Begin typing your search above and press return to search.

వార్నింగులు ఇచ్చుడు కాదు కేసీఆర్.. వరుస చర్యలు తీసుకోరేం?

By:  Tupaki Desk   |   10 Sep 2020 6:00 AM GMT
వార్నింగులు ఇచ్చుడు కాదు కేసీఆర్.. వరుస చర్యలు తీసుకోరేం?
X
నేను చెప్పానా?.. నా మాట ఎవరు విన్నారు? నేను చెప్పిందే నిజమైంది కదా? ఇలా మన చుట్టూ ఉండే కొందరి నోట తరచూ ఈ తరహా మాటలు వస్తుంటాయి. తాజాగా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ నోటి నుంచి ఈ తరహా వ్యాఖ్యలు వచ్చాయి. అసెంబ్లీలో కరోనా ఎపిసోడ్ లో తమ ప్రభుత్వం చేసిన పనుల గురించి.. వాటి గొప్పతనం గురించి అదే పనిగా చెప్పుకున్న కేసీఆర్.. ప్రైవేటు ఆసుపత్రులపైనా కస్సుమన్నారు.

గతంలో తాను ప్రైవేటు ఆసుపత్రులకు కరోనా వైద్యానికి అనుమతిస్తే.. వారు పీడిస్తారని చెప్పారని.. అదే నిజమైందన్నారు. ‘‘శవాలతో డబ్బులు కోసం పీడించటం సమంజసం కాదు. ఇంత దుర్మార్గంగా సంపాదించి ఏం చేస్తారో తెలీదు. లోకమంతా ఇబ్బందుల్లో ఉంటే.. ఇప్పుడు డబ్బులు సంపాదిస్తారా? వారు ఎవరైనా కానీ.. ఏ ఆసుపత్రి అయినా కానీ కఠిన చర్యలు తీసుకుంటాం’’ అని మండిపడిన ఆయన.. గతంలో ప్రైవేటు ఆసుపత్రుల దోపిడీ గురించి తాను హెచ్చరించిన అంశాల్ని గుర్తు చేశారు.

కరోనా వైద్యానికి ప్రైవేటు ఆసుపత్రులకు అనుమతులు ఇస్తే.. వారు లూటీ చేస్తారని తాను గతంలో చెప్పిన మాటలు నిజమైన విషయాన్ని కేసీఆర్ గుర్తు చేశారు. ‘‘ప్రైవేటు ఆసుపత్రులు లూటీ చేస్తాయని నేను ముందే చెప్పా. అందుకు ప్రభుత్వ ఆసుపత్రుల్లోనే చికిత్స చేద్దామన్నా. కానీ.. ఐసీఎంఆర్ పదిహేను ఆసుపత్రులకు అనుమతి ఇచ్చింది. మేం అనుమతి ఇవ్వకుంటే ఎవరో హైకోర్టుకు వెళ్లారు. కోర్టు ఆదేశాల్ని అమలు చేశాం. నేను ఏది చెప్పానో అదే జరిగింది’’ అని చెప్పారు. సరే.. మీరు చెప్పిందే జరిగిందనుకుందాం.

సమస్య వస్తుందని తెలిసినప్పుడు.. దాన్ని ఎలా డీల్ చేయాలన్న తీరు ఒకటి ఉంటుంది కదా? పీక్కుతునే ప్రైవేటు ఆసుపత్రుల ఆరాచకానికి ఎందుకు కట్టడి చేయలేకపోయారు. చర్యలు తీసుకుంటామని ఈ రోజు అసెంబ్లీలో చెబుతున్న కేసీఆర్.. ఇంతకు ముందే ఆ పని చేస్తే.. ఎవరు మాత్రం ఏమనేవారు. అదే పనిగా వార్నింగ్ లు ఇచ్చే కన్నా.. చర్యల్ని చేతల్లో చూపిస్తే ప్రైవేటు ఆసుపత్రులు దారికి రాకుండా ఉంటాయా? అన్నది ప్రశ్న. మరి.. ఈ సందేహాలకు కేసీఆర్ ఎలా బదులిస్తారో?