Begin typing your search above and press return to search.

తెలంగాణ‌లో భారీస్థాయిలో: ఏకంగా 1,892 పాజిటివ్‌

By:  Tupaki Desk   |   4 July 2020 3:30 AM GMT
తెలంగాణ‌లో భారీస్థాయిలో: ఏకంగా 1,892 పాజిటివ్‌
X
వ్యాధి నిర్ధార‌ణ టెస్టులు క్ర‌మంగా పెంచుతుండ‌గా పాజిటివ్ కేసులు కూడా అదేస్థాయిలో పెరుగుతున్నాయి. ఏకంగా ఒక్క‌రోజే రెండు వేల‌కు చేరువ‌లో కేసులు వెలుగులోకి వ‌స్తున్నాయి. తాజాగా శుక్ర‌వారం ఒక్క‌రోజే 1,892 పాజిటివ్ కేసులు న‌మోద‌య్యాయి. 5,965 న‌మూనాలు ప‌రీక్షించ‌గా పైస్థాయిలో పాజిటివ్ తేలాయి. ఈ మేర‌కు తెలంగాణ వైద్యారోగ్య శాఖ హెల్త్ బులెటిన్ ప్ర‌క‌టించింది. 24 గంట‌ల్లో వైర‌స్ బాధ‌ప‌డుతూ 8మంది మృత్యువాత ప‌డ్డారు.

ఈ విధంగా కేసులు న‌మోద‌వుతుండ‌డంతో తెలంగాణ‌ లో భ‌యాందోళ‌న‌క‌ర ప‌రిస్థితులు ఏర్ప‌డ్డాయి. తాజాగా న‌మోదైన కేసుల‌తో క‌లిపి మొత్తం కేసుల సంఖ్య 20,462కి చేరింది. ప్ర‌స్తుతం యాక్టివ్‌ గా ఉన్న కేసులు 9,984. కొత్త‌గా 1,126 మంది వైర‌స్ నుంచి కోలుకుని డిశ్చార్జ‌య్యారు. ఇప్ప‌టి వ‌ర‌కు డిశ్చార్జయిన వారి సంఖ్య 10,195. ఇప్ప‌టివ‌ర‌కు మృతుల సంఖ్య 283కి చేరాయి.

తెలంగాణ‌ లో శుక్ర‌వారం తో టెస్టుల సంఖ్య ల‌క్ష దాటింది. ఇప్ప‌టివ‌ర‌కు 1,04,118 న‌మూనాలు ప‌రీక్షించారు. వాటిలో 20,462 పాజిటివ్ తేలాయి. కొత్త‌గా న‌మోదైన కేసుల్లో ఒక్క హైద‌రాబాద్‌ లోనే 1,658 తేలాయి. భాగ్య‌న‌గ‌రాన పాజిటివ్ కేసులు క్ర‌మంగా భారీస్థాయిలో పెరుగుతున్నాయి. ఈ మ‌హాన‌గ‌రంలో వైర‌స్‌ను క‌ట్ట‌డి చేయ‌డానికి ముఖ్య‌మంత్రి కె.చంద్ర‌శేఖ‌ర్ రావు స‌మాలోచ‌న‌లు చేశారు. చివ‌ర‌కు లాక్‌డౌన్‌ పై వెన‌క్కి త‌గ్గార‌ని తెలుస్తోంది. అందుకే టెస్టుల సంఖ్య పెంచారు. టెస్టులు పెంచి లాక్‌డౌన్ ప్ర‌తి పాద‌న‌ను విర‌మించుకున్నట్టు స‌మాచారం.