Begin typing your search above and press return to search.

గుజ‌రాత్‌లో ద‌ళితుల‌కు ర‌క్ష‌ణ లేదా?

By:  Tupaki Desk   |   2 Oct 2017 9:45 AM GMT
గుజ‌రాత్‌లో ద‌ళితుల‌కు ర‌క్ష‌ణ లేదా?
X
తాము ద‌ళితుల‌కు పెద్ద పీట వేస్తున్నామ‌ని, ద‌ళితుల‌కు తాము వ్య‌తిరేకం కాద‌ని ప‌దే ప‌దే చెప్పుకోవ‌డంతోపాటు.. రాష్ట్ర‌ప‌తి ప‌ద‌వి వంటి కీల‌క రాజ్యాంగ స్థానంలో ద‌ళితుడిని కూర్చోబెట్టామ‌ని ప్ర‌చారం చేసుకుంటున్న ప్ర‌ధాని న‌రేంద్ర మోదీ సొంత రాష్ట్రం గుజ‌రాత్‌లో ద‌ళితుల‌కు ర‌క్ష‌ణ క‌రువ‌వుతోంది. చిన్న చిన్న కార‌ణాల‌తో ద‌ళితుల‌ను చంపేస్తున్న ఘ‌ట‌న‌లు వెలుగు చూస్తున్నాయి. తాజాగా గుజ‌రాత్‌లో జ‌రిగిన ఓ ద‌ళిత యువ‌కుడి హ‌త్య తీవ్ర సంచ‌ల‌నం సృష్టించింది. ద‌స‌రా న‌వ‌రాత్రి వేడుక‌ల్లో భాగంగా నిర్వ‌హించిన కార్య‌క్ర‌మాల్లో ‘గార్భ’ నృత్య వేడుక ను వీక్షించ‌డ‌మే ఆ యువ‌కుడు చేసుకున్న పాపం అయింది.

వ‌రాల్లోకి వెళ్తే.. ఆనంద్‌ జిల్లాలోని భద్రనియా గ్రామంలో పటేల్‌ వర్గీయులు నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా ఆదివారం తెల్లవారుజామున ‘గార్భ’ నృత్య వేడుక ఏర్పాటు చేశారు. ఆ వేడుకను దళిత యువకులు జయేశ్‌ సోలంకి - ప్రకాశ్‌ సోలంకి - మరో ఇద్దరు త‌మ త‌మ ఇళ్ల ద‌గ్గ‌రే కూర్చుని వీక్షిస్తున్నారు. అయితే - అటుగా వచ్చిన పటేల్‌ వర్గీయులు.. ‘గార్భ నృత్యం చూసే హక్కు దళితులకు లేదు’ అని వీరిని బూతులు తిట్టారు. మరికొందరు పటేల్‌ వర్గీయులను పిలిచి ద‌ళిత యువ‌కుల‌తో ఘ‌ర్ష‌ణ‌కు దిగారు. పటేల్‌ వర్గీయులంతా కలసి మూకుమ్మడిగా ఈ దళిత యువకులను చితకబాదారు. ఈ సందర్భంగా జయేశ్‌ తలను గోడకేసి బాదారు.

తీవ్రంగా గాయపడిన జయేశ్‌ ఆస్పత్రిలో చికిత్సపొందుతూ చనిపోయాడు. ఈ కేసులో 8 మంది నిందితులను పోలీసులు అరెస్ట్‌ చేశారు. వీరిపై అట్రాసిటీ కింద కేసులు నమోదు చేశారు. నిజానికి చాలా విచిత్రంగా ఉండే నృత్య వేడుక‌ను అన్ని వ‌ర్గాల ప్ర‌జ‌లు ఎంతో ఆస‌క్తిగా వీక్షిస్తారు. అయితే, ఇటీవ‌ల కాలంలో ద‌ళితుల‌పై రెచ్చిపోతున్న‌ ప‌టేల్ వ‌ర్గీయులు ద‌ళితులు రాకూడ‌ద‌ని హుకుం జారీ చేసిన‌ట్టు తెలిసింది. ఈ క్ర‌మంలోనే అమానుషంగా ప్ర‌వ‌ర్తించి ద‌ళిత యువ‌కుల‌పై దాడి చేశారు. ఈ ఘ‌ట‌న గుజ‌రాత్ స‌హా దేశంలో తీవ్ర క‌ల‌క‌లం సృష్టించింది. ప్ర‌ధాని సొంత రాష్ట్రంలోనే ద‌ళితుల‌కు ర‌క్ష‌ణ లేదా? అని విప‌క్షాలు దండెత్తుతున్నాయి.