Begin typing your search above and press return to search.

తగ్గినట్లే తగ్గి..తెలంగాణలో కరోనా స్పీడ్ మళ్లీ పెరుగుతోందిగా?

By:  Tupaki Desk   |   8 Aug 2020 4:30 AM GMT
తగ్గినట్లే తగ్గి..తెలంగాణలో కరోనా స్పీడ్ మళ్లీ పెరుగుతోందిగా?
X
తెలంగాణకు ఇరుగు పొరుగున ఉన్న రాష్ట్రాలైన ఆంధ్రప్రదేశ్.. మహారాష్ట్ర.. కర్ణాటక రాష్ట్రాలతో పోలిస్తే కరోనా కేసులు తక్కువే. గడిచిన పది రోజులతో పోలిస్తే.. తాజాగా తెలంగాణలో కేసుల సంఖ్య పెరుగుతున్నట్లుగానే చెప్పాలి. ఆ మాటకు వస్తే.. సరిహద్దు రాష్ట్రాలతో పోలిస్తే చాలా తక్కువనే చెప్పాలి. శుక్రవారం నాటి లెక్కనే చూస్తే.. మహారాష్ట్రలో 24 గంటల వ్యవధిలో 11,514 కేసులు నమోదైతే.. ఆంధ్రప్రదేశ్ లో 10,171 కేసులు నమోదయ్యాయి. ఇక.. కర్ణాటకలోనూ 6,670 కేసులు నమోదయ్యాయి.

ఈ లెక్కన చూస్తే.. తెలంగాణ సరిహద్దు రాష్ట్రాల కంటే కేసుల నమోదు రాష్ట్రంలో తక్కువనే చెప్పాలి. గతంలో పోలిస్తే.. రాష్ట్రంలో పరీక్షలు పెంచారనే చెప్పాలి. ఏపీలో శుక్రవారం 44వేల పరీక్షలు జరిపితే 10వేలకు పైనే పాజిటివ్ కేసులు నమోదైతే.. తెలంగాణలో మాత్రం 14వేల పరీక్షలకు 2200 కేసులు మాత్రమే నమోదయ్యాయి. ఈ లెక్క చూసినా.. 2 శాతం కంటే తక్కువగా తెలంగాణలో నమోదు ఉంది.

వాస్తవానికి గడిచిన వారంలో తెలంగాణలో కేసుల నమోదు తక్కువగా ఉంది.అనూహ్యంగా గడిచిన రెండు రోజులుగా పెరుగుతున్నాయి. దీనికి కారణం వేర్వేరు రాష్ట్రాల నుంచి వచ్చి వెళ్లే రాకపోకలు పెరగటంతో పాటు.. పెళ్లిళ్లు.. శుభకార్యాలు కూడా కారణంగా చెబుతున్నారు. కరోనా కట్టడి విషయంలో తెలంగాణ ప్రభుత్వం మరిన్ని జాగ్రత్తలు తీసుకుంటే.. కేసుల సంఖ్య తగ్గే అవకాశం ఉందంటున్నారు.

మరో సానుకూల అంశం ఏమంటే.. ఒకదశలో జీహెచ్ఎంసీ పరిధిలో రోజుకు 1800 కేసులు నమోదయ్యే పరిస్థితి నుంచి ఇటీవల కాలంలో ఐదారు వందలకు తగ్గిపోయింది. తాజాగా 464 కేసులే నమోదయ్యాయి. కాస్త ఆందోళన కలిగించే మరో అంశం.. హైదరాబాద్ శివారుగా ఉండే రంగారెడ్డి.. మేడ్చల్ జిల్లాల్లో కేసుల సంఖ్య పెరుగుతోంది. తాజాగా రంగారెడ్డి జిల్లాలో 181.. మేడ్చల్ లో 138 కేసులు నమోదు కాగా.. వరంగల్ అర్బన్ జిల్లాలో 187 కేసులు నమోదయ్యాయి. హైదరాబాద్ మహానగరంలో కేసులు తగ్గుతూ.. జిల్లాల్లో పెరుగుతున్న అంశంపై ప్రభుత్వం మరింత ఫోకస్ చేయాల్సిన అవసరం ఉందని చెప్పక తప్పదు.