Begin typing your search above and press return to search.

ఒక్క‌రోజే 50కి పైగా మృతులు.. బ‌హిర్గ‌తం చేసిన ఓ ప‌త్రిక‌

By:  Tupaki Desk   |   27 July 2020 3:00 AM GMT
ఒక్క‌రోజే 50కి పైగా మృతులు.. బ‌హిర్గ‌తం చేసిన ఓ ప‌త్రిక‌
X
మ‌హ‌మ్మారి వైర‌స్ విష‌యంలో తెలంగాణ దాప‌రికం చేస్తోంద‌ని హైకోర్టుతో పాటు ప్ర‌తిప‌క్షాలు ఆరోపిస్తున్నాయి. వైర‌స్ కేసులు.. మ‌ర‌ణాల సంఖ్య వాస్త‌వానికి క‌న్నా త‌క్కువ చూపిస్తోంద‌ని తీవ్ర‌ ఆరోప‌ణ‌లు వ‌స్తున్నాయి. తాజాగా ఓ ప్ర‌ముఖ ఆంగ్ల ప‌త్రిక‌లో ప్ర‌చురిత‌మైన క‌థ‌నం తెలంగాణ‌లో ఒక్క‌సారిగా క‌ల‌క‌లం రేపింది. ఒక్క హైద‌రాబాద్‌లోనే పెద్ద సంఖ్య‌లో వైర‌స్ మ‌ర‌ణాలు సంభ‌వించాయ‌ని.. దానికి ఉదాహ‌ర‌ణ ఈఎస్ఐ శ్మ‌శాన వాటిక‌కు అంబులెన్సులు వ‌రుస క‌ట్ట‌డ‌మే ఉదాహ‌ర‌ణ అని చెప్పింది. ఆదివారం హైద‌రాబాద్‌లోని శ్మ‌శాన వాటిక‌ల్లో జ‌రిగిన అంత్య‌క్రియ‌ల‌పై ఆ సంస్థ లెక్క‌లు ఆరా తీసింది. ఏయే శ్మ‌శాన వాటిక‌ల్లో ఎన్నెన్ని వైర‌స్ బాధితుల అంత్య‌క్రియ‌లు జ‌రిగాయ‌ని ప‌రిశీలించింది. దీంతో నిగ్గుపోయే వాస్తవాలు వెలుగులోకి వ‌చ్చాయి. ఒక్క‌రోజే ఏకంగా 50కి పైగా వైర‌స్ మృతులు ఉన్నాయ‌ని తేలింది. అది కూడా ఒక్క హైద‌రాబాద్‌లోనే అని.. అదే రాష్ట్ర‌వ్యాప్తంగా లెక్క‌లు తీస్తే వంద‌కు పైగా ఉంటాయ‌ని ఓ వార్త క‌థ‌నం ప్ర‌చురించింది. ప్ర‌స్తుతం ఆ క‌థ‌నం తెలంగాణ ప్ర‌భుత్వంలోనూ.. ప్ర‌జ‌ల్లోనూ ఆందోళ‌న రేపింది.

హైద‌రాబాద్‌లోని ఈఎస్ఐ శ్మ‌శాన వాటిక‌కు ఈ గురువారం 38 అంబులెన్సులు వ‌చ్చాయి. ఉద‌యం నుంచి సాయంత్రం దాక ప‌రిస్థితి గ‌మ‌నించి శ్మ‌శాన వాటిక‌కు ఎన్ని వైర‌స్ బారిన ప‌డి మృతిచెందిన శ‌వాలు వ‌స్తున్నాయ‌ని లెక్క‌లు వేసింది. ఈ క్ర‌మంలోనే ఈఎస్ఐ శ్మ‌శాన‌వాటిక‌కు ఒక్క‌రోజులోనే 38 అంబులెన్సులు వ‌చ్చాయి. అంటే 30 మృత‌దేహాలుగా భావించ‌వ‌చ్చు. ఇక దీనితో పాటు హైద‌రాబాద్‌లోని మిగ‌తా శ్మ‌శాన‌వాటిక‌ల లెక్క‌లు తీస్తే మ‌రో 12 మృత‌దేహాలు వెలుగులోకి వ‌చ్చాయి. వీటిని ఆధారాల‌తో స‌హా ఆ క‌థ‌నం ప్ర‌చురించ‌డంతో ఆ మ‌ర‌ణాలు వాస్త‌వ‌మేన‌ని తెలుస్తోంది.

మ‌రి రాష్ట్రంలో వైర‌స్ బారిన ప‌డి ఇంత‌మంది మృతి చెందుతుండ‌గా ప్ర‌భుత్వం మాత్రం ప‌ది లోపే మ‌ర‌ణాలు హెల్త్ బులెటిన్‌లో చూప‌డం అనుమానాలు వ్య‌క్త‌మ‌వుతున్నాయి. ప్ర‌భుత్వం మొద‌టి నుంచి వైర‌స్ లెక్క‌ల విష‌యంలో దాప‌రికం చేస్తోంద‌ని.. చెడ్డ‌పేరు రాకూడ‌ద‌నే ఉద్దేశంతో ఈ విధంగా చేస్తోంద‌నే ఆరోప‌ణ‌లు... విమ‌ర్శ‌లు ఉన్నాయి. ఇలా లెక్క‌లు దాపెడితే మ‌రింత ప్ర‌మాదం ఉంద‌ని విశ్లేష‌కులు చెబుతున్నారు. ఉన్న‌ది ఉన్న‌ట్టు చెబితే ప్ర‌జ‌లు అప్ర‌మ‌త్తం అవుతారు.. ప్ర‌భుత్వం కూడా జాగ్ర‌త్త‌లు తీసుకునే అవ‌కాశం ఉంటుంది క‌దా అని పేర్కొంటున్నారు. ఇప్ప‌టికే సామూహిక వ్యాప్తి మొద‌లైంద‌ని ప్ర‌క‌టించాక ఆ మాత్రం మ‌ర‌ణాలు ఉంటాయ‌ని.. ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో ప్ర‌భుత్వ‌మే అధికారికంగా మ‌ర‌ణాలు ఎన్ని ఉంటున్నాయో వాట‌న్నిటిని ప్ర‌క‌టిస్తోంది. ఈ విష‌యంలో తెలంగాణ ప్రభుత్వం ఎందుకు లెక్క‌లు దాస్తోంద‌ని హైకోర్టుతో పాటు ప్ర‌తిప‌క్షాలు... ప్ర‌జ‌లు కూడా ప్ర‌శ్నిస్తున్న ప‌రిస్థితి. మ‌రి దీనిపై ఇప్పటికైనా ప్ర‌భుత్వం స్ప‌ష్ట‌త ఇస్తుందో లేదో చూడాలి.