Begin typing your search above and press return to search.

ప్రైవేట్ ‘కోవిడ్’ దందాపై కేసీఆర్ టాస్క్ ఫోర్స్... ఇంత లేటుగానా?

By:  Tupaki Desk   |   9 Sep 2020 5:30 PM GMT
ప్రైవేట్ ‘కోవిడ్’ దందాపై కేసీఆర్ టాస్క్ ఫోర్స్... ఇంత లేటుగానా?
X
కరోనా మహమ్మారికి చికిత్సల పేరిట ప్రైవేట్ ఆసుపత్రులు సాగిస్తున్న దందాపై తెలంగాణ సీఎం కల్వకుంట్ల చంద్రశేఖరరావు నిజంగానే చాలా లేటుగా స్పందించారని చెప్పాలి. ఈ దందాను అరికట్టేందుకు బుధవారం నాటి అసెంబ్లీ సమావేశాల్లో ఏకంగా టాస్క్ ఫోర్స్ ను నియమిస్తున్నట్లుగా కేసీఆర్ ప్రకటించినా.. దానికి పెద్దగా ప్రాధాన్యతే దక్కలేదు. చాలా కాలం క్రితమే హైకోర్టు ఈ విషయంపై దృష్టి సారించడంతో పాటుగా ప్రైవేట్ ఆసుపత్రుల దందాపై కఠిన చర్యలు తీసుకోవాలంటూ ఆదేశాలు జారీ చేసింది. అయినా కూడా స్పందించని కేసీఆర్... చాలా ఆలస్యంగా బుధవారం స్పందించి ఈ విషయంలో తాను ఎంత లేటో చెప్పకనే చెప్పేశారు.

కరోనా విజృంభిస్తున్న తరుణంలో ఎప్పుడో ఏప్రిల్ నెలలో హడావిడి చేసిన కేసీఆర్... కరోనా పరీక్షలు, వైరస్ వ్యాప్తి నివారణకు తీసుకోవాల్సిన చర్యలపై కేసీఆర్ ఎప్పటికప్పుడు మీడియా ముందుకు వచ్చేవారు. అయితే కరోనా వ్యాప్తి మరింత విజృంభించిన వేళ మాత్రం ఆయన మీడియాకు ముఖం చాటేయడంతో పాటుగా అసలు కరోనాపై దృష్టి సారించినట్లుగానూ కనిపించలేదు. దీంతో ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందరే సర్వం తానై వ్యవహరించాల్సి వచ్చింది. ఇలాంటి నేపథ్యంలో కేసీఆర్ ఏం చేస్తున్నారంటూ విపక్షాలు విమర్శల జడివాన కురిపించినా కూడా కేసీఆర్ స్పందించిన పాపాన పోలేదు.

తాజాగా బుధవారం నాటి అసెంబ్లీ సమావేశాల్లో భాగంగా కరోనాపై మాట్లాడిన కేసీఆర్... ప్రైవేట్ ఆసుపత్రుల దందాపై సీరియస్ అయ్యారు. కరోనా చికిత్సల పేరిట ప్రైవేట్ ఆసుపత్రులు సాగించిన దందాపై ఆరోగ్య శాఖ మంత్రితో సమీక్షించానని, కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశాలు జారీ చేశానని కేసీఆర్ చెప్పుకొచ్చారు. అయినా కూడా ప్రైవేట్ ఆసుపత్రులు ఈ విషయంలో పెద్దగా మారినట్లు కనిపించడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ క్రమంలో ప్రైవేట్ ఆసుపత్రుల అక్రమ దందాపై దృష్టి సారించడంతో పాటుగా నిబంధనలు అతిక్రమించిన వాటిపై ఉక్కుపాదం మోపేందుకు టాస్క్ ఫోర్స్ ను ఏర్పాటు చేస్తున్నట్లుగా కేసీఆర్ చెప్పుకొచ్చారు. మొత్తంగా ఇన్నాళ్లకైనా కేసీఆర్ స్పందించి ప్రైవేట్ ఆసుపత్రుల దందాపై టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేయడం మంచిదేనన్న వాదనలు వినిపిస్తున్నాయి.