Begin typing your search above and press return to search.

ఖాప్ పంచాయితీల తాలిబ‌న్ తీర్పులు

By:  Tupaki Desk   |   19 Aug 2015 9:20 AM GMT
ఖాప్ పంచాయితీల తాలిబ‌న్ తీర్పులు
X
మ‌న‌కు దూరంగా ఉండే దేశాల్లో తాలిబ‌న్లు.. ఐఎస్ తీవ్ర‌వాదుల దురాగ‌తాలు.. వారి విప‌రీత చ‌ర్య‌ల్ని తిట్టుకోవ‌టం.. భూమి మీద మిగిలున్న న‌ర‌రూప రాక్ష‌సులుగా అభివ‌ర్ణిస్తుంటాం. కానీ.. మ‌న దేశంలోనూ ఇలాంటి ఆరాచ‌క ప్ర‌జ‌లు కొందరున్నారు. ఖాప్ పంచాయితీ పెద్ద‌లుగా మ‌న్న‌న‌లు పొందే వీరి నోటి వెంట వ‌చ్చే తీర్పులు తాలిబ‌న్ల‌ను త‌ల‌పిస్తుంటాయి. తాజాగా ఈ పంచాయితీలు ఇచ్చిన ఒక తీర్పు సుప్రీంకోర్టు దృష్టికి వ‌చ్చి.. న్యాయ‌మూర్తుల‌కు షాక్ త‌గిలేలా చేయ‌ట‌మే కాదు.. ఈ ఉదంతంపై రెండురోజుల్లో విచార‌ణ జ‌రిపించి నివేదిక ఇవ్వాల‌ని ఉత్త‌ర‌ప్ర‌దేశ్ పోలీసుల‌కు ఆదేశాలు జారీ చేసింది.

ఇంత‌కీ ఈ ఖాప్ పెద్ద‌లు ఇచ్చిన తీర్పు వింటే స‌భ్య‌స‌మాజం త‌ల‌దించుకోవాలనిపించ‌టం ఖాయం. ఉత్త‌ర‌ప్ర‌దేశ్ లోని భాగ‌వ‌ట్ జిల్లాలోని ఒక గ్రామంలో ఒక జాట్ అమ్మాయి.. ఒక ద‌ళిత యువ‌కుడి ప్రేమ‌లో ప‌డింది. వీరిద్ద‌రూ పెళ్లి చేసుకోవాల‌నుకున్నా.. పెద్ద‌ల‌కు భ‌య‌ప‌డి ఆ అమ్మాయి వేరొక‌రిని పెళ్లాడింది. కానీ.. కాపురానికి వెళ్లిన ఆ అమ్మాయి భ‌ర్త‌తో ఉండ‌లేక‌.. ప్రియుడ్ని మ‌ర్చిపోలేక స‌త‌మ‌త‌మైంది.

చివ‌ర‌కు నెల రోజుల త‌ర్వాత ప్రియుడు ద‌గ్గ‌ర‌కు వ‌చ్చేసింది. విష‌యం పెద్ద మ‌నుషుల వ‌ద్ద‌కు వెళ్లింది. ఖాప్ పంచాయితీ కొలువు తీరింది. వారిద్ద‌రిని బెదిరించారు. భ‌య‌పెట్టారు. దీంతో.. బెదిరిపోయిన ఈ జంట పోలీసుల శ‌ర‌ణు కోరింది.

అయితే.. ఖాప్ పంచాయితీ పెద్ద‌లు త‌మ‌కున్న ప‌లుకుబ‌డితో ఆ కుర్రాడిపై త‌ప్పుడు కేసులు పెట్టించ‌ట‌మే కాదు.. ఆ కుర్రాడి సోద‌రి.. ఆమె స్నేహితురాలిద్ద‌రిని అత్యాచారం చేయాల‌ని.. ఆపై ముఖానికి న‌ల్ల‌రంగు పూసి ఊళ్లో న‌గ్నంగా ఊరేగించాల‌ని పంచాయితీ తీర్పు ఇచ్చింది. అంతేకాదు.. వారికున్న భూమిని ఆక్ర‌మించుకోవాల‌ని డిసైడ్ చేశారు.

దీంతో భ‌యంతో వ‌ణికిపోయిన కుటుంబం ఢిల్లీకి పారిపోయింది. ఆ ప్రేమికుడు ప్ర‌స్తుతం జైల్లో మ‌గ్గుతున్నాడు. త‌మ కుటుంబానికి జ‌రిగిన అన్యాయంపై ఆ యువ‌కుడి సోద‌రి సుప్రీంకోర్టును ఆశ్ర‌యించింది. ఈ వ్య‌వ‌హారాన్ని విన్న సుప్రీం జ‌డ్జిలు విస్తుపోయారు. తీవ్రంగా స్పందించారు. ఈ అంశానికి సంబంధించిన మొత్తం నివేదిక‌ను రెండు రోజుల్లో ఇవ్వాల‌ని ఆదేశించారు. అక్క‌డెక్క‌డో ఉండే తాలిబ‌న్ల‌కు.. తీసిపోని రీతిలో తీర్పులు చెప్పే ఖాప్ పంచాయితీ పెద్ద‌ల్ని ఏం చేద్దాం..?