Begin typing your search above and press return to search.

డేంజర్ బెల్స్.. హైదరాబాద్ లో కేసులు పెరుగుతున్నాయ్

By:  Tupaki Desk   |   9 Dec 2020 5:40 AM GMT
డేంజర్ బెల్స్.. హైదరాబాద్ లో కేసులు పెరుగుతున్నాయ్
X
దేశంలో సెకండ్ వేవ్ హడావుడి నడుస్తున్న సంగతి తెలిసిందే. ఢిల్లీ.. కేరళ.. మహారాష్ట్రలలో సెకండ్ వేవ్ షురూ అయినట్లుగా చెబుతున్నారు. అయితే.. గతంతో పోలిస్తే.. కరోనా కేసుల నమోదు సంఖ్య అంతకంతకూ తగ్గుతునన సంగతి తెలిసిందే. రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ పాజిటివ్ కేసులు తగ్గు ముఖం పట్టాయి. చాలా రోజుల తర్వాత గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో కరోనా పాజిటివ్ కేసులు డబుల్ డిజిట్ కు పరిమితమయ్యాయి. ఒక దశలో రోజుకు మూడు వేలకు పైగా కేసులు నమోదైన దాని నుంచి.. ఈ మధ్య వంద కంటే తక్కువ కేసులు నమోదైన పరిస్థితి.

అందుకు భిన్నంగా రెండు రోజుల నుంచి కేసుల నమోదు అంతకంతకూ పెరుగుతున్నాయి. దీనికి కారణం ఇటీవల ముగిసిన గ్రేటర్ ఎన్నికలే అన్న వాదన వినిపిస్తోంది. పాజిటివ్ కేసులు తగ్గుముఖం పట్టటంతో గ్రేటర్ నగర పరిధిలోని ప్రజలు పెద్ద ఎత్తున రాకపోకలు సాగించటంతోపాటు.. కరోనా ఉందన్న భావన లేకుండా రోడ్లు మొత్తం ట్రాఫిక్ తో నిండిపోతున్నాయి. గ్రేటర్ ఎన్నికల ప్రచారంలోనూ.. బహిరంగ సభలకు పెద్ద ఎత్తున హాజరైన ప్రజల్ని చూసినంతనే.. కేసుల తీవ్రతకు కారణమవుతుందన్న సందేహాలు వ్యక్తమయ్యాయి.

ఈ అనుమానాలకు బలం చేకూరేలా తాజాగా కేసులు నమోదవుతున్నాయి. మొన్నటి వరకు వంద లోపు మాత్రమే రోజూ కేసులు నమోదవుతుంటే.. గడిచిన రెండు రోజులుగామాత్రం పాజిటివ్ కేసుల సంఖ్య వందకు పైనే నమోదవుతున్నాయి. ఈ రోజు విడుదల చేసిన బులిటెన్ చూస్తే..గ్రేటర్ పరిధిలో 123 కేసులు నమోదయ్యాయి. ఇటీవల కాలంలో ఇంత ఎక్కువగా కేసులునమోదు కావటం ఇదేనన్న మాట వినిపిస్తోంది. ప్రమాద సంకేతాల్ని ఇచ్చేలా కేసుల నమోదు ఉందని.. ఇప్పటికైనా ప్రజలు మరింత జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉందంటున్నారు. సో.. బీకేర్ ఫుల్.