Begin typing your search above and press return to search.

యడ్డి సంచలనం.. ఆ నగరాల నుంచి వస్తే నేరుగా క్వారంటైనే

By:  Tupaki Desk   |   16 Jun 2020 4:00 AM GMT
యడ్డి సంచలనం.. ఆ నగరాల నుంచి వస్తే నేరుగా క్వారంటైనే
X
కర్ణాటక రాష్ట్ర ముఖ్యమంత్రి యడియూరప్ప సంచలన నిర్ణయం తీసుకున్నారు. రాష్ట్రంలో మాయదారి రోగానికి సంబంధించిన కేసులు అంతకంతకూ విస్తరిస్తున్న వేళ.. కఠినమైన నిర్ణయాల్ని తీసుకోవాలని డిసైడ్ అయ్యారు. ఇందులో భాగంగా యడ్డి సర్కారు తాజాగా తన నిర్ణయాన్ని ప్రకటించింది. వైరస్ తీవ్రత ఎక్కువగా ఉన్న ఢిల్లీ.. చెన్నై మహానగరాల నుంచి కర్ణాటకలోకి అడుగు పెట్టేవారు ఎవరైనా సరే.. తక్షణమే క్వారంటైన్ వెళ్లాల్సిందేనని స్పష్టం చేశారు.

అది కూడా ఏ వారమో కాదు.. ఏకంగా రెండు వారాలపాటు క్వాంరటైన్ లో ఉండాలని చెబుతున్నారు. తొలి మూడు రోజులు సంస్థాగత క్వారంటైన్ కు వెళ్లాల్సి వస్తుందని.. ఆ తర్వాత పదకొండు రోజులు మాత్రం హోం ఐసోలేషన్ లో ఉండాలని కోరుతున్నారు. ఇప్పటివరకూ మహారాష్ట్ర నుంచి వచ్చిన వారికి మాత్రం ఏడు రోజుల పాటు సంస్థాగత క్వారంటైన్ చేస్తున్నామన్నారు.

మిగిలిన రాష్ట్రాల నుంచి వచ్చే వారిలో లక్షణాలు లేకుంటే మాత్రం వారికి సంస్థాగత నిర్భందం విధించకుండా హోం క్వారంటైన్ కు వెళ్లాలన్న సూచనలు చేస్తున్నట్లు చెప్పారు. రాష్ట్రంలో తాజాగా నెలకొన్న పరిణామాల మీద మంత్రులు.. ఇతర అధికారులతో మాట్లాడిన యడ్డి.. తమ రాష్ట్రంలో ఉన్న వారి కంటే.. రాష్ట్రానికి వస్తున్న వారి కారణంగా పాజిటివ్ కేసులు ఎక్కువగా నమోదవుతున్న విషయాన్ని వెల్లడించారు.

ఈ క్రమంలో ఇతర రాష్ట్రాల నుంచి కర్ణాటకకు వస్తున్న వారి విషయంలో మరింత అప్రమత్తంగా ఉండాలని స్పష్టం చేశారు. రాష్ట్రంలో మరోసారి లాక్ డౌన్ విధించే ఆలోచన తమకు లేదన్న యడ్డి.. రానున్న రోజుల్లో మరిన్ని సడలింపులు ఇవ్వాలని తాము కోరనున్నట్లు చెప్పారు. రాష్ట్రంలో నమోదైన పాజిటివ్ కేసుల గురించి చెప్పిన సీఎం యడ్డి.. ఇప్పటివరకూ ఏడు వేల కేసులు నమోదైతే.. అందులో 4386 మంది మహారాష్ట్ర నుంచి వచ్చిన వారేనని పేర్కొన్నారు. కర్ణాటకలో మరణాల రేటు 1.2 శాతం ఉంటే.. రికవరీ రేటు 56.6 శాతం ఉందని చెప్పారు.