Begin typing your search above and press return to search.

డేంజర్ అంచులో ఉన్నారా? ఏపీలో కరోనా పుట్ట పగలబోతుందా?

By:  Tupaki Desk   |   18 March 2021 4:30 AM GMT
డేంజర్ అంచులో ఉన్నారా? ఏపీలో కరోనా పుట్ట పగలబోతుందా?
X
గడిచిన కొద్ది నెలలుగా ఎన్నికల రాజకీయం చుట్టూనే తప్పించి.. మరింకేమీ పట్టనట్లుగా వ్యవహరించిన తీరుకు ఏపీ ప్రభుత్వంతో పాటు.. ఏపీ ప్రజలు సైతం మూల్యం చెల్లించే పరిస్థితికి వచ్చేశారా? ప్రభుత్వానికి తగ్గట్లే.. ప్రజల్లో తగ్గిన అప్రమత్తత పెను ప్రమాదం దిశగా అడుగులు వేసే పరిస్థితుల్లోకి వెళుతున్నామా? రాష్ట్ర ప్రభుత్వానికి పట్టని లెక్కలు ప్రధాని మోడీ నోటి నుంచి వచ్చిన తీరు చూస్తే.. ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు వణుకు పుట్టాల్సిందే.

కరోనా విరుచుకుపడే వేళలో..పెద్ద ఎత్తున కరోనా నిర్దారణ పరీక్షలు చేసే విషయంలో అందరి చేత ప్రశంసలు అందుకున్న ఏపీ.. తాజాగా మాత్రం అందుకు భిన్నమైన ఇమేజ్ ను మూటగట్టుకుంటోంది. వ్యాక్సినేషన్ వేస్టేజ్ విషయంలో ఇప్పటికే ప్రధాని సైతం వేలెత్తి చూపించాల్సిన పరిస్థితిని తెచ్చుకున్నారు. అంతేకాదు.. వ్యాక్సినేషన్ వేసే విషయంలోనూ వెనుకబడి ఉండటం గమనార్హం.

ఇదంతా ఒక ెత్తు అయితే.. మార్చి ఒకటి నుంచి పదిహేను వరకు కరోనా కొత్త కేసుల జోరు వణుకు పుట్టేలా ఉన్న విషయం ప్రధాని మోడీ నోటి నుంచి రావటం గమనార్హం. మార్చి ఒకటి నుంచి 15 మధ్య కాలంలో క్రిష్ణా జిల్లాలో 171.4 శాతం.. తూర్పుగోదావరి జిల్లాలో 150 శాతం.. విశాఖపట్నం జిల్లాలో 100 శాతం.. చిత్తూరుజిల్లాలో 92 శాతం.. గుంటూరు జిల్లాలో 70 శాతం పెరుగుతున్న విషయం బయటకు వచ్చింది.

మొత్తం 13 జిల్లాల్లో ఐదు జిల్లాల్లో ఇంత భారీగా పెరుగుతున్న కేసులు కొత్త సవాళ్లను విసరటమే కాదు.. ఇదే పరిస్థితి కొనసాగితే రానున్న రోజుల్లో కరోనా పుట్ట పగలటం ఖాయమని చెప్పక తప్పదు. మోడీ ప్రస్తావించిన అంశాల నేపథ్యంలో.. కరోనా అంశంపై ఏపీ ప్రభుత్వం మరింతగా ఫోకస్ చేయటమే కాదు.. అత్యధిక ప్రాధాన్యతను ఇవ్వాల్సిన అవసరం ఉందన్న విషయం ఇట్టే అర్థం కాక మానదు. సో.. ఆంధ్ర ప్రాంత ప్రజలంతా బీకేర్ ఫుల్ గా ఉండాల్సిన సమయం ఆసన్నమైనట్లే.