగిస్తోంది. ఈ నేప‌థ్యంలో ఇటీవ‌లి కాలంలో పార్టీలోకి కొత్త‌గా ఎంట్రీ ఇస్తున్న నేత‌లను చూస్తుంటే... ఆ లోపాన్ని కూడా వైసీపీ అధిగ‌మించేసిన‌ట్టేన‌న్న వాద‌న వినిపిస్తోంది. తాజాగా ప్ర‌కాశం జిల్లాకు చెందిన పేరొందిన పొలిటికల్ ఫ్యామిలీ అయిన ద‌గ్గుబాటి కుటుంబం వైసీపీ అధినేత వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డితో భేటీ అయ్యింది. ఈ భేటీలో ద‌గ్గుబాటి వెంకటేశ్వ‌ర‌రావుతో పాటు ఆయ‌న కుమారుడు హితేశ్ చెంచురామ్ కూడా జ‌గ‌న్ తో భేటీ కోసం లోట‌స్ పాండ్‌ కు వ‌చ్చారు. ఈ సంద‌ర్భంగా వైసీపీ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి విజ‌య‌సాయిరెడ్డి ద‌గ్గ‌రుండి మ‌రీ ద‌గ్గుబాటి ఫ్యామిలీని లోట‌స్ పాండ్ కు తీసుకువ‌చ్చారు. జ‌గ‌న్ తో భేటీ సంద‌ర్భంగా ద‌గ్గుబాటి సీనియ‌ర్‌ - జూనియ‌ర్ ఇద్ద‌రూ చాలా ఉల్లాసంగా క‌నిపించారు. అంతేకాకుండా జ‌గ‌న్ కూడా వారితో బాగానే క‌లిసిపోయారు.

ఎన్టీఆర్ అల్లుడైన ద‌గ్గుబాటి... చాలా కాలం టీడీపీలోనే ఉన్నా... చంద్ర‌బాబు మోసం కార‌ణంగా ఆ త‌ర్వాత కాంగ్రెస్‌ లో చేరారు. ఇప్పుడు వైసీపీలో చేరేందుకు రంగం సిద్ధం చేసుకున్నారు. అయితే ద‌గ్గుబాటి స‌తీమ‌ణి పురందేశ్వ‌రి ఇప్పుడు బీజేపీలో కీల‌క నేత‌గా ఉన్నారు. మ‌రి ద‌గ్గుబాటితో పాటు ఆమె కూడా పార్టీ మార‌తారా? లేదా? అన్న‌ది చూడాలి. ఇదిలా ఉంటే.. ప్ర‌కాశం జిల్లా ప‌ర్చూరు నియోజ‌క‌వ‌ర్గ టికెట్‌ ను హితేశ్ కు ఇవ్వాల‌న్న దిశ‌గా ద‌గ్గుబాటి ఫ్యామిలీ జ‌గ‌న్ ముందు డిమాండ్ పెట్టిన‌ట్టుగా స‌మాచారం. అదే స‌మ‌యంలో ప‌ర్చూరును ద‌గ్గుబాటి ఫ్యామిలీకి కేటాయించే విష‌యంలో జ‌గ‌న్ కూ పెద్ద‌గా ఇబ్బందేమీ లేద‌నే చెప్పాలి. ఈ నేప‌థ్యంలో ద‌గ్గుబాటి ఫ్యామిలీ వైసీపీలో చేర‌డం ఖాయంగానే క‌నిపిస్తోంది. ఈ నేప‌థ్యంలో ఇరు వ‌ర్గాల మ‌ధ్య మంచి అవ‌గాహ‌న కుదిరింద‌నే చెప్పాలి.

ఆ త‌ర్వాత భేటీ ముగించుకుని బ‌య‌ట‌కు వ‌చ్చిన ద‌గ్గుబాటి వెంక‌టేశ్వ‌ర‌రావు... మీడియాతో మాట్లాడిన సంద‌ర్భంగా త‌న కుమారుడి రాజ‌కీయ భ‌విష్య‌త్తుపై విస్ప‌ష్ట ప్ర‌క‌ట‌న చేశారు. త‌న కుమారుడు హితేశ్ చెంచురామ్‌.. ఇక‌పై వైఎస్ జ‌గ‌న్ తో క‌లిసి ప్ర‌యాణించ‌బోతున్నార‌ని ఆయ‌న ప్ర‌క‌టించారు. ఇందుకు త‌న స‌తీమ‌ణి పురందేశ్వ‌రి బీజేపీలో ఉన్న అంశం ఏమాత్రం అడ్డంకి కాబోద‌నే ఆయ‌న చెప్పారు. త‌న కుమారుడు వైసీపీలో చేరుతున్నార‌ని ఇప్ప‌టికే బీజేపీ పెద్ద‌ల‌కు చెప్పామ‌ని, త‌మ‌కేమీ అభ్యంత‌రం లేద‌ని వారు చెప్పార‌న్నారు. భ‌విష్య‌త్తులో పురందేశ్వ‌రి బీజేపీలోనే కొన‌సాగుతార‌ని, లేని ప‌క్షంలో రాజ‌కీయాల నుంచి త‌ప్పుకుంటార‌ని కూడా ద‌గ్గుబాటి చెప్పారు. మొత్తంగా వైసీపీలోకి ద‌గ్గుబాటి ఫ్యామిలీ ఎంట్రీపై గ‌త కొన్ని రోజులుగా కొన‌సాగుతున్న స‌స్పెస్స్‌ కు తెర ప‌డిపోయింద‌నే చెప్పాలి. ఇక లాంఛ‌నంగా హితేశ్ ఎప్పుడు వైసీపీలోకి చేర‌తార‌న్న విష‌యంపై త‌మ అనుచ‌రుల‌తో మాట్లాడి నిర్ణ‌యించుకుంటామ‌ని ద‌గ్గుబాటి చెప్పారు.