Begin typing your search above and press return to search.

కూకట్‌ పల్లి పై మహమ్మారి పంజా..వణికి పోతున్న నగర వాసులు!

By:  Tupaki Desk   |   3 July 2020 11:30 PM GMT
కూకట్‌ పల్లి పై మహమ్మారి పంజా..వణికి పోతున్న నగర వాసులు!
X
తెలంగాణలో మహమ్మారి పాజిటివ్ కేసులు రోజురోజుకి భారీగా పెరుగుతున్నాయి. ముఖ్యంగా గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో మహమ్మారి కేసులు ఎక్కువగా నమోదు అవుతున్నాయి. రాష్ట్రంలో నమోదయ్యే కేసుల్లో 70నుండి 80శాతం వరకు ఒక్క హైదరాబాద్ పరిధిలోనే నమోదవుతుండటం తో నగరవాసుల్లో ఆందోళన పెరుగుతుంది. ఇకపొతే సిటీలో కూకట్‌పల్లి, మూసాపేట జంట సర్కిళ్ల పరిధుల్లో 300లకుపైగా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఇప్పటివరకు 9 మంది మృతిచెందగా.. 170 మంది బాధితులు ఆస్పత్రులు, హోం క్వారంటైన్ ‌లో ఉన్నారు. మార్చి, ఏప్రిల్‌, మే నెలల్లో కేసుల నమోదు చాలా తక్కువగా ఉన్నప్పటికీ, ఈ మధ్య పెరిగాయి. జూన్ ‌లో వందకు పైగా నమోదయ్యాయి. జూలైలో ప్రతిరోజూ 25కి పైగా కేసులు నమోదవుతున్నాయి.

జీహెచ్ ‌ఎంసీ సిబ్బందికి , పోలీసులకి కూడా వైరస్ సోకడంతో అధికారులు, సిబ్బంది విధుల నిర్వహణ విషయంలో భయాందోళనకు గురవుతున్నారు. ఆరోగ్య శాఖ అధికారులు, సిబ్బంది పరిస్థితి దారుణంగా ఉంది. సిబ్బంది కొరత, వైరస్ నిర్దారణ పరీక్షల విషయంలో ప్రభుత్వం నుంచి స్పష్టమైన ఆదేశాలు జారీ కాకపోవడంతో ఏంచేయాలో దిక్కుతోచడంలేదు. కూకట్‌ పల్లి ప్రాంతంలో 2 వేల మందికి ఓ ఏఎన్‌ ఎం ఉండాల్సి ఉండగా.. 60 వేల మందికి ముగ్గురు మాత్రమే ఉన్నారు. కూకట్‌ పల్లి పీహెచ్ ‌సీలో కనీసం 30మంది అధికారులు, సిబ్బంది ఉండాల్సి ఉండగా... 13 మంది మాత్రమే విధులు నిర్వహిస్తున్నారు.

మొదట్లో ధనికులు ఉండే కాలనీల్లో కేసుల నమోదు ప్రారంభమైంది. ఇతర దేశాల నుంచి రావడంతో ఆయా ప్రాంతాల్లో కేసులు నమోదయ్యాయని అధికారులు గుర్తించి ఆయా కాలనీలవాసులు నివారణ చర్యలు చేపట్టారు. ముఖ్యంగా గేటెడ్‌ కమ్యూనిటీల్లో మొదటిసారి కేసు నమోదు కాగానే కాలనీలోకి రాకపోకలను కఠినతరం చేశారు. కాలనీవాసులందరూ తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అవగాహన పెంపొందించుకొని అప్రమత్తమయ్యారు. అయితే , లాక్ డౌన్ నుండి సడలింపులు ఇచ్చిన తరువాత బస్తీల్లో కేసులు పెరుగుతున్నాయి. పరిశుభ్రత విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరించడం, మహమ్మారి రక్షణ చర్యలు పాటించడంపై దృష్టి సారించకపోవడంతో కేసులు విపరీతంగా పెరుగుతున్నట్లు తెలుస్తుంది.

కుత్బుల్లాపూర్‌ సర్కిల్‌ పరిధిలో శనివారం నాటికి మొత్తం 90 మహమ్మారి పాజిటివ్‌ కేసులు నమోదు కాగా, ముగ్గురు మృతి చెందారు. గాజులరామారం సర్కిల్‌ పరిధిలో 58 మహమ్మారి పాజిటివ్‌ కేసులు నమోదు కాగా, వీరిలో ఇద్దరు మృతి చెందారు. కుత్బుల్లాపూర్‌ నియోజకవర్గంలో 256 మంది వైరస్‌ బారినపడ్డారు. వీరిలో 10 మంది మృతి చెందగా, 108 మంది రికవరీ అయ్యారు. 100 మందికి పాజిటివ్‌ వచ్చినప్పటికీ లక్షణాలు లేకపోవడంతో హోం క్వారంటైన్లో ఉన్నారు. చింతల్‌ పరిసర ప్రాంతాలకు చెందిన వారితోపాటు గాజులరామారంలో పాజిటివ్‌ కేసులు అధికంగా నమోదవుతున్నాయి.

మూసాపేట సర్కిల్‌ లోని కేపీహెచ్ ‌బీ, అల్లాపూర్‌, మూసాపేట డివిజన్ల పరిధుల్లో కేసుల తీవ్రత ఎక్కువగా ఉంది. బాలాజీనగర్‌, ఫతేనగర్‌ ప్రాంతాల్లో ఇప్పుడే కేసుల నమోదు ప్రారంభమైంది. కూకట్ ‌పల్లి సర్కిల్‌ లోని ఆల్విన్‌ కాలనీ, పాతబోయిన్ ‌పల్లి, వివేకానందనగర్‌ కాలనీ, బాలానగర్‌ డివిజన్ల పరిధుల్లో కేసుల తీవ్రత ఎక్కువగా ఉంది. హైదర్ ‌నగర్‌, కూకట్‌ పల్లి డివిజన్లలో ఐదు కేసులు నమోదుకాగా మిగతా డివిజన్లలో పదుల సంఖ్యలో ఉన్నాయి.