Begin typing your search above and press return to search.

మ‌హ‌మ్మారిని జ‌యించాడు.. తెల్లారితే డిశ్చార్జి.. అంతలోనే..

By:  Tupaki Desk   |   20 July 2020 2:00 PM GMT
మ‌హ‌మ్మారిని జ‌యించాడు.. తెల్లారితే డిశ్చార్జి.. అంతలోనే..
X
మహమ్మారి వైర‌స్ చాలా కుటుంబాల్లో విషాదం నింపుతోంది. ఆ వైర‌స్ తెలంగాణ‌లో తీవ్ర స్థాయిలో విజృంభిస్తోంది. భారీ సంఖ్యలో కేసులు నమోదవుతున్నాయి. దీంతో ప్ర‌జ‌లు భ‌యాందోళ‌న చెందుతూ బిక్కుబిక్కుమంటూ బ‌తుకీడుస్తున్నారు. ఎన్ని జాగ్ర‌త్త‌లు తీసుకుంటున్నా వైర‌స్ బారిన ప‌డుతుండ‌డం ఆందోళ‌న క‌లిగించే విష‌యం. తాజాగా ఓ ఘ‌ట‌న అంద‌రినీ క‌దిలిస్తోంది. వైర‌స్ బారిన ప‌డిన వ్య‌క్తి ఆస్ప‌త్రిలో చికిత్స పొందాడు. పూర్తిగా కోలుకుని ఆరోగ్యంగా త‌యార‌య్యాడు. తెల్లారితే డిశ్చార్జ్ కావాల్సి ఉంది. అయితే అంత‌లోనే గుండెపోటు రూపంలో అత‌డిని మృత్యువు ఆహ్వానించింది. ఈ ఘ‌ట‌న అంద‌రినీ పిండేస్తోంది. ఈ ఘటన హైదరాబాద్‌లో చోటుచేసుకుంది.

యాచారం మండలానికి చెందిన ఓ వ్యక్తి (55)కి వైర‌స్ సోకింది. హైదరాబాద్‌లోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చేరి చికిత్స తీసుకున్నాడు. చికిత్స స్పందించి కోలుకుంటున్నాడు. ఈ క్ర‌మంలో త‌న‌కు అందుతున్న వైద్యం విష‌య‌మై కుటుంబ‌స‌భ్యుల‌తో పంచుకుంటూ వ‌స్తున్నాడు. అత‌డు వైర‌స్ నుంచి పూర్తిగా కోలుకుని ఆదివారం ఉద‌యం డిశ్చార్జ్ అవుతున్న‌ట్లు అత‌డు త‌న ‌కుమారుడితో శ‌నివారం చెప్పాడు. తెల్లారితే డిశ్చార్జ్ కావాల్సిన వ్య‌క్తి మృత‌దేహంగా మారాడు. హాయిగా ఇంటికి వెళ్లాల్సిన వ్య‌క్తి శవంగా మార‌డంతో ఆ కుటుంబ‌స‌భ్యులంతా క‌న్నీరుమున్నీర‌వుతున్నారు. మ‌హ‌మ్మారిని జయించాడు కానీ గుండెపోటుకు బ‌ల‌య్యాడు. రాత్రి వీడియో కాల్‌లో హుషారుగా మాట్లాడిన త‌న తండ్రి తెల్లారేసరికి ఇక లేడు అని తెలియ‌డంతో ఆ కుటుంబం షాక్‌లోకి వెళ్లింది. అత‌డి కుమారులు కన్నీరుమున్నీరయ్యారు.