Begin typing your search above and press return to search.

ఇదేంది కేసీఆర్.. అంతా పెట్టుకుంటే మాస్కు పెట్టుకోరేం?

By:  Tupaki Desk   |   19 July 2020 12:30 AM GMT
ఇదేంది కేసీఆర్.. అంతా పెట్టుకుంటే మాస్కు పెట్టుకోరేం?
X
సినిమాలు.. సెలబ్రిటీలు. పాలకులు.. ఇలా చెప్పుకుంటూ పోతే.. ఉన్నత స్థానంలో ఉన్న వారు సమాజం మీద చూపించే ప్రభావం అంతా ఇంతా కాదు. ప్రజల్లో బాధ్యత లేదని తరచూ విమర్శలు చేస్తాం కానీ.. వారికి అలాంటిది అలవాటు కావాలంటే ప్రముఖులు.. ఉన్నతస్థానాల్లో ఉన్న వారు మరింత బాధ్యతగా వ్యవహరించాల్సి ఉంటుంది. బ్యాడ్ లక్ ఏమంటే.. మన దగ్గర అలాంటివేమీ కనిపించని పరిస్థితి.

కరోనా తీవ్రత ఎంత ఎక్కువగా ఉందో ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరమే లేదు. రోజువారీగా విడుదలయ్యే ప్రభుత్వ బులిటెన్ లో పాజిటివ్ రోగుల సంఖ్యను చూస్తే.. ఈ విషయం ఇట్టే అర్థమవుతుంది. కరోనా బాధితులకు ఎదురవుతున్న తిప్పలు గురించి పేపర్లు.. చానళ్లు చూస్తే చాలు.. కళ్లకు కట్టేలా ఎన్నో కనిపిస్తున్నాయి. ఇవన్నీ చూసినప్పుడు.. కేసులు పెద్ద ఎత్తున నమోదు కావటం వెనుక ఉన్న కారణాలు చూస్తే.. భౌతిక దూరాన్ని పాటించకపోవటం.. నిర్లక్ష్యంగా వ్యవహరించటం.. ముఖానికి మాస్కులు పెట్టుకోకపోవటం లాంటివి కనిపిస్తాయి.

ఎవరి దాకానో ఎందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ సంగతే చూడండి. ఆయన ఇప్పటివరకూ ముఖానికి మాస్కు పెట్టుకోవటం కనిపించదు. ఆ మధ్యన మోడీ.. ముఖానికి మాస్కు బదులు.. మెడలోని కండువాతో కవర్ చేయటంతో.. దాన్నో అలవాటుగా మార్చుకున్న కేసీఆర్. శుక్రవారం ప్రగతిభవన్ లో జరిగిన రివ్యూ సమావేశాన్ని చూస్తే.. అందులో హాజరైన వారంతా ముఖానికి మాస్కు పెట్టుకోవటం కనిపిస్తుంది.

తెలంగాణ సీఎం కేసీఆర్ మాత్రం ముఖానికి ఎలాంటి మాస్కు పెట్టుకోకపోవటమే కాదు.. కండువాను కూడా అడ్డుగా పెట్టుకోవటం కనిపించదు. నిద్ర లేచింది మొదలు రాత్రి పడుకునే వరకు తమ స్ఫూర్తిదాతలుగా పాలకుల్ని ఫాలో అయ్యేటోళ్లు ఎంతోమంది. ఇలాంటివారంతా.. ముఖ్యమంత్రి ముఖానికి మాస్కు లేకపోవటాన్ని హీరోయిజంగా తీసుకొని వ్యవహరిస్తే నష్టపోయేది సదరు వ్యక్తితో పాటు.. ఆయన చుట్టూ ఉన్న వారు కూడా అన్నది మర్చిపోకూడదు. చూసేందుకు చిన్న అంశాలుగా కనిపిస్తాయి కానీ.. సమాజం మీద పెను ప్రభావాన్ని చూపిస్తాయి. ఇలాంటి పరిస్థితుల్ని పరిగణలోకి తీసుకొని.. మిగిలిన వారి బాటలో నడుస్తూ ముఖానికి మాస్కు పెట్టుకోవటం అవసరమన్నది కేసీఆర్ ఎంత త్వరగా గుర్తిస్తే అంత మంచిది.