Begin typing your search above and press return to search.

పెరుగుతున్న కేసులు.. లక్షకు అడుగు దూరంలో తెలంగాణ!

By:  Tupaki Desk   |   21 Aug 2020 5:45 AM GMT
పెరుగుతున్న కేసులు.. లక్షకు అడుగు దూరంలో తెలంగాణ!
X
దేశంలోని పలు రాష్ట్రాల్లో కరోనా పాజిటివ్ కేసులు అంతకంతకూ పెరుగుతున్న విషయం తెలిసిందే. ఎక్కడి దాకా ఎందుకు? పక్కనున్న ఆంధ్రప్రదేశ్ సంగతే చూస్తే.. ఆ రాష్ట్రంలో రోజుకు తొమ్మిదివేల నుంచి పదివేల మధ్యలో కేసులు నమోదవుతున్నాయి. ఆ లెక్కన చూస్తే..తెలంగాణలో కేసుల తీవ్రత తక్కువగానే ఉంది. అయితే.. గడిచిన వారంలో చూస్తే.. ఇటీవల కాలంలో కేసుల సంఖ్య రోజు రోజుకు పెరగటం కనిపిస్తుంది.

గురువారం విడుదల చేసిన బులిటెన్ లో తెలంగాణ వ్యాప్తంగా 1724 కేసులు నమోదు కాగా.. శుక్రవారం నాటికి కేసుల తీవ్రత మరింత పెరిగింది. ఈ రోజు విడుదల చేసిన బులిటెన్ లో కేసుల సంఖ్య మరింత పెరిగిన వైనం కనిపించింది. కాసేపటి క్రితం (శుక్రవారం ఉదయం ఎనిమిది గంటల సమయానికి) విడుదల చేసిన బులిటెన్ లో కొత్తగా నమోదైన కేసులు 1967గా పేర్కొన్నారు. దీంతో.. తెలంగాణ రాష్ట్రంలో నమోదైన కేసుల సంఖ్య 99,391కు చేరింది. గురువారం ఒక్కరోజులో కరోనా కారణంగా మరణించిన వారు ఎనిమిది మందిగా పేర్కొన్నారు. దీంతో.. మొత్తం మరణాలు 737గా నమోదైంది.

ఇదిలా ఉంటే.. కరోనా నుంచి కోలుకున్న వారు 1781గా తేల్చారు. దీంతో.. ఇప్పటివరకురాష్ట్రవ్యాప్తంగా కోలుకున్న వారి సంఖ్య 76,967గా నమోదైంది. దీంతో.. రాష్ట్రంలోయాక్టివ్ కేసులు 21,687గా లెక్క తేలింది. ఇప్పటివరకు కరోనా నిర్దారణ పరీక్షలు 8.48లక్షలు చేశారు. ఇదిలా ఉంటే.. పొరుగున ఉన్న ఏపీలో పాజిటివ్ కేసులు 3.3 లక్షలు దాటాయి. తెలంగాణతో పోలిస్తే.. మూడు రెట్లు కేసులు ఎక్కువగా ఉండటం గమనార్హం. ఇక.. గడిచిన నాలుగైదు రోజులుగా కొత్త కేసుల సంఖ్య పెరగటానికి కారణాల్లో వాతావరణం కూడా కారణమంటున్నారు. దీనికి తోడు.. ఇటీవల కాలంలో కేసుల సంఖ్య తగ్గు ముఖం పడుతుండటంతో పెద్ద ఎత్తున రోడ్ల మీదకు వస్తున్నారు. ఇది కూడా కొత్త కేసులకు కారణంగా చెప్పక తప్పదు.