Begin typing your search above and press return to search.

అమెరికన్లను మింగేస్తున్న కరోనా.. 24 గంటల్లో అంత మంది మరణించారు

By:  Tupaki Desk   |   1 Jan 2021 12:30 AM GMT
అమెరికన్లను మింగేస్తున్న కరోనా.. 24 గంటల్లో అంత మంది మరణించారు
X
ప్రపంచానికే పెద్దన్న. తప్పు ఉన్నా.. లేకున్నా ఏదైనా దేశం మీద ఆ రాజ్యం కన్నెర్ర చేస్తే వణికిపోయే పరిస్థితి. దేశ పాలకుడి మీద కోపం వచ్చినా.. సదరు దేశ ప్రజలు ఎంత అమాయకులైనా భారీ మూల్యం చెల్లించాల్సిందే. తమ దేశ ప్రయోజనాలు తప్పించి మరింకేమీ ముఖ్యం కాదనుకునే అమెరికాను.. అమెరికన్లను వణికిస్తుంది కంటికి కనిపించని శత్రువు కరోనా.

అక్కడెక్కడో చైనాలోని వూహాన్ మహానగరంలో పుట్టిన మహమ్మారి ప్రపంచం మొత్తం వ్యాపించినా.. దాని కారణంగా భారీ మూల్యాన్ని చెల్లించింది మాత్రం అగ్రరాజ్యమే. ఇప్పటికే ప్రపంచంలో అత్యధిక కేసులే కాదు.. అతి ఎక్కువ మరణాలకే కేరాఫ్ అడ్రస్ గా నిలుస్తోంది అమెరికా. తాజాగా సెకండ్ వేవ్ అగ్రరాజ్యాన్ని ఊపేస్తోంది. కరోనా ముందు వరకు అమెరికన్లకు చావు భయం అన్నది ఎలా ఉంటుందో పెద్దగా తెలిసేది కాదు. ఎప్పుడైతే కరోనా ఎంట్రీ ఇచ్చిందో.. కంటికి కనిపించని వైరస్ కు అమెరికన్లు వణికిపోతున్నారు. చావు భయంతో తల్లడిల్లుతున్నారు.

తాజాగా గడిచిన 24 గంటల వ్యవధిలో ఆ దేశంలో 3,900 మందికి పైగా అమెరికన్లు కరోనా కారణంగా మృత్యువాత పడటం చూస్తే.. ఆ దేశంలో వైరస్ తీవ్రత ఎంతలా ఉందన్నది ఇట్టే అర్థం కాక మానదు. అమెరికాలో కరోనా మరణాల తీవ్రత ఎంతన్నది అర్థం కావాలంటే మన దేశంలో చోటు చేసుకున్న మరణాల్ని పోల్చి చూస్తే.. విషయం మరింత వివరంగా అర్థమవుతుందని చెప్పాలి. భారతదేశంలో గడిచిన 24 గంటల్లో 299 మంది మరణిస్తే.. అందుకు పదమూడు రెట్లు ఎక్కువగా అమెరికన్లు మరణించినట్లుగా జాన్స్ హాప్ కిన్స్ వర్సిటీ స్పష్టంచేస్తోంది.

అమెరికాలో గడిచిన 24 గంటల వ్యవధిలో కేసుల తీవ్రత కూడా ఎక్కువగానే ఉన్నాయి. నిన్న ఒక్కరోజులో ఆ దేశంలో 1,89,671 మందికి వైరస్ పాజిటివ్ గా తేలటం చూసినప్పుడు తీవ్రత ఎంత దారుణంగా ఉందో అర్థమవుతుంది. తాజా కేసులతో చూసినప్పుడు అమెరికాలో పాజిటివ్ కేసులు రెండు కోట్లకు దగ్గరగా చేరుకుంది.

బ్రిటన్ లో వెలుగు చూసిన కొత్త స్ట్రెయిన్ సైతం అమెరికాలో వెలుగు చూసిందని.. అది కూడా వేగంగా వ్యాప్తి చెందినట్లుగా తేల్చారు. క్రిస్మస్.. కొత్త సంవత్సరం సెలవుల తర్వాత భారీ స్థాయిలో కేసులు నమోదవుతాయని ఇప్పటికే ఆ దేశ అంటువ్యాధుల నిపుణుడు ఆంటోనీ ఫౌఛీ ఆందోళన వ్యక్తం చేసినట్లే.. తాజాగా కేసులు భారీగా నమోదు కావటం గమనార్హం. కరోనా తీవ్రత ఇంత భారీగా ఉన్న నేపథ్యంలో రానున్న కొద్దిరోజుల్లో అమెరికా అధ్యక్ష పదవిని చేపట్టిన జోడెన్ కు మరిన్ని ఇబ్బందులు తప్పవని చెబుతుననారు. ఇదిలా ఉంటే.. పాజిటివ్ కేసుల హడావుడి ఇలా ఉంటే.. వ్యాక్సిన్ వేసుకునే వారి సంఖ్య కూడా ఎక్కువే ఉంది. ఇప్పటికి వ్యాక్సిన్ తీసుకున్న వారు 2.8 మిలియన్లుగా చెబుతున్నారు. ఓవైపు ఇంతమందికి వ్యాక్సిన్ ఇస్తున్నా.. మరోవైపు రోజులో లక్షకు పైగా పాజిటివ్ కేసులు నమోదు కావటంచూస్తే.. అమెరికాను కరోనా ఏదో చేసే ప్రమాదం ఉందని భావన కలుగక మానదు.