Begin typing your search above and press return to search.

కాంగ్రెస్ నుంచి దానం అవుట్‌..!

By:  Tupaki Desk   |   2 Dec 2015 12:10 PM GMT
కాంగ్రెస్ నుంచి దానం అవుట్‌..!
X
కాంగ్రెస్ పార్టీ నుంచి గ్రేట‌ర్ కాంగ్రెస్ అధ్య‌క్షుడు దానం నాగేంద‌ర్ త‌ప్పుకుంటారా...దానం రూటు తెరాస వైపు చూస్తుందా అంటే తెలంగాణ పొలిటిక‌ల్ కారిడార్‌ లో అవున‌నే స‌మాధానం వ‌స్తోంది. వాస్త‌వానికి గ‌త సాధార‌ణ ఎన్నిక‌ల త‌ర్వాతే దానం అధికార తెరాస‌లో చేరిపోతార‌ని వార్త‌లు వ‌చ్చాయి. అయితే ఈ వార్త‌ల‌ను ఆయ‌న ఖండిస్తూ వ‌స్తున్నారు. గ్రేట‌ర్ ఎన్నిక‌ల దృష్ట్యా దానంను తెరాస‌లో చేర్చుకోవాల‌ని సీఎం కేసీఆర్‌ తో పాటు తెరాస అగ్ర నేత‌లంద‌రూ ఎప్ప‌టి నుంచో స్కెచ్ వేస్తున్న‌ట్టు టాక్‌. అయితే దానం తెరాస‌లో చేరేందుకు పెట్టిన ఖండీష‌న్లు న‌చ్చ‌క‌పోవ‌డంతో తెరాస నేత‌లు ఈ ప్ర‌తిపాద‌న‌ను తాత్కాలికంగా ప‌క్క‌న పెట్టిన‌ట్టు తెలుస్తోంది.

త‌న‌కు లేదా త‌న వ‌ర్గానికి మేయ‌ర్ లేదా డిప్యూటీ మేయ‌ర్ ప‌ద‌వితో పాటు త‌న అనుచ‌ర గ‌ణానికి భారీగా కార్పొరేట‌ర్ టిక్కెట్టు ఇవ్వాల‌ని దానం పెట్టిన ఖండీష‌న్లు తెరాస గ్రేట‌ర్ నాయ‌కుల‌కు న‌చ్చ‌లేద‌ని తెలుస్తోంది. ఇదిలా ఉంటే దానం నాగేంద‌ర్ వైఖ‌రిపై టీ కాంగ్రెస్ నేత‌లు చాలా ఆగ్ర‌హంతో ఉన్నారు. దానం కొంత‌కాలంగా గ్రేట‌ర్‌ లో కాంగ్రెస్ పార్టీ వ్య‌వ‌హారాల‌ను అస్స‌లు ప‌ట్టించుకోవ‌డం లేద‌ని కాంగ్రెస్ నేత‌లు గుర్రుగా ఉన్నారు. ఈ నేప‌థ్యంలోనే గురువారం గాంధీభవన్ లో టీ కాంగ్రెస్ సమన్వయ కమిటీ స‌మావేశం కానుంది. ఈ స‌మావేశంలో టీ కాంగ్రెస్ నేత‌లు దానం వ్య‌వ‌హార‌శైలీ గురించి చ‌ర్చించ‌నున్నార‌ని తెలుస్తోంది.

గ్రేట‌ర్‌ లో పార్టీ వ్య‌వ‌హారాలను ప‌ట్టించుకోక‌పోవ‌డంపై దానం స‌రైన వివ‌ర‌ణ ఇవ్వ‌క‌పోతే దానంను నగర అధ్యక్ష పదవి నుంచి తప్పించాలని టీ-పీసీసీ నేతలు ఇప్పటికే ఓ నిర్ణయానికి వచ్చినట్లు తెలిసింది. వ‌చ్చే ఏడాది ఆరంభంలోనే గ్రేట‌ర్ ఎన్నిక‌లు జ‌ర‌గ‌నున్నాయి. గ్రేట‌ర్‌ లో మూడుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నిక‌వ్వ‌డంతో పాటు మాజీ మంత్రిగా ప‌నిచేసిన దానం అధికార పార్టీకి ధీటుగా వ్య‌వ‌హ‌రించాల్సింది పోయి పార్టీ విష‌యాల‌ను పూర్తిగా ప‌క్క‌న పాడేయ‌డంతో గ్రేట‌ర్‌ లో కాంగ్రెస్ ప‌రిస్థితి ద‌య‌నీయంగా మారింది. ఇప్ప‌టికే వ‌రంగ‌ల్ దెబ్బ‌కు కాంగ్రెస్ ప‌రువు చాలా వ‌ర‌కు గంగ‌లో క‌లిసిన‌ట్ల‌య్యింది. ఇప్పుడు గ్రేట‌ర్‌ లో కూడా అదే రిజ‌ల్ట్ వ‌స్తే కార్య‌క‌ర్త‌లు నిస్తేజంగా మారి తెలంగాణలో కాంగ్రెస్ మ‌నుగ‌డే ప్ర‌మాదంగా మారుతుంద‌న్న ఆందోళ‌న‌లో కాంగ్రెస్ నాయ‌కులు ఉన్నారు. దానం వ్య‌వ‌హార‌శైలీపై టీ కాంగ్రెస్ సీనియ‌ర్లు ఇప్పటికే పార్టీ అధిష్టానానికి ఫిర్యాదు చేసిన‌ట్టు కూడా తెలుస్తోంది. కాంగ్రెస్‌ లో కొన‌సాగేందుకు అయిష్టంగా ఉంటున్న దానం కూడా తెరాస నుంచి మంచి ఆఫ‌ర్ వ‌స్తే గులాబి గూటికి చేరుకుంటార‌ని టాక్‌.