Begin typing your search above and press return to search.

5000 కోట్లు తెచ్చిపెట్టిన రాజధాని పేరు !

By:  Tupaki Desk   |   7 April 2015 7:43 AM GMT
5000 కోట్లు తెచ్చిపెట్టిన రాజధాని పేరు !
X
ప్రముఖ బౌద్దమత గురువు దలైలామా తన భవిష్యత్‌ ఆధ్యాత్మిక కేంద్రంగా నవ్యాంధ్రప్రదేశ్‌ రాజధాని అయిన అమరావతిని ఎంచుకోనున్నారా? బౌద్దంలో విశిష్టత కలిగిన అమరావతిని రాజధాని పేరుగా ఖరారు చేసుకోవడంలో టిబెటిన్ల ఆరాధ్య దైవమైన దలైలామా అందుకు అత్యంత సంతోషం వ్యక్తం చేశారా? నవ్యాంధ్ర రాజధానికి ఆయన ఆర్థిక సహాయం కూడా అందించనున్నారా? ఈ విధమైన సందేహాలకు దాదాపుగా అవును అనే సమాధానమే వస్తోంది.

టిబెటిన్లు అత్యంత గౌరవించే దలైలామాకు మొదటి నుంచి ఆంధ్రప్రదేశ్‌ పట్ల ఆసక్తి. రాష్ట్రం విడిపోయిన నేపథ్యం, కొత్త రాజధాని నిర్మాణానికి సింగపూర్‌ సంస్థలు మాస్టర్‌ ప్లాన్‌ మొదలు అన్ని రకాల సహకారాలు అందించడంతో దలైలామా దృష్టికి సైతం ఏపీ అంశం వెళ్లినట్లు ఆ వర్గాలు తెలుస్తోంది. మరోవైపు తన అధ్యాత్మిక విస్తరణకు సరైన వేదిక ఎంపికలో ఉన్న దలైలామా.. నవ్యాంధ్రప్రదేశ్‌ వైపు మొగ్గుచూపుతున్నట్లు సమాచారం. ఈ విషయాన్ని గమనించిన అధికార తెలుగుదేశం పార్టీకి చెందిన కొందరు సీనియర్లు కొత్త రాజధాని నిర్మాణానికి నిధుల విషయమై ఆయనతో చర్చలు జరుపుతున్నట్టు ఇటీవల వార్తలు వెలువడ్డాయి.

రాజధాని నిర్మాణానికి చంద్రబాబునాయుడు సర్కారుకు సహాయం చేసేందుకు దలైలామా అంగీకరించారని, అయితే తన ఆధ్యాత్మిక కేంద్రం విస్తరణకు అమరావతిలో తనకు ఆశ్రయం కల్పించాలని దలైలామ చెప్పినట్లు సమాచారం. అలా కల్పించే పక్షంలో నవ్యాంధ్ర రాజధాని నిర్మాణానికి రూ.5,000 కోట్లు (అక్షరాలా ఐదు వేల కోట్ల) విరాళాలు సేకరించి పెడతానని దలైలామా మాట కూడా ఇచ్చినట్టు వార్తలు వస్తున్నాయి. ఇది ఒక నైతిక ఎంవోయూ. ఇది ఇప్పుడే కాదు, ఎప్పటికీ అధికారికంగా వెల్లడించరు. కానీ, ఈ సాయం మాత్రం రాజధానికి అందుతుంది. ఇంకో విషయం ఏంటంటే... చంద్రబాబు రాజధాని నిర్మాణానికి సాయం తీసుకున్న రెండు దేశాలు బౌద్ధ మతం ప్రధానంగా ఆచరించే దేశాలు. ఈ సాయం కూడా ఆయా దేశాల పెట్టుబడులు, ఇన్వెస్టర్లు, వ్యక్తులు, ప్రభుత్వాల నుంచే రానుంది.

మొత్తంగా ఏపీ రాజధాని భవిష్యత్‌ తరాల అవసరాలకు ఆశలు తీర్చే నిర్మాణమే కాకుండా... భారతీయ మూలాలు కలిగిన బౌద్దమతాన్ని కూడా తనలో కలిగి ఉండటం ఆసక్తికరమే!

కొసమెరుపు: గతంలో సత్యసాయి బాబా అనంతపురంలోని కొన్ని మండలాలకు తాగునీటి పథకం ఏర్పాటుచేశారు. ఆ సందర్భంలో ఆయన ఒక ప్రతిపాదన చేశారు. అనంతపురం జిల్లా పేరు మార్చి సత్యసాయి జిల్లా అని పెడితే అనంతపురం జిల్లా మొత్తానికి మంచినీరు, విద్య ఉచితంగా ఏర్పాటుచేస్తానని ఆయన హామీ ఇచ్చారు. కానీ ప్రభుత్వం దాని పట్ల సుముఖత చూపలేదు. తాజాగా ఏపీ రాజధాని ''అమరావతి'' విషయంలో అలాంటి ప్రతిపాదన సక్సెస్‌ అయ్యింది.