Begin typing your search above and press return to search.

పని చేసి మరీ మాట పడాల్సి వస్తుందిగా జగన్?

By:  Tupaki Desk   |   7 July 2020 2:30 AM GMT
పని చేసి మరీ మాట పడాల్సి వస్తుందిగా జగన్?
X
మహమ్మారి విషయంలో రెండు తెలుగు రాష్ట్రాల్లో జగన్ ప్రభుత్వం చేపట్టిన చర్యలు.. తీసుకుంటున్న జాగ్రత్తలు.. అనుసరిస్తున్న విధానాలపై సర్వత్రా ప్రశంసలు వినిపిస్తున్నాయి. సైద్ధాంతికంగా జగన్ ను వ్యతిరేకించే వారు సైతం.. మాయదారి రోగం విషయంలో ఏపీ సర్కారు నిర్ణయాలు బాగున్నాయన్న దానికి అవునన్న మాటను చెబుతున్నారు. ఈ కారణంతోనే.. మొదట్లో తెలంగాణలో కంటే ఎక్కువగా నమోదైన పాజిటివ్ కేసులు.. ఇప్పుడు తగ్గాయి. ప్రస్తుతం ఏపీ కంటే తెలంగాణలోనే కేసులు ఎక్కువగా నమోదవుతున్న పరిస్థితి.

తెలంగాణలో పాజిటివ్ గా నమోదైన వారిలో అత్యధికుల్ని హోం క్వారంటైన్ పేరిట.. ఎవరింట్లో వారే ఉండాలని నిర్ణయించారు. ఏపీలో మాత్రం అందుకు భిన్నమైన పరిస్థితులు ఉన్నాయి. పాజిటివ్ కేసు వచ్చినంతనే వారిని.. ప్రభుత్వ ఆసుపత్రుల్లో చికిత్స పొందేలా చేస్తున్నారు. భారీ ఎత్తున కేసులు నమోదవుతున్న వేళ.. వేలాది మందిని ఆసుపత్రుల్లో ఉంచి చికిత్స చేయించటం అంటే మాటలు కాదు. వీరికి రోజువారీగా ఇవ్వాల్సిన ఆహారం దగ్గర నుంచి చూసుకోవాల్సినవి చాలానే ఉంటాయి.

ప్రభుత్వ విధానాలు బాగున్నా.. అమలయ్యే విషయంలో తేడా జరిగితే.. పని చేసి కూడా మాట పడాల్సిన ఇబ్బందికర పరిస్థితులు నెలకొంటాయి. ఏపీలోని జగన్ సర్కారు పరిస్థితి ఇదే తీరులో ఉందని చెబుతున్నారు. మహమ్మారి బారిన పడినోళ్లకు చికిత్స చేసే ఆసుపత్రుల్లో అందించే భోజనం దారుణంగా ఉందంటున్నారు. ఉడికి ఉడకని అన్నంతోపాటు.. కూరలు.. ఇచ్చే ఆహార పదార్థాలు ఏ మాత్రం నాణ్యత లేకుండా ఉన్నాయని చెబుతున్నారు. దీంతో.. క్వారంటైన్ సెంటర్లలో ఉన్న వారి పరిస్థితి మహా ఇబ్బందికరంగా మారిందంటున్నారు.

ఉదయాన్నే టిఫిన్.. మధ్యాహం భోజనంతో పాటు.. సాయంత్రం డిన్నర్ కు ఇస్తున్న ఫుడ్ ఏ మాత్రం బాగోలేదని చెబుతుననారు. ఉస్మా సంగటిని తలపించేలా ఉంటే.. చట్నీ నీళ్ల మాదిరి ఉందని వేదన చెందుతున్నారు. అన్నం అయితే ముద్ద ముద్దగా ఉందని హాహాకారాలు చేస్తున్నారు. అలా అని ప్రభుత్వానిది ఏమైనా తప్పు ఉందా? అంటే కొంత మాత్రమే అని చెప్పాలి.

ఒక్కో పేషెంట్ కు రోజుకు వారికిచ్చే ఆహారం కోసం ఏకంగా రూ.340 చెల్లిస్తున్నారు. ఇంత భారీ మొత్తాన్ని చెల్లించి కూడా దరిద్రపుగొట్టు ఫుడ్ ఇవ్వటంతో ప్రభుత్వానికి విమర్శలు తప్పట్లేదు. ఈ నేపథ్యంలో తప్పు లేకున్నా మాట పడుతున్న జగన్ సర్కారు స్పందించాల్సిన అవసరం ఉందంటున్నారు. ప్రభుత్వ ఇమేజ్ ను దెబ్బ తీస్తున్న ఇలాంటి వారి విషయంలో కఠిన చర్యలు తీసుకోవాలని చెబుతున్నారు. తామెంతగానో శ్రమిస్తున్నప్పటికి ప్రభుత్వాన్ని దెబ్బ తీసేలా జరుగుతున్న తప్పుల్ని సరిదిద్దుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది.