Begin typing your search above and press return to search.

ద‌ళితుల స‌భ‌ను కేసీఆర్ అణిచివేశారట‌!!

By:  Tupaki Desk   |   29 July 2017 5:19 AM GMT
ద‌ళితుల స‌భ‌ను కేసీఆర్ అణిచివేశారట‌!!
X
తెలుగు రాష్ర్టాల ముఖ్య‌మంత్రులు నారా చంద్ర‌బాబు నాయుడు - క‌ల్వ‌కుంట్ల చంద్ర‌శేఖ‌ర్ రావు ప‌రిపాల‌న తీరులో ఎన్నో విభిన్న‌మైన ఉన్న‌ప్ప‌టికీ పోలీక‌లు కూడా క‌నిపిస్తున్నాయి. ముఖ్యంగా ప‌రిపాల‌న విష‌యంలో ఇద్ద‌రు చంద్రుల్ల తీరులో ఎన్నో అంశాల్లో స్ప‌ష్ట‌మైన తేడాలు ఉన్నాయి. అయితే ఉద్య‌మాల‌ను, గిట్ట‌ని వాటిని అణిచివేయ‌డంలో ఇద్ద‌రు ముఖ్య‌మంత్రుల తీరు ఒక‌ట‌నే అభిప్రాయం వినిపిస్తోంది. ముఖ్యంగా ద‌ళితుల విష‌యంలో ఈ తీరు కొట్టొచ్చిన‌ట్లు క‌నిపిస్తోంద‌ని అంటున్నారు.

ద‌ళితుల వ‌ర్గీక‌ర‌ణ డిమాండ్‌ కు మ‌ద్ద‌తివ్వాల‌ని కోరుతూ మాదిగ రిజ‌ర్వేష‌న్ పోరాట స‌మితి నాయ‌కుడు మందృకృష్ణ మాదిగ రాజ‌ధాని ప్రాంతంలో త‌లపెట్టిన కురుక్షేత్ర స‌భ‌ను ఏపీ సీఎం నారా చంద్ర‌బాబు నాయుడు విజ‌య‌వంతంగా అణిచివేసిన సంగ‌తి తెలిసిందే. అడుగ‌డుగునా పోలీసుల‌తో ద‌ళితుల స‌భ‌ను ముందుకు సాగ‌నీయ‌లేదు. దీంతో ద‌ళితుల విషయంలో బాబు స‌ర్కారు తీరును ప‌లువురు త‌ప్పుప‌ట్టారు. అయితే, అత్యంత ఆస‌క్తిక‌రంగా అదే రీతిలో తెలంగాణ‌ సీఎం కేసీఆర్ సైతం వ్య‌వ‌హ‌రించాడ‌ని అంటున్నారు. ఇసుక మాఫియా విష‌యంలో కేసుల్లో ఇరుక్కున్న ద‌ళితుల ఉదంతంతో రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనకు దారి తీస్తున్న నేరెళ్ళ ఉదంతంపై బాధ్యులైన పోలీసు అధికారులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ సిరిసిల్లలో తలపెట్టిన ‘దళిత బలహీన వర్గాల ప్రజా గర్జన’ బహిరంగ సభను పోలీసులు విచ్ఛిన్నం చేశారు. ఈ సభను విజయవంతం చేయడానికి రాష్ట్రంలోని వివిధ పార్టీలకు చెందిన దళిత సంఘాల నేతలు పాల్గొనడానికి అన్ని ఏర్పాట్లు చేశారు. అయితే పోలీసులకు - తెరాస పాలకులకు వ్యతిరేకంగా తలపెట్టిన ఈ సభకు పోలీసుల అనుమతి నిరాకరించారు. మరో వైపు సభకు రానున్న ముఖ్య నేతలను ఏ జిల్లాలలో ఉన్నా వారు రాకుండా ముందస్తుగా వేకువ జాము నుండే అరెస్టులు చేశారు.

రాజన్న సిరిసిల్ల జిల్లాలలోకి మరే జిల్లా నుండి - ప్రాంతం నుండి రాకుండా పోలీసులు జిల్లాలోకి వచ్చే అన్ని దారులను మూసివేశారు. వచ్చి పోయే వారిని ప్రశ్నిస్తూ, సిరిసిల్ల సభకు వచ్చే వారు కాదని నిర్ధారించుకున్నాకే లోనికి అనుమతించారు. ఈమేరకు చుట్టూ ఉన్న కరీంనగర్ - జగిత్యాల - కామారెడ్డి - సిద్దిపేట జిల్లాల సరిహద్దులను మూసివేశారు. నేతలను ఎవరినీ అనుమతించరాదని ఉత్తర్వులు జారీ చేశారు. ఇక సిరిసిల్లలో బాధ్యులైన దళిత నేతలను అరెస్టు చేస్తారన్న కారణంతో వారంతా పోలీసుల కంటబడకుండా రహస్య ప్రదేశాలకు వెళ్ళిపోయారు. అంతకు ముందు గురువారం రాత్రి వరకూ పోలీసులు అడ్డుకున్నా, అనుమతి ఇవ్వకున్నా సభను నిర్వహించి తీరుతామని నేతలు ఎక్కడికక్కడ ప్రకటించినప్పటికీ వారందరినీ ముందస్తు అరెస్టులకు పూనుకున్నారు. మరోవైపు సమీప జిల్లాల నుండి భారీగా పోలీసు బలగాలను రప్పించారు. సిరిసిల్ల పట్టణం అంతటా పెట్రోలింగ్‌లతో సాయంత్రం వర కూ గాలింపులు కొనసాగించారు.

కాగా సిరిసిల్ల మానేరు ఒడ్డున గల పద్మనాయక ఫంక్షన్ హాలు వెనుక దళిత సంక్షేమ సంఘంకు చెందిన మైదానంలో ఈ సభ నిర్వహణకు ఏర్పాట్లు చేయగా, గురువారం రాత్రి వేదిక నిర్మాణం పనులు ప్రారంభం అయ్యాయి. అయితే స్వయంగా ఎస్పీ వారిని అనుమతి లేని సభకు ఎలాంటి టెంట్ సామగ్రి ఇచ్చినా చర్యలు తప్పవని హెచ్చరించడంతో వేసిన టెంట్లను, వేదిక నిర్మా ణం పనులను నిలిపి వేసి రాత్రికి రాత్రే టెంట్ హౌస్ ల వారు వెనక్కు తీసుకపోయారు. ఫలితంగా సభా వేదిక వద్ద ఇటు ఏర్పాట్లు ఆగిపోయి, అటు నేతలు కనుమరుగు కావడంతో సభ ముందస్తుగానే భగ్నానికి దారి తీసింది. కాగా సభను జరుగకుండా పోలీసులు ముందస్తు భగ్నం చర్యలు చేపట్టడాన్ని అన్ని రాజకీయ పార్టీలు తీవ్రంగా ధ్వజమెత్తాయి. ఏపీ సీఎం చంద్ర‌బాబు నాయుడు సైతం ఇదే రీతిలో పోలీసుల‌తో క‌లిసి స‌భ‌ను అణిచివేశారని రాజ‌కీయ‌వ‌ర్గాలు విశ్లేషించారు.