Begin typing your search above and press return to search.

అంకెలు చెప్పే నిజం.. తెలంగాణలో కరోనా బాధితులు ఎవరంటే?

By:  Tupaki Desk   |   29 July 2020 4:45 AM GMT
అంకెలు చెప్పే నిజం.. తెలంగాణలో కరోనా బాధితులు ఎవరంటే?
X
నిత్యం తెలంగాణ ప్రభుత్వం కరోనా బులిటెన్లను విడుదల చేస్తోంది. రాష్ట్ర హైకోర్టు పుణ్యమా అని రెండు పేజీల్లో మమ అనిపించే వివరాల్ని..ఇప్పుడు పద్దెనిమిది పేజీలకు పెంచింది. దీంతో.. అన్ని వివరాలు కాకున్నా.. కొన్ని వివరాలు.. గణాంకాలు వెల్లడయ్యాయి. ఇంతకీ అంకెలతో కలిగే ప్రయోజనం ఏమంటే.. వాస్తవ పరిస్థితిని విశ్లేషించటంతో పాటు.. గణాంకాలు చాలానే వాస్తవాల్ని వెల్లడించే వీలుంది. ఈ కారణంతోనే.. ఏదైనా అంశం మీద మరింత అవగాహన పెంచుకోవటానికి గణాంకాలు కీలకంగా మారుతుంటాయి.

తాజాగా తెలంగాణ రాష్ట్ర సర్కారు విడుదల చేసిన బులిటెన్లలో పేర్కొన్న అంశాల్ని జాగ్రత్తగా పరిశీలిస్తే కొన్ని కీలక విషయాలు బయటకు వచ్చాయి. కరోనా పెద్ద వయస్కులకు.. అనారోగ్యంగా ఉన్న వారి మీద తీవ్ర ప్రభావం చూపుతుందన్న వాదనలు ఉన్నాయి. ఇందులో నిజం ఉన్నప్పటికి.. అందుకు భిన్నమైన పరిస్థితులు చోటు చేసుకుంటున్నాయి. రోగ నిరోధక శక్తి ఎక్కువగా ఉంటాయని చెప్పే యువత కూడా కరోనా ప్రభావానికి గురవుతున్నట్లుగా గణాంకాలు వెల్లడిస్తున్నాయి.

తాజాగా తెలంగాణ ప్రభుత్వం విడుదల చేసిన బులిటెన్ ను చూస్తే.. సోమవారం వరకు 57వేలకు పైనే కరోనా పాజిటివ్ లు నమోదయ్యాయి. వాటిల్లో 21-40 ఏళ్ల వయస్కుల వారు ఎక్కువగా కరోనా బారిన పడుతున్నట్లుగా అంకెలు లెక్కలు స్పష్టం చేస్తున్నాయి. కరోనా పాజిటివ్ కు గురయ్యే వారిలో 21-30 ఏళ్ల లోపు వయస్కుల్లో 22 శాత మంది.. 31-40 ఏళ్ల వారిలో అత్యధికంగా పాతిక శాతం మందికి వైరస్ సోకినట్లుగా తేలింది. ఇక.. 41-50 ఏళ్ల వయసు వారిలో 18.6 శాతం మంది కరోనాతో ఇబ్బంది పడుతున్నారు. అంటే.. తెలంగాణలో నమోదవుతున్న కేసుల్లో 20 నుంచి యాభై ఏళ్ల వరకు ఉన్న వారే 66 శాతం వరకు ఉన్నట్లు తేలింది.

అంటే.. కరోనా పాజిటివ్ ఎక్కువగా మధ్య వయస్కులే వైరస్ బారిన పడటం గమనార్హం. ఇదంతా చూస్తున్న తెలంగాణలో కరోనా వ్యాప్తికి కారణం మధ్య వయస్కులే అన్నది తేలుంది. ఎందుకన్నకారణం చూస్తే.. రోజువారీగా బయటకు ఎక్కువగా వెళ్లేది వారే కావటంతో.. వారి ద్వారానే వ్యాప్తి జరుగుతోందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. దీనికి తోడు ఉపాధి నిమిత్తం బయటకు వెళ్లే వారిలోనూ ఈ వయసుల వారే ఎక్కువగా ఉంటారన్నది మర్చిపోకూడదు. మొత్తం కేసుల్లో 65 శాతం పురుషులే కావటం గమనార్హం. ఈ నేపథ్యంలో వీలైనంత వరకు జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంది.