Begin typing your search above and press return to search.

ఫిబ్రవరిలో 15వేల కేసులు.. ఏప్రిల్ లో 2లక్షలకు చేరి షాకిస్తుందా?

By:  Tupaki Desk   |   29 March 2021 10:21 AM IST
ఫిబ్రవరిలో 15వేల కేసులు.. ఏప్రిల్ లో 2లక్షలకు చేరి షాకిస్తుందా?
X
నెలలో ఎంత మార్పు వచ్చేసింది? ఏడాది క్రితం ఏ రేంజ్ లో అయితే కరోనా వ్యాప్తి జరిగిందో.. ఇప్పుడు అలాంటి తీరే దేశ వ్యాప్తంగా కనిపిస్తోంది. కేవలం నెల వ్యవధిలో చోటు చేసుకున్న మార్పులు.. కొత్త భయాల్ని తీసుకొస్తున్నాయి. గత ఏడాది కరోనా కేసుల రాక మొదట్లోనే లాక్ డౌన్ ను ప్రకటించటంతో కేసుల నమోదు పెద్దగా కాలేదు. అయితే.. లాక్ డౌన్ నిబంధనల్ని సడలించటం షురూ అయిన తర్వాత నుంచి కేసులు ఎక్కువగా నమోదయ్యాయి.అయితే.. డిసెంబరు నుంచి డౌన్ ఫాల్ కనిపించి ఫిబ్రవరి నాటికి బాగా తగ్గాయి.

ఫిబ్రవరిలో దేశ వ్యాప్తంగా 15వేల కేసులు మాత్రమే నమోదయ్యాయి. వాటిల్లోనూ మహారాష్ట్ర.. కేరళ కేసుల్ని మినహాయిస్తే.. దేశ వ్యాప్తంగా చాలా రాష్ట్రాల్లో కేసులు పెద్దగా నమోదు కాని పరిస్థితి. అందుకు భిన్నంగా నెలలో వచ్చిన మార్పు చూస్తే.. రానున్న రోజుల్లో పరిస్థితులు మరెంత దారుణంగా మారతాయన్న భయం కలుగక మానదు. ఫిబ్రవరిలో దేశ వ్యాప్తంగా 15వేల కేసులు నమోదు అవుతుంటే.. కేవలం నెల వ్యవధిలో కేసుల నమోదు 60వేలకు చేరుకుంది. అంటే.. నెలలో నాలుగు రెట్లు ఎక్కువగా నమోదైనట్లు.

ఇప్పుడున్న పరిస్థితుల్లో రానున్న రోజుల్లో కొనసాగితే.. పరిస్థితి మహా ఇబ్బందికరంగా మారుతుందన్న భయం వ్యక్తమవుతోంది. ఎందుకంటే.. మార్చిలో మాదిరే నాలుగు రెట్లు కేసుల నమోదు అయితే.. ఏప్రిల్ చివరి నాటికి రోజుకు రెండు లక్షల పాజిటివ్ కేసుల మార్క్ ను టచ్ చేసే ప్రమాదం పొంచి ఉందని చెప్పాలి. అదే జరిగితే.. నష్టం భారీగా ఉంటుంది. ఇలాంటి ఇబ్బందికర పరిస్థితి ఉందా? అంటే.. అవకాశాలు ఉన్నాయని చెప్పాలి. లాక్ డౌన్ కారణంగా జరిగిన ఆర్థిక నష్టాన్ని పరిగణలోకి తీసుకున్న రాష్ట్ర ప్రభుత్వాలు.. మరోసారి లాక్ డౌన్ ఆలోచన చేయటానికి సైతం ఇష్టపడటం లేదు.

అయితే.. మహారాష్ట్రలో పరిస్థితి పూర్తిగా ఇబ్బందికరంగా మారటం.. అయినప్పటికి ప్రజల్లో మార్పులు రాకపోవటంతో లాక్ డౌన్ విధించక తప్పదన్న సంకేతాల్ని ఇవ్వటం తెలిసిందే. మహారాష్ట్ర గుణపాఠాన్ని చూసైనా.. దేశంలోని మిగిలిన రాష్ట్రాలు కళ్లు తెరిచి.. ముందస్తు జాగ్రత్తలు పెద్ద ఎత్తున తీసుకుంటే తప్పించి.. కేసుల నమోదు తగ్గే అవకాశం కనిపించటం లేదు. ఈ నేపథ్యంలో ఏప్రిల్ లో భారీగా కేసుల నమోదుకే ఎక్కువ అవకాశం ఉంది. ఎవరికి వారు పెద్ద ఎత్తున జాగ్రత్తలు తీసుకోవటం చాలా అవసరమన్నది మర్చిపోకూడదు.