Begin typing your search above and press return to search.

ఓపెనింగ్ అన్నారు.. తీరా వస్తామంటే వద్దన్నారట

By:  Tupaki Desk   |   7 July 2020 9:30 AM GMT
ఓపెనింగ్ అన్నారు.. తీరా వస్తామంటే వద్దన్నారట
X
గమ్మత్తైన వ్యవహారం ఒకటి బయటకు వచ్చింది. అధికారిక వర్గాలకు పరిమితమైన ఈ అంశం ఎట్టకేలకు బయటకు పొక్కటమే కాదు.. కేసీఆర్ సర్కారును చిరాకు పుట్టించేలా చేసిన వైనం ఇప్పుడు సంచలనంగా మారింది. తెలంగాణలో అందునా.. హైదరాబాద్ లో మహమ్మారి ఎంతలా వ్యాప్తి చెందిందో తెలిసిందే. కేసుల సంఖ్య అంతకంతకూ పెరుగుతూ.. ఇంట్లోనుంచి బయటకు అడుగు పెట్టాలంటే దడ పుట్టిస్తున్న పరిస్థితి.

ఇదంతా ఒక ఎత్తు అయితే.. మహమ్మారి బారిన పడినోళ్ల ఆందోళన అంతా ఇంతా అన్నట్లుగా లేదు. ఎందుకంటే.. ప్రభుత్వ ఆసుపత్రుల్లో రోగ తీవ్రత ఎక్కువగా ఉంటే తప్పించి చేర్చుకోవటం లేదు. ప్రైవేటు ఆసుపత్రుల్లో బెడ్లు దొరకటం లేదు. ఒకవేళ.. దొరికినా బిల్లు లక్షల్లో ఉంటోంది. ఇలాంటివేళ.. గచ్చిబౌలిలో టిమ్స్ ఆసుపత్రిని ఏర్పాటు చేశారు. పదిహేను వందల బెడ్లతో సిద్ధం చేసిన ఈ ఆసుపత్రిని కేసుల తీవ్రత బాగా పెరిగిన తర్వాత మాత్రమే ఓపెన్ చేయాలన్న ఆలోచనలో ప్రభుత్వం ఉందని చెబుతున్నారు.

ఈ విధానంపై ఇప్పటికే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అయితే.. బయట ప్రచారం జరుగుతున్నట్లుగా.. గచ్చిబౌలి కొవిడ్ ఆసుపత్రిని ఎందుకు ఓపెన్ చేయటం లేదన్న మాటకు ప్రభుత్వం సూటిగా సమాధానం చెప్పింది లేదు. ఇటీవల కాలంలో నగరంలో పెరిగిన కేసుల నేపథ్యంలో.. టిమ్స్ ను వెంటనే సిద్ధం చేయాలన్న డిమాండ్లు పెరుగుతున్నాయి. ఈ ఒత్తిడిని తగ్గించుకునేందుకు వీలుగా.. సోమవారం నుంచి ఈ ఆసుపత్రిని స్టార్ట్ చేయాలని భావించారట.

దీనికి సంబంధించిన పలువురు పాజిటివ్ గా నమోదై.. ఐసోలేషన్ లో ఉన్న పేషెంట్లకు ఆసుపత్రి వర్గాలుప్రత్యేకంగా ఫోన్లు చేసి.. సోమవారం రావాలని కోరారు. అందుకువారంతా ఓకే చెప్పినట్లు తెలుస్తోంది. ఇదిలా ఉంటే.. ఈ ఆసుపత్రిని ప్రారంభించే కార్యక్రమం ఏమీ లేకుండా వైద్యసేవలు అందించేందుకు మంత్రి ఈటెల సుముఖంగా లేనట్లుగా తెలుస్తోంది. సోమవారం ఉదయం టిమ్స్ ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని వాయిదా వేసినట్లుగా తెలుస్తోంది. అయితే.. అప్పటికే పలువురు పేషెంట్లకు ఫోన్లు చేయటంతో.. వారంతా ఆసుపత్రికి బయలుదేరినట్లుగా ఫోన్లు చేసినట్లు సమాచారం. దీంతో.. తలలు పట్టుకున్న వైద్యులు.. అందరి పేషెంట్లను ఆసుపత్రికి రావొద్దంటూ ప్రత్యేకంగా ఫోన్లు చేసి మరీ బతిమిలాడుకోవాల్సి వచ్చిందని చెబుతున్నారు. అయినా.. ప్రారంభించాలని డిసైడ్ అయ్యాక.. ఈ వాయిదా వేయటం ఏమిటి ఈటెల సాబ్?