Begin typing your search above and press return to search.

#పొగ‌మంచు...18 కార్లు ఢీ...వైర‌ల్ వీడియో!

By:  Tupaki Desk   |   8 Nov 2017 5:06 PM GMT
#పొగ‌మంచు...18 కార్లు ఢీ...వైర‌ల్ వీడియో!
X
దేశ రాజధాని ఢిల్లీని వాయుకాలుష్యం ఉక్కిరిబిక్కిరి చేస్తోన్న సంగ‌తి తెలిసిందే. కురుస్తున్న మంచుకు తోడు హరియాణా, పంజాబ్ ల‌లో రైతులు కొత్త పంట వేయడానికి పొలాల్లో ఉన్న‌ పాత గడ్డిని కాల్చుతుండడంతో ఢిల్లీ, నోయిడా ప్రాంతాల‌ను పొగ దుప్ప‌టి క‌ప్పేసింది. గాలిలో నాణ్యత తీవ్ర స్థాయిలో తగ్గిపోవడంతో హెల్త్‌ ఎమర్జెన్సీని ప్రకటించాలని ఇండియన్‌ మెడికల్‌ అసోసియేషన్‌(ఐంఎఏ) పేర్కొంది. స్కూళ్లకు కొద్దిరోజుల పాటు సెలవులు ఇవ్వాలని కేజ్రీవాల్ యోచిస్తున్నారు. బుధవారం ఢిల్లీలోని అన్ని ప్రాథమిక పాఠశాలలకు సెలవు ప్రకటించారు. అవసరమైతే తప్ప ఇళ్ల నుంచి ఎవరూ బయటికి రావద్దని ఢిల్లీ ప్రభుత్వం ప్రజలకు విజ్ఞప్తి చేసింది. అయితే, ఢిల్లీలో కాలేజీల‌కు వెళ్లే విద్యార్థులు, ఆఫీసుల‌కు వెళ్లే ఉద్యోగులు, అత్య‌వ‌స‌ర ప‌నుల నిమిత్తం రోడ్ల‌పైకి వ‌స్తున్న ప్ర‌జ‌లు తీవ్ర ఇబ్బందులు ప‌డ్డారు. నోయిడా హైవేపై పొగ‌మంచు కార‌ణంగా కొంద‌రు ప్ర‌మాదాల‌కు గుర‌వుతున్నారు. ఆ ప్ర‌మాదాల‌కు సంబంధించిన ఒక వీడియో సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అయింది.

ఆగ్రా-నోయిడా యమునా ఎక్స్‌ప్రెస్ వే‌ను ద‌ట్ట‌మైన‌ పొగ మంచు క‌మ్మేసింది. దీంతో, వాహ‌నాలు ఒక‌దానిని ఒక‌టి ఢీకొంటున్నాయి. ఆ ప్ర‌మాదాల‌కు సంబంధించిన వీడియో ఒక‌టి వైర‌ల్ అయింది. ఎలా జ‌రిగిందో ఏమో తెలియ‌దు కానీ, ఆ వీడియోలో ఒక బ‌స్సు, మూడు కార్లు ప్ర‌మాదానికి గురై రోడ్డుపై ఆగి ఉన్నాయి. ఆ కార్ల నుంచి క్ష‌త‌గాత్రుల‌ను అక్క‌డ పుట్ పాత్ పై ఉన్న ప్ర‌జ‌లు కింద‌కు దించే ప్ర‌య‌త్నం చేస్తున్నారు. అయితే, పొగ‌మంచు కార‌ణంగా ఈ ప్ర‌మాదానికి గురైన వాహ‌నాలు .....వెనుక నుంచి వ‌చ్చే వాహ‌నాల‌కు క‌న‌బ‌డ‌డం లేదు. దీంతో, క్ష‌త‌గాత్రుల‌ను కింద‌కు దించే లోపే వెనుక నుంచి మ‌రో కారు వ‌చ్చి వీరి వాహ‌నాన్ని ఢీ కొట్టింది. అక్క‌డ ఉన్న ప్ర‌జ‌లు వారిని వెంట‌నే వాహ‌నాల నుంచి కింద‌కు దిగి పుట్ పాత్ పైకి రావాల‌ని, కార్ల‌లోనే ఉంటే వెనుక నుంచి మ‌రో వాహ‌నం ఢీకొట్టే ప్ర‌మాద‌ముందని కేక‌లు వేస్తున్నారు. కొంత‌మంది ధైర్యం చేసి ఆ కార్ల‌లో చిక్కుకున్న వారిని బ‌య‌ట‌కు తర‌లించారు. గాయ‌ప‌డ్డ కొంత‌మంది వారంత‌ట వారే కార్ల లో నుంచి బ‌య‌ట‌కు ప‌రుగులు తీశారు. ఆ ఘ‌ట‌న‌లో మొత్తం 18 కార్లు ఒక‌దానినొక‌టి ఢీకొన్న‌ట్లు తెలుస్తోంది.

ఆ రోడ్ పై వాహానాలు ఢీకొంటున్న వీడియోను బాలీవుడ్ హీరో అర్జున్ క‌పూర్ ట్విట్ట‌ర్ లో షేర్ చేశాడు. ప్ర‌స్తుతం తాను షూటింగ్ నిమిత్తం ఢిల్లీలో ఉన్నాన‌ని, ఆ ప్ర‌మాద వీడియో చాలా భ‌యంక‌రంగా ఉంద‌ని ట్వీట్ చేశాడు. పొగ వ‌ల్ల ఢిల్లీ,నోయిడాల‌లో ప‌రిస్థితి ఊహించిన దానికంటే అధ్వాన్నంగా ఉంద‌ని, ప్ర‌జ‌లు అనేక ర‌కాలుగా ఇబ్బందులు ప‌డుతున్నార‌న్నాడు. అర్జున్ క‌పూర్ ట్వీట్ ను బాలీవుడ్ హీరోయిన్ ఆలియా భ‌ట్ త‌న ట్విట్ట‌ర్ ఖాతాలో షేర్ చేసింది. దేవుడా...ఆ వీడియో చాలా భ‌యాన‌కం క‌లిగించేలా ఉంది....అంటూ ట్వీట్ చేసింది. వారిద్ద‌రి ట్వీట్లు, ఆ వీడియో సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అయ్యాయి. ఆ ప్రమాదాలు జ‌ర‌గ‌డం బాధాక‌ర‌మ‌ని, అయితే, పొగమంచు ఎక్కువగా ఉన్నప్పుడు రోడ్లపై వాహానాలను వేగంగా నడపొద్దని, తగిన జాగ్రత్తలు పాటించాల‌ని నెటిజ‌న్లు కామెంట్లు పెడుతున్నారు. .