Begin typing your search above and press return to search.

తెలంగాణ‌కు కొత్త ముప్పు.. 10 వేల గ్రామాల్ని చుట్టేసింద‌ట‌

By:  Tupaki Desk   |   12 Oct 2020 6:45 AM GMT
తెలంగాణ‌కు కొత్త ముప్పు.. 10 వేల గ్రామాల్ని చుట్టేసింద‌ట‌
X
తెలంగాణ రాష్ట్రానికి కొత్త క‌ష్టం వ‌చ్చింద‌ని చెబుతున్నారు. మొద‌ట్నించి హైద‌రాబాద్ ను ఆగం మాగం చేసిన క‌రోనా మ‌హ‌మ్మారి దెబ్బ‌కు మ‌హాన‌గ‌రాన్ని వ‌దిలేసి ఊళ్ల‌కు వెళ్లిపోయినోళ్లు ఎక్కువే ఉన్నారు. ఒక్క‌ హైద‌రాబాద్ మ‌హాన‌గ‌రం నుంచి ల‌క్షలాది మంది గ్రామాల‌కు వెళ్లిపోయారు. న‌గ‌రంలో భారీ ఎత్తున క‌రోనా వైర‌స్ వ్యాప్తి చెంది ఉండ‌టం.. ఊరు మాత్రమే సుర‌క్షిత‌మైన‌ద‌న్న భావ‌న పెరిగింది. దీనికి తోడు ప‌లు కంపెనీల్లో వ‌ర్క్ ఫ్రం హోం సౌక‌ర్యం క‌ల్పించ‌టంతో హైద‌రాబాద్ లోని ఇంటిని ఖాళీ చేయ‌ట‌మో.. లేదంటే తాళం వేసేసి ఊరెళ్లిపోయినోళ్లు మ‌స్తుమంది ఉన్నార‌న్న‌ది మ‌ర్చిపోకూడదు.

ఇప్పుడు అదే పెద్ద స‌మ‌స్య‌గా మారింది. మ‌హాన‌గ‌రంలో కేసుల సంఖ్య త‌గ్గిపోతుంటే.. జిల్లాల్లో మాత్రం పెరుగుతోంది. అందునా.. ప‌ల్లెల్లో ప‌రిస్థితి బాగోలేద‌ని చెబుతు‌న్నారు., తాజాగా తెలంగాణ వైద్య ఆరోగ్య శాఖ తెలిపిన వివ‌రాల ప్ర‌కారం.. రాష్ట్రంలో దాదాపు ప‌దివేల గ్రామాల్లో క‌రోనా కేసులు ఉన్న‌ట్లుగా చెబుతున్నారు. సుమారు 10వేల గ్రామాల్లో.. మ‌హ‌మ్మారి తిష్ట వేసుకున్న‌ట్లు తెలుస్తోంది.

వైర‌స్ అంటే భ‌య‌మో.. లేదంటే త‌మ‌కు పాజిటివ్ వ‌చ్చింద‌న్న మాట గౌర‌వ మ‌ర్యాద‌ల‌కు భంగం వాటిల్లేలా చేస్తుంద‌న్న ఆందోళ‌న‌తో బ‌య‌ట‌కు వెల్ల‌డించ‌టం లేద‌ని చెబుతున్నారు. దీంతో గ్రామాల్లో ఇప్పుడు కొత్త అల‌జ‌డి నెల‌కొని ఉంది. మొన్న‌టివ‌ర‌కు బిందాస్ గా ఉన్న ప‌ల్లెలు ఇప్పుడు.. భ‌యంతో వ‌ణుకుతున్నాయి. ఆ మ‌ధ్య‌న ప‌ట్ట‌ణాలు.. న‌గ‌రాల నుంచి గ్రామాల‌కు ప‌రుగులు తీసిన వారంతా.. ఇప్పుడు మ‌ళ్లీ ప‌ట్ట‌ణాలు.. న‌గ‌రాల వైపు చూస్తున్న‌ట్లుగా చెబుతున్నారు. ఒక్కో గ్రామంలో ఇప్ప‌టివ‌ర‌కు ఒక‌టో.. రెండో కేసులు క‌నీసం ఉంటున్న‌ట్లుగా తెలుస్తోంది.

క‌రోనా రోగ ల‌క్ష‌ణాలు క‌నిపిస్తున్నా..గౌర‌వ మ‌ర్యాద‌ల పేరుతో ఇంట్లో నుంచి బ‌య‌ట‌కు రావ‌టం లేదు. తెలిసిన సొంత వైద్యం చేయ‌టమో.. మందుల షాపు వారు చెప్పే మాట‌ల్ని శిలాక్షరాలుగా తీసుకోవ‌టం గ‌మ‌నార్హం. దీంతో చాలామంది ప్రాణాల మీద‌కు తెచ్చుకుంటున్న‌ట్లుగా చెబుతున్నారు. జ్వ‌రం వ‌స్తే.. అది సాధార‌ణ‌మో.. క‌రోనానోఅన్న విష‌యాన్ని తేల్చేందుకు ప‌రీక్షల కంటే కూడా ప్రైవేటు (సొంత‌) వైద్యాన్ని ఆశ్ర‌యిస్తున్నారు. దీంతో తీవ్ర‌త మ‌రింత పెరుగుతోంది. బాగా ముదిరిన త‌ర్వాత ద‌గ్గ‌ర్లోని ఆసుప‌త్రికి తీసుకురావ‌టం.. అప్ప‌టికే ప‌రిస్థితి సీరియ‌స్ కావ‌టంతో వైద్యుల‌కు ఇదో త‌ల‌నొప్పిలా మారింది.

ఓవైపు కేసుల న‌మోదు త‌క్కువ‌గానే ఉన్నా.. గ్రామాల్లో కేసుల న‌మోదు అంత‌కంత‌కూ పెరుగుతోంది. హైద‌రాబాద్ మ‌హాన‌గ‌రంలో కేసుల న‌మోదు త‌గ్గింది. కోలుకుంటున్న వారి సంఖ్య పెరుగుతున్న కొద్దీ.. తెలంగాణ‌లోని గ్రామాల ప‌రిస్థితి ఏ మాత్రం బాగోలేద‌న్న మాట వినిపిస్తోంది. దీంతో.. ప‌లు గ్రామాల్లో స్కూళ్లు.. క‌మ్యునిటీ హాళ్ల‌లో ఐసోలేట్ చేస్తున్నారు. తెలంగాణ ఆరోగ్య శాఖ వ‌ద్ద ఉన్న స‌మాచారం ప్ర‌కారం చూస్తే.. ప్ర‌స్తుతం 1283 కంటైన్మెంట్ జోన్లు ఉన్నాయి. అందులో ప‌లు జిల్లాలు ఉన్నాయి. కొన్నింటి వివ‌రాలు మాత్రం న‌మోదు చేయ‌లేదు. పెద్ద ఎత్తున కేసులు న‌మోద‌వుతున్న మూడు జిల్లాల్లో మేడ్చ‌ల్ ఒక‌టిగా చెబుతున్నారు. ప్ర‌స్తుతం గ్రామాలు ఎదుర్కొంటున్న మ‌రోస‌మ‌స్య‌.. అక్క‌డ పెద్ద వ‌య‌స్కుల వారు ఎక్కువ‌గా ఉంటారు. దీంతో.. రోగ తీవ్ర‌త ఎక్కువ‌గా ఉండ‌టంతోపాటు.. స‌రైన వైద్యం అంద‌క‌పోవ‌టంతో తీవ్ర ఇబ్బందుల‌కు గుర‌వుతున్న‌ట్లుగా తెలుస్తోంది.