Begin typing your search above and press return to search.

ఏపీలో మళ్లీ విజృంభణ: కొత్తగా 553 కేసులు నమోదు

By:  Tupaki Desk   |   25 Jun 2020 9:30 AM GMT
ఏపీలో మళ్లీ విజృంభణ: కొత్తగా 553 కేసులు నమోదు
X
ఆంధ్రప్రదేశ్‌ లో మరోసారి వైరస్ విజృంభణ రెట్టింపవుతోంది. తొలిసారిగా ఒక్కరోజులోనే కేసులు 500 మార్క్ దాటింది.వైరస్ పంజా విసురుతూనే ఉంది. కొత్తగా 553 కేసులు నమోదయ్యాయి. 24 గంటల్లో 19,085 నమూనాలు పరీక్షించగా రాష్ట్రానికి చెందిన 477, పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. వీరిలో ఇతర రాష్ట్రాల వారికి 69 మందికి, ఇతర దేశాల నుంచి వచ్చిన మరో ఏడుమందికి వైరస్ సోకిందని తేలింది. ఒక్క రోజే కేసులు 553 నమోదవడం, ఏడుగురు చనిపోవడం భయాందోళన రేపుతోంది.

వీటితో కలిపి రాష్ట్రవ్యాప్తంగా మొత్తం కేసుల సంఖ్య 10,884కు చేరింది. మొత్తం మరణాల సంఖ్య 136కి చేరింది. ఇప్పటికే వైరస్ బారిన పడినవారు 118 మంది కోలుకున్నారని గురువారం వైద్య ఆరోగ్య శాఖ ప్రకటించింది. వైరస్ నుంచి కోలుకున్న వారి సంఖ్య 4,988. ప్రస్తుతం యాక్టివ్ గా ఉన్న కేసులు 5,760. వీరంతా ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు.

తాజా కేసుల్లో కర్నూలు జిల్లాలో అత్యధికంగా 72, గుంటూరు జిల్లాలో 67, అనంతపురం జిల్లాలో 52, తూర్పుగోదావరి 64, కృష్ణా 47, చిత్తూరు 42, విశాఖపట్నం 40, నెల్లూరు 29, వైఎస్సార్ కడప 22, పశ్చిమగోదావరి 18, ప్రకాశం 18, విజయనగరం 5, శ్రీకాకుళం జిల్లాలో ఒక్కో కేసు చొప్పున నమోదైంది.

రాష్ట్రంలో ఇప్పటివరకు నమోదైన కేసుల్లో అత్యధికంగా కర్నూలు జిల్లాలోనే ఉన్నాయి. ఈ జిల్లాలో 1, 555 పాజిటివ్ కేసులు ఉన్నాయి. అనంతరం కృష్ణా జిల్లాలో 1,179 కేసులు ఉండగా. తర్వాతి స్థానం అనంతపురము జిల్లాదే (1,080).