Begin typing your search above and press return to search.

తాజా అసెంబ్లీ సమావేశాలకు గవర్నర్ అనుమతి తీసుకోలేదెందుకు?

By:  Tupaki Desk   |   10 Oct 2020 4:15 AM GMT
తాజా అసెంబ్లీ సమావేశాలకు గవర్నర్ అనుమతి తీసుకోలేదెందుకు?
X
కీలకమైన రెండు అంశాలకు సంబంధించి అసెంబ్లీ ఆమోదముద్ర అవసరం కావటంతో.. ఉన్నట్లుండి సభను నిర్వహించేందుకు వీలుగా షెడ్యూల్ ను విడుదల చేసింది తెలంగాణ రాష్ట్ర సర్కారు. ముంచుకొచ్చిన గ్రేటర్ ఎన్నికల నేపథ్యంలో కేంద్రం తీసుకొచ్చిన కొత్త చట్టాన్ని ఈసారికి అమలు చేయలేని నేపథ్యంలో ప్రస్తుతం ఉన్న రిజర్వేషన్లను ఈసారికి అమలు చేయటం.. పాలకవర్గం.. కార్పొరేటర్ల బాధ్యతల నిర్ణయం లాంటి అంశాలతో పాటు.. రైతులు పండించిన పంటను ప్రభుత్వం కొనుగోలు చేసేందుకు అవసరమైన బిల్లులు సభ ఆమోదం పొందాల్సిన అవసరం ఉంది. దీంతో.. ఒక రోజు అసెంబ్లీ.. మరో రోజు శాసన మండలి నిర్వహించి.. రెండు కీలక బిల్లుల్ని సభ ఆమోదం పొందేలా తెలంగాణ రాష్ట్ర సర్కారు ప్లాన్ చేసింది.

సాధారణంగా అసెంబ్లీ సమావేశాల్ని నిర్వహించాల్సి వస్తే.. ముందుగా గవర్నర్ అనుమతి తీసుకోవటం.. సభను ప్రారంభించిన రోజున గవర్నర్ ప్రసంగం ఉండటం లాంటివి తప్పనిసరి. మరి.. తాజా సమావేశానికి అలాంటిదేమీ ఎందుకు లేనట్లు? అన్నది ప్రశ్న. దీనికి సమాధానం వెతికితే ఆసక్తికర అంశాలు వెలుగు చూస్తాయి. ఒకరోజు అసెంబ్లీ.. మండలి సమావేశాలకు గవర్నర్ అనుమతి తీసుకోకుండానే నిర్వహిస్తున్నారు.

ఎందుకిలా? అంటే.. సాధారణంగా అసెంబ్లీ సమావేశాల్ని నిర్వహించి సభను వాయిదా వేసిన తర్వాత నిరవధిక వాయిదా.. అదేనండి ప్రోరోగ్ చేస్తారు. అలా చేసిన తర్వాత నిర్వహించే అసెంబ్లీ సమావేశాలకు ఇంతకు ముందు చెప్పినట్లుగా గవర్నర్ ఆమోదముద్ర.. వారి ప్రసంగంతో సభను షురూ చేయాల్సి ఉంటుంది. మొన్నా మధ్యన ముగిసిన అసెంబ్లీ సమావేశాలు పూర్తి అయి వాయిదా పడ్డాయే కానీ.. ప్రోరోగ్ చేయలేదు. ఈ సాంకేతిక వెసులుబాటుతో గవర్నర్ అనుమతి అవసరం లేకుండానే అసెంబ్లీ స్పీకర్.. మండలి ఛైర్మన్ల అధికార ప్రకటన విడుదల చేసిన సభల్ని నిర్వహిస్తున్నారు. అందుకే.. గవర్నర్ అనుమతి.. సభ ప్రారంభంలో గవర్నర్ ప్రసంగం లాంటివేమీ ఈసారి ఉండవు.