Begin typing your search above and press return to search.

ఈటెలను పిచ్చ లైట్ తీసుకుంటున్నారా?

By:  Tupaki Desk   |   1 July 2020 5:30 PM GMT
ఈటెలను పిచ్చ లైట్ తీసుకుంటున్నారా?
X
కొన్నిసార్లు చోటు చేసుకునే పరిణామాలు మహా ఇబ్బందికరంగా ఉంటాయి. తాజాగా అలాంటిదే ఒకటి చోటు చేసుకుంది. ప్రపంచాన్ని వణికిస్తున్న మహమ్మారిపై ప్రజల్లో మరింత అవగాహన పెంచేందుకు వీలుగా భారీ ఎత్తున హోర్డింగులను సిద్ధం చేశారు. వీటిని హైదరాబాద్ మహానగరంలోని పలు ప్రాంతాల్లో ఏర్పాటు చేశారు. ఇక్కడి వరకూ అంతా బాగానే ఉన్నా.. సదరు హోర్డింగ్ లో ముఖ్యమంత్రి కేసీఆర్ ఫోటో.. మంత్రి కేటీఆర్ ఫోటో తప్పించి.. వైద్య ఆరోగ్య శాఖామంత్రిగా వ్యవహరిస్తున్న ఈటెల రాజేందర్ ఫోటో మిస్ అయ్యింది.

ఇలా ఫోటోలు మిస్ కావటం టీఆర్ఎస్ లో కొత్తేం కాదు. ఆ మధ్య కొన్ని నెలల పాటు టీఆర్ఎస్ పార్టీ అధికారిక పత్రిక అయిన నమస్తే తెలంగాణలో హరీశ్ రావు ఫోటో కనిపించని పరిస్థితి. ఆ తర్వాత పరిస్థితి మారిందనుకోండి. తాజాగా.. ఈటెల ఫోటో మిస్ కావటం వెనుక కారణం ఏమై ఉంటుందన్నది ఆసక్తికరంగా మారింది. తాజా ఎపిసోడ్ లో ఈటెల పని తీరు మీద సారు ఆగ్రహంగా ఉన్నారని.. సరిగా నిర్వహించటం లేదన్న భావన ఉందని చెబుతున్నారు. దీనికి తగ్గట్లే.. హోర్డింగుల్లో ఈటెల మిస్ అయ్యారని చెబుతున్నారు.

కేసీఆర్ ను ఇరుకున పెట్టేందుకు.. కేటీఆర్ ను విమర్శల గోదాలో దించే అవకాశం ఉన్న ఈ ఉదంతంపై కాంగ్రెస్ నేతలు రంగంలోకి దిగారు. అందరి కంటే దూకుడుగా అపోలో అల్లుడు అదేనండి మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి రంగంలోకి దిగారు. మంత్రి ఈటెల కు ఏమీ చేయనీకుండా ఆయన చేతులు.. కాళ్లు కట్టేశారన్నారు. అన్ని రంగాలకు సంబంధించిన విషయాలు తమకే తెలుసని అనుకోవటం మంచిది కాదని.. కేసీఆర్.. కేటీఆర్ లపై విరుచుకుపడ్డారు.

రాజకీయాల్ని పక్కన పెడితే.. వైఎస్సార్ ప్రవేశ పెట్టిన ఆరోగ్యశ్రీని కేసీఆర్ మర్చిపోయారని.. ఆ పథకం ఇప్పుడు దివాళా తీసిందని మండిపడ్డారు. కాళేశ్వరాన్ని కలువరిస్తూ సీఎం అన్ని మర్చిపోయారని.. వెంటనే ఆరోగ్య శాఖకు నిధులు పంపిణీ చేయాలన్నారు. తెలంగాణ రాష్ట్రంలో ఆరోగ్య శాఖామంత్రి ఈటెల? కేసీఆరా? కేటీఆరా? అంటూ తనదైన శైలిలో అడిగిన తీరు ఇప్పుడు అందరిని ఆకర్షిస్తోంది.