Begin typing your search above and press return to search.

ఎంట్రీతోనే అదిరేలా చేసిన దాన‌కిశోర్‌!

By:  Tupaki Desk   |   27 Aug 2018 4:40 AM GMT
ఎంట్రీతోనే అదిరేలా చేసిన దాన‌కిశోర్‌!
X
ఐఏఎస్ లు చాలామందే ఉంటారు. కొంద‌రు మాత్ర‌మే మిగిలిన వారికి భిన్నంగా ఉంటారు. అలాంటి వారిలో ఒక‌రు సీనియ‌ర్ ఐఏఎస్ అధికారి దాన‌కిశోర్. త‌న‌దైన మార్క్ తో త‌న‌కు అప్ప‌గించిన ప‌నిని పూర్తి చేసే అధికారిగా ఆయ‌న‌కు పేరుంది. నాలుగున్న‌రేళ్ల కేసీఆర్ పాల‌న‌లో ఆయ‌న మ‌న‌సును దోచుకొని.. న‌మ్మ‌కంతో అప్ప‌గించిన బాధ్య‌త‌ల్ని విజ‌య‌వంతంగా పూర్తి చేశార‌న్న పేరును తెచ్చుకున్న అతి కొద్దిమంది ఐఏఎస్ ల‌లో ఆయ‌న ఒక‌రు.

ముంద‌స్తు ఎన్నిక‌ల నేప‌థ్యంలో హైద‌రాబాద్ లోని ముఖ్య‌మైన స్థానాల‌కు ఈ మ‌ధ్య‌న మూడు మార్పులు చేసింది టీఆర్ఎస్ స‌ర్కార్. అందులో ఒక‌టి కీల‌క‌మైన జీహెచ్ ఎంసీ క‌మిష‌న‌ర్ ప‌ద‌విని వాట‌ర్ వ‌ర్క్స్ ఎండీగా వ్య‌వ‌హ‌రిస్తున్న దాన‌కిశోర్ కు అప్ప‌గించారు. అదే స‌మ‌యంలో జీహెచ్ ఎంసీకి క‌మిష‌న‌ర్ గా ఉన్న జ‌నార్ద‌న్ రెడ్డిని హెచ్ ఎండీఏకు బ‌దిలీ చేశారు.

శివారులో భూ నిర్మాణాలు భారీగా జ‌రుగుతున్న వేళ‌.. అవినీతి ఆరోప‌ణ‌లు పెద్ద ఎత్తున వెల్లువెత్తుతున్న స‌మ‌యంలో నిజాయితీకి నిలువెత్తురూపంగా ఉండే జ‌నార్ద‌న్ రెడ్డికి ఆ బాధ్య‌త‌లు అప్ప‌గించ‌టం ఆస‌క్తిక‌రంగా మారింది. పెద్ద‌ల మాట‌ల్ని సైతం రూల్ బుక్ కు భిన్నంగా ఉంటే నో చెప్పేస్తార‌న్న పేరున్న జ‌నార్ద‌న్ రెడ్డికి హెచ్ ఎండీఏ బాధ్య‌త‌లు అప్ప‌గించ‌టం చూస్తే.. ఎన్నిక‌ల వేళ భూదందాల‌కు జ‌నార్ద‌న్ రెడ్డి పుణ్య‌మా అని చుక్క‌లు క‌నిపించ‌టం ఖాయ‌మ‌న్న పేరుంది.

ఇదిలా ఉంటే.. ఇప్ప‌టికే హెచ్ ఎండీఏ బాధ్య‌త‌లు నిర్వ‌మిస్తున్న చిరంజీవుల‌కు అప్రాధాన్య‌మైన స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేష‌న్ల శాఖ‌ను అప్ప‌గించ‌టం గ‌మ‌నార్హం. ఇదిలా ఉంటే.. ప్ర‌స్తుతం జీహెచ్ ఎంసీకి.. వాట‌ర్ వ‌ర్క్స్ కు అధిప‌తిగా ఉన్న దాన‌కిశోర్ త‌న ఎంట్రీతోనే అద‌ర‌గొట్టేశారు. శుక్ర‌వారం జీహెచ్ ఎంసీ బాధ్య‌త‌ల్ని చేప‌ట్టిన దాన‌కిశోర్.. తాజాగా రోడ్డు మీద‌కు మురుగునీరు వ‌దులుతున్న‌భ‌వ‌న య‌జ‌మానికి భారీ జ‌రిమానాను విధించారు.

బేగంపేట‌లోని లైఫ్ స్టైల్ స‌మీపంలోని ఒక భ‌వ‌నం నుంచి నీటిని రోడ్డు మీద‌కు వ‌దులుతున్నారు. అటుగా వెళుతున్న జీహెచ్ ఎంసీ క‌మిష‌నర్ దాన‌కిశోర్ దీన్ని గుర్తించారు. వెంట‌నే జీహెచ్ ఎంసీ అధికారుల దృష్టికి.. వాట‌ర్ వ‌ర్క్స్ అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. రెండు విభాగాల అధికారులు త‌నిఖీలు నిర్వ‌హించి.. భ‌వ‌న య‌జ‌మాని అయిన అన్న‌పూర్ణ బిల్డ‌ర్స్ కు రూ.5వేల జ‌రిమానాను విధించారు. గ‌తంలోనూ ఇదే త‌ర‌హాలో జ‌రిమానాలు విధిస్తామ‌ని చెప్పినా.. ఇప్ప‌టివ‌ర‌కూ అలాంటి ప‌ని చేయ‌లేదు. దాన‌కిశోర్ బాధ్య‌త‌లు చేప‌ట్టిన వెంట‌నే ఫైన్ మోత మోగించ‌టం ద్వారా.. రూల్స్ ను బ్రేక్ చేసే వారిపై చ‌ర్య‌లు త‌ప్ప‌వ‌న్న సంకేతాల్ని తాజా ఫైన్ తో స్ప‌ష్టం చేశార‌ని చెప్ప‌క త‌ప్ప‌దు.