Begin typing your search above and press return to search.

భారత్ లో కరోనా విలయతాండవం ... కొత్త వైరస్ స్ట్రెయిన్ తో డేంజర్ బెల్స్!

By:  Tupaki Desk   |   28 Dec 2020 7:05 AM GMT
భారత్ లో కరోనా విలయతాండవం ... కొత్త వైరస్ స్ట్రెయిన్ తో డేంజర్ బెల్స్!
X
కరోనా మహమ్మారి విలయతాండవం కొనసాగుతున్న సమయంలోనే .. కొత్త రకం కరోనా వైరస్ యావత్ ప్రపంచాన్ని వణికిస్తోంది. యూకేలో బయటపడిన కరోనా కొత్త స్ట్రెయిన్ మళ్లీ అలజడి రేపుతోంది. ఈ క్రమంలోనే యూకేతో ప్రపంచ దేశాలు సంబంధాలు తెరచుకున్నాయి. విమాన సర్వీసులను నిలిపివేశాయి. ఐతే ఇప్పటికే బ్రిటన్ నుంచి భారత్‌కు వచ్చిన వారిలో పలువురికి కరోనా పాజిటివ్ రావడం ఆందోళన కలిగిస్తోంది.

కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ లెక్కల ప్రకారం గత 24 గంటల్లో 20,021 కొత్త కరోనా కేసులు నమోదు కాగా, 21,131 మంది కరోనా నుండి కోలుకున్నారు. గత 24 గంటల్లో 279 మరణాలు సంభవించాయి. తాజా కరోనా కొత్త కేసుల సంఖ్య 7 శాతం పెరిగినట్లుగా తెలుస్తుంది. ఇప్పటివరకు మొత్తం కరోనా కేసులు 1,02,07,871. వీటిలో 2,77,301 క్రియాశీల కేసులు. భారతదేశం ఇప్పటివరకు 97,82,669 రికవరీలను నమోదు చేసింది. మరణాల సంఖ్య 1,47,901 గా ఉంది. మరోవైపు ఇప్పటివరకు మొత్తం 16,88,18,054 నమూనాలను కరోనా వైరస్ మహమ్మారి నిర్ధారణ కొరకు డిసెంబర్ 27 వరకు పరీక్షించినట్లుగా అధికారులు పేర్కొన్నారు. వీటిలో 7,15,397 నమూనాలను నిన్న పరీక్షించామని ఐసీఎంఆర్ వెల్లడించింది.

కరోనావైరస్ వ్యాక్సిన్ ప్రోగ్రాం కోసం రెండు రోజుల డ్రై రన్ ఈ రోజు ఆంధ్రప్రదేశ్, పంజాబ్, గుజరాత్ మరియు అస్సాంలో ప్రారంభమవుతుంది. వ్యాక్సినేషన్ అనంతర ప్రతికూల సంఘటనల నిర్వహణపై దృష్టి పెట్టాలని కేంద్రం రాష్ట్రాలకు సూచించింది. ఆ తర్వాత నివేదికను కేంద్రానికి సమర్పిస్తారు. కరోనా కొత్తరకం వైరస్ పై భారత్ తో సహా అన్ని దేశాలు తగిన చర్యలు తీసుకుంటున్నాయి. కరోనా కొత్త రకం వైరస్ తీవ్రంగా వ్యాప్తి చెందిన దేశాలనుండి వచ్చినవారికి 14 రోజులపాటు గృహనిర్బంధం ఉంచాలని ఇండియాలో కఠిన నిర్ణయం తీసుకున్నారు. ఇప్పటికే దేశవ్యాప్తంగా యూకే, బ్రిటన్ నుండి వచ్చిన వారికి కరోనా పరీక్షలు నిర్వహించి పాజిటివ్ నిర్ధారణ అయిన వారిని ప్రత్యేకమైన ఐసోలేషన్ కు తరలిస్తున్నారు.