Begin typing your search above and press return to search.

లాక్ డౌన్ నష్టం..కరోనా ఉందని చెప్పి తండ్రికి విషమిచ్చిన కొడుకు

By:  Tupaki Desk   |   11 Sep 2020 6:15 AM GMT
లాక్ డౌన్ నష్టం..కరోనా ఉందని చెప్పి తండ్రికి విషమిచ్చిన కొడుకు
X
కరోనా వేళ.. ఊహించని ఉదంతాలు చోటు చేసుకుంటున్నాయి. తాజాగా పంజాగుట్ట పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకున్న ఒక పరిణామం ఇప్పుడు కదిలించి వేస్తోంది. లాక్ డౌన్ కారణంగా చోటు చేసుకున్న ఆర్థిక కష్టాల్నిఅధిగమించలేక.. విషాన్ని కొనుక్కొచ్చి కరోనా మందని తండ్రికి ఇచ్చి.. తాను తాగి తనువు చాలించిన కొడుకు ఉదంతం. ఈ ఘటనలో కొడుకు అక్కడికక్కడే మరణించగా.. తండ్రి మాత్రం చావు బతుకుల మధ్య పోరాడుతున్నారు. గుండెల్ని పిండే ఈ ఉదంతంలోకి వెళితే..

ఎర్రమంజిల్ లోని హిల్ టాప్ కాలనీలోని ఒక అపార్టు మెంట్ లో తల్లిదండ్రులతో కలిసి నివసిస్తున్నాడు అనీశ్ రెడ్డి. తండ్రి రామిరెడ్డి రిటైర్ కాగా.. అనీశ్ రెడ్డి పలు ఐటీ కంపెనీల్లో క్యాంటీన్లు నిర్వహిస్తుండేవాడు. కరోనా నేపథ్యంలో లాక్ డౌన్ తదనంతర పరిణామాలతో ఆర్నెల్లుగా వ్యాపారం నిలిచిపోయింది. దీంతో ఆదాయం లేకుండా పోయింది.

ఈ నేపథ్యంలో మనో వ్యధకు గురైన అనీశ్ రెడ్డి విషాన్ని కొనుగోలు చేసి ఇంటికి తీసుకొచ్చారు. కరోనాకు మందు వచ్చిందని.. ఆ బాటిల్ లోని మందును తాగితే కరోనా రాదని చెప్పాడు. దీంతో తండ్రి రామిరెడ్డి దాన్ని తీసుకొని తాగాడు. అనీశ్ రెడ్డి కూడా దాన్ని తీసుకొని తాగేశాడు. వంటపని ఉందని.. ఆ పని పూర్తి అయ్యాక తాను తీసుకుంటానని చెప్పిన తల్లి వంటింట్లోకి వెళ్లిపోయింది. విషాన్ని తాగిన కాసేపటికే తండ్రికొడుకులు ఇద్దరు వాంతులు చేసుకోవటం షురూ చేశారు.

అనీశ్ రెడ్డి వాంతులు చేసుకుంటూనే చనిపోగా.. రామిరెడ్డి అపస్మారక స్థితిలోకి జారిపోయాడు. ఏం జరిగిందో అర్థం కాని తల్లి.. ఇరుగుపొరుగు వారి సాయంతో రామిరెడ్డిని ఆసుపత్రికి తరలించారు. అతడి పరిస్థితి ఆందోళనకరంగా ఉందని చెబుతున్నారు. లాక్ డౌన్ వేళ వచ్చి పడిన ఆర్థిక కష్టాల్ని అధిగమించలేక అనీశ్ రెడ్డి చేసిన పని సంచలనంగా మారింది. కేసును నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు జరుపుతున్నారు.