Begin typing your search above and press return to search.

స్విమ్స్ లో వైరస్ కల్లోలం: వైద్యులకు పాజిటివ్.. ఓపీ రద్దు

By:  Tupaki Desk   |   14 July 2020 11:30 PM GMT
స్విమ్స్ లో వైరస్ కల్లోలం: వైద్యులకు పాజిటివ్.. ఓపీ రద్దు
X
మహమ్మారి వైరస్ బారిన వైరస్ యోధులుగా నిలుస్తున్న వైద్యులు.. వైద్య సిబ్బందికి కూడా వైరస్ వ్యాపిస్తోంది. తాజాగా తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో కొనసాగుతున్న శ్రీ‌వేంక‌టేశ్వ‌ర ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడిక‌ల్ అండ్ సైన్స్ (స్విమ్స్) సూప‌ర్ స్పెషాల్టీ ఆస్ప‌త్రి కూడా వైరస్ కు తీవ్రంగా ప్రభావితమవుతోంది. ఆస్పత్రికి చెందిన వైద్యులు పెద్ద సంఖ్యలో వైరస్ బారిన పడుతున్నారు. ఆ ఆస్పత్రికి చెందిన వైద్యుల్లో ఏకంగా 40మందికి పాజిటివ్ తేలింది. దీంతో ఆస్పత్రి నిర్వాహకులు అప్రమత్తం అయ్యారు. దీంతో ఓపీ సేవలన్నింటిని రద్దు చేశారు.

రాయ‌ల‌సీమవాసుల‌కు తిరుమలలోని స్విమ్స్ సూప‌ర్ స్పెషాల్టీ ఆస్ప‌త్రి వ‌ర‌ప్ర‌సాదంగా ఉన్నారు. ఈ ఆస్ప‌త్రిలో అన్ని రోగాల‌కు అధునాత‌న‌మైన సౌక‌ర్యాలు అందుబాటులో ఉన్నాయి. ఈ ఆస్పత్రిలో మ‌ధ్య, దిగువ త‌ర‌గ‌తి ప్ర‌జ‌ల‌కు ఆరోగ్య‌శ్రీ‌, ప్రాణ‌దానం స్కీంల‌లో త‌క్కువ ధ‌ర‌కే వైద్యం అందుతోంది. ఈ ఆస్ప‌త్రిలో 40 మంది వైద్య సిబ్బందికి పాజిటివ్ నిర్ధార‌ణ కావ‌డంతో ఔట్ పేషెంట్స్ (ఓపీ) సేవ‌లు ర‌ద్దు చేసిన‌ట్టు నిర్వాహకులు సోమ‌వారం రాత్రి ప్ర‌క‌టించారు. తిరిగి ప్ర‌క‌టించే వ‌ర‌కు రోగులెవ‌రూ రాకూడ‌ద‌ని ఆస్ప‌త్రి యాజ‌మాన్యం ప్ర‌క‌టించింది.

ఆక‌స్మికంగా ఓపీ సేవ‌ల‌ను బంద్ చేయ‌డంతో ఎక్క‌డెక్క‌డి నుంచో వ‌చ్చిన రోగులు, వారి బంధువులు అవ‌స్థ‌లు ప‌డుతున్నారు. పరిస్థితి ఇలా ఉంటే తిరుపతి నగరంలో వైరస్ తీవ్రంగా ప్రబలుతోంది. ఈ ఒక్క న‌గ‌రంలోనే ఇప్ప‌టివ‌ర‌కు 1,092 కేసులు న‌మోదవడం భయాందోళన రేపుతోంది.