Begin typing your search above and press return to search.

రోజూ 40-50 మ‌ర‌ణాల‌ను దాస్తున్నారు-రేవంత్‌

By:  Tupaki Desk   |   15 Jun 2020 3:30 AM GMT
రోజూ 40-50 మ‌ర‌ణాల‌ను దాస్తున్నారు-రేవంత్‌
X
తెలంగాణ రాష్ట్రంలో క‌రోనా కేసులు, మ‌ర‌ణాల విష‌యంలో రాష్ట్ర‌ ప్ర‌భుత్వం ప్ర‌జ‌ల్ని త‌ప్పుదోవ ప‌ట్టిస్తోంద‌ని కాంగ్రెస్ పార్టీ అగ్ర‌నేత‌, ఎంపీ రేవంత్ రెడ్డి ఆరోపించారు. రాష్ట్రంలో క‌రోనా మ‌ర‌ణాల విష‌యంలో ఆయ‌న తెలంగాణ ప్ర‌భుత్వంపై సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు చేశారు. రాష్ట్రంలో రోజూ 40-50 దాకా క‌రోనా మ‌ర‌ణాల‌ను దాచి పెడుతున్నార‌ని ఆయ‌న ఆరోపించారు. ఆదివారం రేవంత్.. గ‌చ్చిబౌలి లో ప్ర‌భుత్వం ఏర్పాటు చేసిన కోవిడ్ ఆసుప‌త్రిని ఆక‌స్మికంగా త‌నిఖీ చేశారు. అనంత‌రం అక్క‌డి ప‌రిస్థితుల‌పై మీడియాతో మాట్లాడారు.

ప్ర‌త్యేక కోవిడ్ ఆస్పత్రిగా ప్రారంభించిన గ‌చ్చిబౌలి టిమ్స్‌లో చెత్త‌, న‌లుగురు సెక్యూరిటీ, ఓ కుక్క త‌ప్పా ఎవ‌రూ లేరని రేవంత్ రెడ్డి అన్నారు. మీరు చెప్పిన 100 మంది డాక్ట‌ర్లు, ప్ర‌పంచ అత్యాధునిక వైద్యం ఎక్కడుందని కేసీఆర్‌ను ప్ర‌శ్నించిన రేవంత్‌.. కేసీఆర్ మాట‌ల‌కు, చేత‌ల‌కు పొంత‌న లేద‌న‌టానికి టిమ్స్ ప్ర‌త్య‌క్ష ఉదాహ‌ర‌ణ అన్నారు. వెంట‌నే టిమ్స్ ప్రారంభం అయ్యేలా చ‌ర్య‌లు చేప‌ట్టాలని రేవంత్ డిమాండ్ చేశారు. దేశానికే త‌ల‌మానికంగా చెప్పుకున్న టిమ్స్ లో మురుగు నీరు వ్య‌వ‌స్థ కూడా లేదని, ప‌క్క‌నున్న సెంట్ర‌ల్ యూనివ‌ర్శిటీలోకి వ‌దిలేస్తే వారు ఆందోళ‌న చేస్తున్నారని మండిపడ్డారు. మురుగునీటి వ్యవస్థకు తాను ఎంపీ నిధుల నుంచి రూ. 50 ల‌క్ష‌లు మంజూరు చేసినా ప‌నులు మొద‌లు పెట్ట‌లేదని రేవంత్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణ‌ లో ఇప్ప‌టి వ‌ర‌కు క‌రోనా ప‌రీక్ష‌లు 50 వేలు కూడా చేర‌క‌ పోవ‌డం దారుణ‌మ‌ని రేవంత్ విమ‌ర్శించారు. వైద్య‌శాఖ మంత్రిని కేసీఆర్ పొలాల్లో దిష్టి బొమ్మ‌గా చేశారని విమర్శించారు.