Begin typing your search above and press return to search.

అగ్రరాజ్యంలో మరణాల హోరు.. నిమిషానికి ఇద్దరు బలి

By:  Tupaki Desk   |   11 Dec 2020 3:37 AM GMT
అగ్రరాజ్యంలో మరణాల హోరు.. నిమిషానికి ఇద్దరు బలి
X
అగ్రరాజ్యం అమెరికా.. ఇప్పుడు మరణాలతో వణుకుతుంది. కంటికి కనిపించని మహమ్మారి విరుచుకుపడటంతో కరోనా బారిన పడిన అమెరికన్లు పిట్టల్లా రాలిపోతున్నారు. అది ఎంతలా అంటే..నిమిషానికి ఇద్దరు చొప్పున మరణాలు చోటు చేసుకుంటున్నాయి. అమెరికా చరిత్రలో ఇప్పటివరకు ఎప్పుడూ చూడని ఈ మారణ హోమంతో ఏం చేయాలో తోచని పరిస్థితి. ఓవైపు బ్రిటన్ లో కోవిడ్ 19 వ్యాక్సిన్ అక్కడి ప్రజలకు పంపిణీ చేస్తున్న వేళ.. అందుకు భిన్నంగా అమెరికాలో మాత్రం.. మాయదారి రోగం బారిన పడి పెద్ద ఎత్తున మరణాలు చోటు చేసుకుంటున్నాయి.

మరికొద్ది రోజుల్లో కోవిడ్ టీకాలు అందుబాటులోకి రాబోతున్నాయన్న వార్తలు వస్తున్న వేళ.. అందుకు భిన్నంగా అగ్రరాజ్యంలో ఇప్పటివరకు ఎప్పుడు లేనట్లుగా ఒకరోజులో అత్యధిక మరణాలు చోటు చేసుకున్నాయి. మంగళవారం అమెరికాలో 2769 మంది కరోనా బారిన పడి మరణించగా.. బుధవారం ఒక్కరోజులో ఆ దేశంలో అత్యధికంగా 3054 మంది మరణించిన వైనం షాకింగ్ గా మారింది. ఒక లెక్క ప్రకారం చూస్తే.. నిమిషానికి ఇద్దరు చొప్పున.. ఆ మాటకు వస్తే.. ఇంకాస్త ఎక్కువమందే మరణిస్తున్న దుస్థితి.

తాజాగా రోజులో 18 లక్షల మందికి పరీక్షలు నిర్వహించగా 2.10లక్షల మందికి వైరస్ సోకినట్లుగా తేల్చారు. ఇప్పటివరకు అమెరికాలో 1.50 కోట్ల మంది కరోనా బారిన పడగా.. రికార్డు స్థాయిలో ఇప్పటివరకు ఈ మహమ్మారి కారణంగా ప్రాణాలు కోల్పోయిన వారు 2,86,249 మందిగా కోవిడ్ ట్రాకింగ్ సిస్టం చెబుతోంది. ప్రస్తుతం అమెరికాలో రెండు కంపెనీలకు చెందిన టీకాలు సిద్ధమై.. అనుమతుల కోసం ఎదురు చూస్తున్నాయి. ఫైజర్.. మోడెర్నా టీకాలు తుది ఆమోదం కోసం ఎదురు చూస్తున్నాయి.

అత్యవసర వినియోగానికి ఆమోదం లభిస్తే.. ప్రమాదకర పరిస్థితిలో ఉన్న వారికి వ్యాక్సిన్ వేయటం ద్వారా వారిని కాపాడొచ్చన్న వాదన వినిపిస్తోంది. ఓపక్క బ్రిటన్.. అరబ్ దేశాల్లో వ్యాక్సిన్ అందుబాటులోకి తీసుకొచ్చిన విషయం తెలిసిందే. ఇలాంటివేళ వ్యాక్సిన్ కీలకభూమిక పోసిస్తుందని చెప్పక తప్పదు. ఏమైనా ఈ స్థాయిలో చోటు చేసుకుంటున్న మరణాలు అగ్రరాజ్యానికి సరికొత్త తలనొప్పిని తెచ్చి పెట్టాయని చెప్పక తప్పదు.