Begin typing your search above and press return to search.

కాంగ్రెస్ యాత్ర‌లో అప్పుడే క్రెడిట్ ఫైట్‌

By:  Tupaki Desk   |   28 Feb 2018 5:22 AM GMT
కాంగ్రెస్ యాత్ర‌లో అప్పుడే క్రెడిట్ ఫైట్‌
X
రాబోయే ఎన్నిక‌ల్లో అధికార‌మే ల‌క్ష్యంగా, పార్టీ నేత‌లంతా ఏక‌తాటిపైకి రావ‌డ‌మే ఉద్దేశంగా తెలంగాణ పీసీసీ ర‌థ‌సార‌థి ఉత్త‌మ్ కుమార్ రెడ్డి చేప‌ట్టిన యాత్ర‌కు ఆదిలోనే అసంతృప్తుల ప‌ర్వం స్వాగ‌తం ప‌లుకుతోంది. నేత‌లంతా ఐక్యంగా ఉండి నాయకులంతా సమన్వయంతో బ‌స్సుయాత్ర‌ను సక్సెస్ చేసి అధికారంలోకి రావాలని అధిష్టానం గ్రీన్ సిగ్నల్ ఇస్తే...బస్ యాత్రకు నై... మా నియోజకవర్గంలో యాత్రే వద్దు..అంటూ కాంగ్రెస్ పార్టీ కీలక నేత ఆర్డ‌ర్ వేయ‌డం ఆస‌క్తిక‌రంగా మారింది. ఆదిలోనే అధికారమే లక్ష్యంగా టీపీసీసీ పెద్దలు బస్ యాత్రకు ఈ రేంజ్‌ లో బ్రేకులు వేసింది ఎవ‌రంటే మాజీ డిప్యూటీ సీఎం దామోద‌ర రాజ‌న‌ర్సింహ అని చెప్తున్నారు.

పీసీసీ ర‌థసార‌థి ఉత్త‌మ్ సార‌థ్యంలో చేపట్టిన బస్సు యాత్ర 27న సంగారెడ్డిలో పూర్తిచేసుకొని జహీరాబాద్ - నారాయణఖేడ్ మీదుగా నిజామాబాద్ జిల్లాలోకి ప్రవేశిస్తుంది. అయితే సంగారెడ్డి పక్కనే ఉన్న ఆంధోల్ నియోజకవర్గంలో యాత్రను తప్పించేశారు. నియోజకవర్గంలోని మునిపల్లి మండలం మీదుగా యాత్ర ఉన్నా.. ఎక్కడా ఆగకుండా వెళుతుందని పీసీసీ ప్రకటించింది. దీనికి మాజీ డిప్యూటీ సీఎం దామోదర రాజనర్సింహ అభ్యంతరాలే కారణం అంటున్నారు. గ‌త కొంతకాలం పార్టీ కార్యక్రమాలకు దామోదర రాజనర్సింహ దూరంగా ఉంటున్నారు. ఆందోల్ తో పాటు.. పక్కనే ఉన్న పటాన్ చెరు - దుబ్బాక - మెదక్ నియోజకవర్గాల్లో విసృతంగా పర్యటిస్తూ తనకంటూ సొంతంగా వర్గాన్ని తయారు చేసుకుంటున్నారు. పార్టీ పిలుపుఇచ్చి వేదికలపై కనిపించడం లేదు. బస్ యాత్ర గురించి ఎక్కడా ప్రస్తావించడం లేదు. ఇటీవల కొందరు సీనియర్లు ఆయనతో చర్చలు జరిపినా.. ఆసక్తి చూపలేదని.. అందుకే ఆందోల్ షెడ్యూల్ రద్దు చేశామని పీసీసీ వర్గాలంటున్నాయి.

కాగా, దామోద‌ర అసంతృప్తిపై భిన్న‌మైన చ‌ర్చ జ‌రుగుతోంది. ఉమ్మడి మెదక్ జిల్లా రాజకీయాల్లో దామోదర రాజనర్సింహ వ్యవహారం చర్చనీయాంశంగా మారింది. పీసీసీ నిర్ణయాల్లో రాజనర్సింహకు ప్రాధాన్యత ఇవ్వకపోవడంవల్లే ఆయన అసంతృప్తిగా ఉన్నారంటున్నారు. పీసీసీ అధ్యక్ష పదవి ఆశించినా దక్కకపోవడం కూడా ఆయనలో ఆసమ్మతికి కారణమంటున్నారు. ఆయన అంతరంగం అర్ధం కాక శ్రేణులు తలలు పట్టుకుంటున్నారు. ఆయన వ్యవహరిస్తున్న తీరుపై పార్టీ వర్గాల్లో పలు సందేహాలు వ్యక్తమవుతున్నాయి. గతంలో పార్టీ మారుతారని ప్రచారం జరిగినా.. ఖండించారు. ఇప్పుడు కూడా అలాంటి ఊహాగానాలే వినిపిస్తున్నప్ప‌టికీ అనుచరులు మాత్రం ఏకీభవించడంలేదు. కానీ పీసీసీలో మాత్రం ఆయన తీరుపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతుండ‌టం గ‌మ‌నార్హం.