Begin typing your search above and press return to search.

నమస్తే తెలంగాణలో కొత్త కలకలం.. పలువురు స్వీయ క్వారంటైన్ కు

By:  Tupaki Desk   |   15 Jun 2020 4:45 AM GMT
నమస్తే తెలంగాణలో కొత్త కలకలం.. పలువురు స్వీయ క్వారంటైన్ కు
X
అక్కడెక్కడో అల్లంత దూరాన ఉన్న వూహాన్ లో మాయదారి మహమ్మారి వచ్చింది చూశాం. జనవరి మొదట్లో సింగిల్ కాలం వార్తలు మాత్రమే అచ్చేసిన మీడియా.. ఆ వార్తలే రానున్న రోజుల్లో తమకు గుదిబండగా మారతాయని చాలా మంది అసలు ఊహించింది లేదు. కేవలం ఆర్నెల్ల వ్యవధిలో సీన్ మొత్తం మారిపోయింది. ఇప్పుడు ఇంటి పక్కకు.. ఆఫీసులో పక్క సీటు వరకూ వచ్చేసిన ఈ మహమ్మారి కారణంగా ఎప్పుడు ఎలాంటి వార్త వినాల్సి వస్తుందో అస్సలు అర్థం కావట్లేదు.

తెలంగాణ రాష్ట్ర అధికారపక్షానికి చెందిన సొంత మీడియా సంస్థలో తాజాగా మాయదారి రోగం సంచలనంగా మారింది. నమస్తే తెలంగాణ దినపత్రికలో కీలక స్థానానికి చెందిన సీనియర్ పాత్రికేయుడికి పాజిటివ్ గా తేలింది. దీంతో హైదరాబాద్ ప్రధాన కార్యాలయంలో పని చేసే వారికి షాక్ తగిలినట్లుగా మారింది. ఇక.. ఇదే పత్రికకు ఎడిటర్ తో పాటు.. పలువురు కీలక జర్నలిస్టులు ఇప్పుడు తీవ్రమైన ఒత్తిడిలో ఉన్నట్లు చెబుతున్నారు.

పాజిటివ్ వచ్చిన వ్యక్తి అల్లాటప్ప వ్యక్తి కాదు. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ కు సన్నిహితుడైన ఆయన్ను మహమ్మారి పట్టేయటంతో.. ఆయనతో తరచూ సమావేశమయ్యే వారంతా ఇప్పుడు తీవ్ర ఒత్తిడికి గురి అవుతున్నారు. శనివారం సాయంత్రం కూడా సదరు సీనియర్ పాత్రికేయుడు నమస్తే తెలంగాణ ఆఫీసుకు రావటమే కాదు..కీలక సమావేశాల్లో పాలు పంచుకున్నట్లుగా తెలుస్తోంది.

దీంతో.. ఆ పత్రికకు చెందిన ప్రముఖ జర్నలిస్టుల్లో ముఖ్యులు హోం క్వారంటైన్ కు వెళ్లినట్లుగా సమాచారం. ఆసక్తికరమైన విషయం ఏమంటే.. నమస్తే తెలంగాణ మీడియా సంస్థకు చెందిన ప్రముఖుడు ఒకరికి పాజిటివ్ తేలిన వేళలోనే.. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి వైరస్ వ్యాప్తికి చెక్ పెట్టేందుకు ఏమేం చర్యలు తీసుకోవాలన్న అంశంపై సుదీర్ఘ భేటీని నిర్వహించటం గమనార్హం.