Begin typing your search above and press return to search.

కోలుకున్నా.. వైరస్ భయంతో ఇళ్లకు తీసుకెళ్లని కుటుంబీకులు

By:  Tupaki Desk   |   26 Jun 2020 11:50 AM GMT
కోలుకున్నా.. వైరస్ భయంతో ఇళ్లకు తీసుకెళ్లని కుటుంబీకులు
X
హైదరాబాద్ లోని గాంధీ ఆస్పత్రిలో దారుణ పరిస్థితి ఏర్పడింది. రోజురోజుకు వైరస్ బాధితులు పెద్ద సంఖ్యలో చేరుతుండడంతో ఆస్పత్రిలో బెడ్లన్నీ నిండిపోతున్నాయి. అయితే ఆస్పత్రిలో కొత్త సమస్య వచ్చి పడింది. వైరస్ నుంచి కోలుకున్న వారు ఇంకా ఆస్పత్రిలోనే ఉంటున్నారు. అలా ఏకంగా 50 మంది అలాంటి వారు ఉన్నారంట. కోలుకున్న వారికి మరోసారి పరీక్షలు చేయాలని వారి కుటుంబసభ్యులు గాంధీ ఆస్పత్రి వైద్యులను కోరుతున్నారు. అయితే పరీక్షలు చేయడానికి నిబంధనలు అంగీకరించడం లేదని గాంధీ ఆస్పత్రి అధికారులు చెబుతున్నారు. దీంతో కొన్ని రోజులుగా ఆస్పత్రిలో కోలుకున్న వారు ఉంటున్నారు.

వైరస్ నుంచి కోలుకున్న వారికి మరోసారి పరీక్ష చేయాలని కొందరు, తమ ఇంటి వద్ద ప్రత్యేక గది సదుపాయం లేదు అని కొందరు తీసుకెళ్లేందుకు నిరాకరిస్తున్నారు. దీంతో చేసేదేమీ లేక మరో 14 రోజులపాటు హోం క్వారంటైన్ వసతి కల్పిస్తున్నారు. వైరస్ తగ్గడంతో వైద్యులు డిశ్చార్జ్ చేసేందుకు సిద్ధంగా ఉన్నారు.

ఈ విషయమై వారి కుటుంబసభ్యులకు ఫోన్లు చేస్తుండగా లిప్ట్ చేయడం లేదు అని గాంధీ ఆస్పత్రి సిబ్బంది చెబుతున్నారు. మరికొందరు తమ వాళ్లు వస్తారని ఆశగా ఎదురుచూసి.. గేటు వద్దే నిరీక్షిస్తున్నారు. ఎంతకీ కుటుంబసభ్యులు రాకపోవడంతో తిరిగి ఆస్పత్రిలో చేరుతున్నారు. అలా ఇప్పటివరకు 50 మంది వరకు తిరిగి ఆస్పత్రిలో చేరారని గాంధీ వైద్యులు తెలిపారు. వీరంతా 10-15 రోజుల్లోనే వ్యాధి నయమైన వారే ఉన్నారు. వారిని తీసుకెళ్లేందుకు రాక ఇక్కడే ఉండిపోయారు.

ఆస్పత్రిలో 50 మంది వరకు ఆరోగ్యంగా ఉన్నారని, వైరస్ లక్షణాలు లేవని గాంధీ నోడల్ అధికారి డాక్టర్ ప్రభాకర్ రావు తెలిపారు. వారు హోం క్వారంటైన్‌లో ఉంచితే సరిపోతుందని చెప్పారు. మరికొందరు మరోసారి పరీక్ష చేయాలని కోరుతున్నారని.. వారికి నెగిటివ్ వస్తే తీసుకెళతామని చెబుతున్నారని వెల్లడించారు. ఐసీఎంఆర్ మార్గదర్శకాల మేరకు రోగికి వైరస్ తగ్గాక మరోసారి పరీక్షలు చేయరని.. ఆ నిబంధనల మేరకు తాము నడుచుకుంటున్నామని గాంధీ అధికారులు తెలిపారు.

వైరస్ తగ్గినా.. కుటుంబసభ్యులు మాత్రం అనుమానంతో వారిని తీసుకెళ్లేందుకు జంకుతున్నారు. వారిని తీసుకెళితే తమకు ఎక్కడ వైరస్ సోకుతుందేమోనని భయపడుతున్నారు. అందుకే వారిని తీసుకెళ్లేందుకు వెనకాడుతున్నారు. ఫ్యామిలీ మెంబర్స్ తీసుకెళ్లకపోవడంతో కొందరినీ గాంధీలో బెడ్స్ ఏర్పాటు చేసి ఉంచామని, మరికొందరినీ నేచర్ క్యూర్ ఆస్పత్రి క్వారంటైన్ కేంద్రానికి తరలించినట్లు అధికారులు తెలిపారు.