Begin typing your search above and press return to search.

ఉత్తరాంధ్రా మంత్రులకు డేంజర్ బెల్స్...?

By:  Tupaki Desk   |   17 Dec 2022 2:30 AM GMT
ఉత్తరాంధ్రా మంత్రులకు డేంజర్ బెల్స్...?
X
ఆ మంత్రులు చూస్తే జగన్ తోనే ఉంటారు. ఆయనకు అత్యంత సన్నిహితం అని కూడా భావిస్తారు. కానీ ఎక్కడైనా బావ కానీ వంగతోటలో కాదు అన్నట్లుగా ఉత్త్రాంధ్రా జిల్లాలలోని ఆ మంత్రులు కూడా ఇపుడు జగన్ లెక్కల్లో చూస్తే డేంజర్ జోన్ లో ఉన్నారని అంటున్నారు. సీనియర్ మంత్రి, విజయనగరం జిల్లాకు చెందిన అతి పెద్ద నాయకుడు అయిన బొత్స సత్యనారాయణకు కూడా జగన్ తాజా వర్క్ షాప్ లో మైనస్ మార్కులు పడ్డాయి.

ఆయన ఇంటింటికీ తిరిగి గడప గడప కార్యక్రమాన్ని సవ్యంగా చేయడం లేదని జగన్ అన్నట్లుగా ప్రచారంలో ఉంది. పైగా బొత్స ప్రాతినిధ్యం వహిస్తున్న చీపురుపల్లిలో టీడీపీ గ్రాఫ్ పెరిగినట్లుగా కూడా సర్వే నివేదికలు వచ్చాయని అంటున్నారు. దాంతో బొత్సను అలెర్ట్ చేశారని తెలుస్తోంది. ఇక జగన్ కీలకమైన అయిదు శాఖలను కట్టబెట్టి ఫస్ట్ టైం లోనే గుడివాడ అమరనాధ్ ని మంత్రిని చేశారు. ఆయన ఎనిమిది నెలలుగా శాఖాపరంగా ఎంత పట్టు సాధించారో ఏమో కానీ తన సొంత సీటు అనకాపల్లి లో మాత్రం అంతకంతకు గ్రాఫ్ పడిపోయేలా చేసుకుంటున్నారు అని అంటున్నారు.

అక్కడ కూడా టీడీపీ స్ట్రాంగ్ అయింది అని అంటున్నారు. దాంతో పాటుగా గుడివాడ గడప గడపకూ తిరగడం లేదని కూడా ఐప్యాక్ టీం నివేదికల ద్వారా జగన్ కి సమాచారం వెళ్ళింది అని అంటున్నారు. దాంతో ఆయన్ని కూడా జాగ్రత్తపడమని చెప్పారని అంటున్నారు. ఇక శ్రీకాకుళం జిల్లాకు చెందిన మరో మంత్రి డాక్టర్ సీదరి అప్పలరాజు విషయంలోనూ ఇలాగే జరిగింది అంటున్నారు.

ఆయన నియోజకవర్గం పలాసాలో సైతం టీడీపీ జోరు చేస్తోంది. గౌతు లచ్చన్న మనవరాలు గౌతు శిరీష గట్టిగా జనంలో తిరుగుతున్నారు. దాంతో పాటు మంత్రి సీదరి గడప గడపను నిర్లక్ష్యం చేతున్నారని ఆయన అధినాయకత్వం ఆదేశించినప్పటికీ పర్యటించడంలేదని సర్వే నివేదికలు గుట్టు బయటపెట్టాయట. దాంతో సీదరి అప్పలరాజు కూడా ఈ లిస్ట్ లో ఉన్నారని అంటున్నారు. ఇలా ఉత్తరాంధ్రాలో ఆరుగురు మంత్రులు ఉంటే ముగ్గురు మంత్రులకు జగన్ నుంచి జాగ్రత్తలు వచ్చాయని చెబుతున్నారు. వీరు మరో వందరోజులలోగా తమ పనితీరుని మెరుగుపరచుకోకపోతే మాత్రం కచ్చితంగా కొత్త క్యాండిడేట్ ని చూడాల్సి వస్తుందని పేర్కొన్నారని తెలుస్తోంది.

ఇక ఏపీలో మంత్రులు చూస్తే గుంటూరుకు చెందిన విడదల రజని, కర్నూల్ మంత్రి జయరాం కూడా గడప గడపకూ పెద్దగా వెళ్ళడం లేదని అంటున్నారు. నెలలో కనీసం పది రోజుల పాటు ప్రతీ ఎమ్మెల్యే మంత్రి గడప గడపకూ తిరగాల్సిందే అని జగన్ కచ్చితమైన ఆదేశాలను జారీ చేశారని అంటున్నారు.

అలాగే తమ పరిధిలోని సచివాలయాలలో కూడా ఒక రోజుని కేటాయించుకుని అక్కడ కార్యక్రమాలు చూడాలని పధకాల లబ్దిదారులతో ముఖాముఖీ కావాలని జగన్ కోరుతున్నారు. మొత్తానికి చూస్తే చాలా మంది మంత్రుల విషయంలో కూడా హెచ్చరికలు రావడంతో కొత్త ఏడాది ఏప్రిల్ నాటికి వీరి ప్రోగ్రెస్ రిపోర్ట్ ఏంటి అన్నది చూడాలని అంటున్నారు.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.