Begin typing your search above and press return to search.

ఆ మాట‌ను దాన‌మే చెప్పాడు భ‌య్‌

By:  Tupaki Desk   |   18 Oct 2016 9:54 AM GMT
ఆ మాట‌ను దాన‌మే చెప్పాడు భ‌య్‌
X
కొంద‌రు నేత‌ల పేర్లు చెప్పిన వెంట‌నే.. కొన్ని ఇమేజ్ లు మ‌న‌సులోకి ఆటోమేటిక్‌ గా వ‌చ్చేస్తుంటాయి. అలాంటి నేత‌లు.. త‌మ ఇమేజ్ కు భిన్నమైన మాట‌లు చెప్పిన‌ప్పుడు కాస్తంత చిత్రంగా అనిపించ‌ట‌మే కాదు.. ఆస‌క్తి కూడా వ్య‌క్త‌మ‌వుతుంది. తాజాగా అలాంటి మాట‌నే చెప్పుకొచ్చారు తెలంగాణ కాంగ్రెస్ సీనియ‌ర్ నేత‌.. మాజీ మంత్రి దానం నాగేంద‌ర్‌. కాంగ్రెస్ ప‌దేళ్ల కాలంలో ఎక్కువ కాలం మంత్రిగా వ్య‌వ‌హ‌రించిన ఆయ‌న‌.. హైద‌రాబాద్ మ‌హాన‌గ‌రంలో ఎంత‌టి హ‌వా ప్ర‌ద‌ర్శించారో ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన అవ‌స‌ర‌మే లేదు. సిటీలో ఏం జ‌రగాల‌న్నా దానం మాట ఉండాల‌న్న‌ట్లుగా హ‌వా న‌డిచిన ప‌రిస్థితి. అలాంటి దానం.. తెలంగాణ రాష్ట్రం ఏర్ప‌డిన త‌ర్వాత ఆయ‌న గ‌డ్డు ప‌రిస్థితి ఎదుర్కొంటున్నారు.

సార్వ‌త్రిక ఎన్నిక‌ల్లో ఎమ్మెల్యేగా కూడా గెల‌వ‌ని ఆయ‌న‌.. ఎన్నిక‌ల్లో ఓట‌మి అనంత‌రం కాస్త కామ్ గా ఉండిపోయారు. ఒక‌ద‌శ‌లో తెలంగాణ అధికార‌ప‌క్షంలో భాగ‌స్వామి అవుతార‌న్న టాక్ వినిపించినా.. అది వ‌ర్క్ వుట్ కాలేదు. ఇటీవ‌ల కాలం వ‌ర‌కూ ఆయ‌న‌కు సంబంధించి త‌ర‌చూ జంపింగ్ వార్త‌లు వ‌చ్చేవి. అలా జంపింగ్ వార్త‌లు రావ‌టం.. ఇలా దానం ఖండించ‌టం జ‌రిగేది. ఏ రోజుకైనా గులాబీ కారు ఎక్కే కాంగ్రెస్ నేత‌ల జాబితాలో దానం పేరు ఒక‌ట‌న్న‌ట్లుగా ప‌లువురు చెబుతుంటారు. అయితే.. అలాంటిదేమీ లేద‌ని చెబుతున్నారు దానం.

తాను కాంగ్రెస్ పార్టీలోనే ఉంటాన‌ని.. తాను ఆ పార్టీలోనే కొన‌సాగుతాన‌ని స్ప‌ష్టం చేస్తున్నారు. అన్నింటికంటే ఆస‌క్తిక‌ర‌మైన అంశం ఏమిటంటే.. త్వ‌ర‌లో ఆయ‌న టీఆర్ ఎస్ స‌ర్కారు వైఫ‌ల్యాల్ని ఎండ‌గ‌ట్టేందుకు ప్ర‌త్యేక కార్య‌క్ర‌మాన్ని చేప‌ట్ట‌నున్న‌ట్లు చెబుతున్నారు. ప్ర‌భుత్వానికి కొంత స‌మ‌యం ఇవ్వాల‌న్న ఉద్దేశంతోనే సంయ‌మ‌నం పాటిస్తున్న‌ట్లుగా వెల్ల‌డించారు. త‌న‌కు కాంగ్రెస్ పార్టీ ఎలాంటి బాధ్య‌త ఇవ్వ‌లేద‌ని.. అందుకే పార్టీ కార్యాక్ర‌మాల్లో పాల్గొన‌టం లేద‌ని చెప్పిన దానం.. గ్రేట‌ర్ ఎన్నిక‌ల్లో పార్టీ ఘోర ఓట‌మి నేప‌థ్యంలో త‌న ప‌ద‌వికి రాజీనామా చేశారు. మ‌రి.. పార్టీ ప‌ద‌వి ఇవ్వ‌నందుకే పార్టీ కార్య‌క్ర‌మాల్లో పాల్గొన‌టం లేద‌ని చెప్పిన దానం.. ఇప్పుడు ఏ ప‌ద‌వి ఇచ్చింద‌ని కేసీఆర్ స‌ర్కారుకు వ్య‌తిరేకంగా ప్ర‌త్యేక కార్య‌క్ర‌మాన్ని షురూ చేస్తున్న‌ట్లు..?

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/