Begin typing your search above and press return to search.

‘మహా’ ముప్పు.. పొంచిఉందా?

By:  Tupaki Desk   |   15 April 2021 7:30 AM GMT
‘మహా’ ముప్పు..  పొంచిఉందా?
X
దేశవ్యాప్తంగా కరోనా మరోసారి విలయతాండవం చేస్తున్న విషయం తెలిసిందే. అయితే మహారాష్ట్ర పరిస్థితి మరింత దారుణంగా తయారైంది. అక్కడ రోజురోజుకూ విచ్చలవిడిగా కేసులు పెరుగుతున్నాయి. దేశవ్యాప్తంగా నమోదవుతున్న కేసుల్లో సింహభాగం ఆ రాష్ట్రం నుంచే ఉండటంతో అక్కడ ప్రజల్లో భయాందోళనలు నెలకొన్నాయి. కేసులు విపరీతంగా పెరిగిపోయి.. ఆ తర్వాత తగ్గిపోతాయా? లేక ఎంతకాలం ఈ పరిస్థితి నెలకొని ఉంటుంది? అని ప్రజలు అనుక్షణం వణికిపోతున్నారు. ఆ రాష్ట్రంలో పరిస్థితి చేయి దాటి పోయిందన్న విశ్లేషణలు కూడా సాగుతున్నాయి.

మనదేశానికి ముంబై మహానగరం అతిపెద్ద మార్కెట్​. పారిశ్రామిక, సినీరంగం, వ్యాపారాలు పెద్ద మొత్తంలో అక్కడ ఉంటాయి. ముంబైని నమ్ముకొని ఎంతో మంది బతుకుతుంటారు. అయితే కరోనా వచ్చినప్పటి నుంచి అక్కడ పరిస్థితులు దారుణంగా మారిపోయాయి. చాలా మంది ఉపాధి కోల్పోయారు. అయితే కరోనా తగ్గుముఖం పట్టి మళ్లీ వ్యాపారాలు పుంజుకుంటున్న దశలోనే మరోసారి సెకండ్​ వేవ్​ ప్రకంపనలు సృష్టిస్తున్నది. ఓ వైపు వ్యాక్సినేషన్​ కొనసాగుతున్నా.. ఈ స్థాయిలో కేసులు పెరుగుతుండటం ఆందోళన కలిగించే అంశమని నిపుణులు అంచనావేస్తున్నారు.

మహారాష్ట్ర ప్రభావంతో సరిహద్దు రాష్ట్రాలు కూడా వణికిపోతున్నాయి. అక్కడ ప్రభుత్వం కరోనాను అరికట్టేందుకు ఇప్పటికే చర్యలకు ఉపక్రమించింది.
15 రోజుల పాటు కర్ఫ్యూ విధించారు. దీంతో ముంబయిలో ఉంటున్న ఇతర రాష్ట్రాల ప్రజలు మళ్లీ సొంతూళ్లకు పయనమయ్యారు. గతంలో ఓ సారి ప్రజలు ముంబై నుంచి సొంత గ్రామాలకు వెళ్లిన విషయం తెలిసిందే. అయితే కరోనా తగ్గి కేసుల తీవ్రత క్షీణించడంతో వారంతా ముంబై చేరుకున్నారు. ప్రస్తుతం మళ్లీ వాళ్లు స్వస్థలాలకు వెళ్లిపోతున్నారు. మరోవైపు చిరువ్యాపారులు తీవ్ర ఇక్కట్లు ఎదుర్కొంటున్నారు.

ముంబైలోని బస్టాండ్లు, రైల్వే స్టేషన్లు ప్రజలతో కిక్కిరిసిపోతున్నాయి. లోక్‌మాన్య తిలక్ టెర్మినస్ కు ప్రజలు క్యూ కడుతున్నారు. ఇంతమందిని కంట్రోల్​ చేయలేక ప్రభుత్వం సైతం తల పట్టుకుంటున్నది. ఇప్పటికే అదనపు బలగాలను మోహరించారు. రాత్రి 8 గంటల నుంచి ఉదయం 7 గంటల వరకు 15 రోజుల పాటు జనతా కర్ఫ్యూ విధించారు. రాష్ట్రంలో 144 సెక్షన్​ను అమలు చేస్తున్నారు. ఇక ఆస్పత్రులు సైతం రోగులతో నిండిపోయాయి.