Begin typing your search above and press return to search.

తెలంగాణ లో అలర్ట్​.. బ్రిటన్​ నుంచి వచ్చిన ఇద్దరికి ‘కరోనా’

By:  Tupaki Desk   |   24 Dec 2020 5:04 AM GMT
తెలంగాణ లో అలర్ట్​.. బ్రిటన్​ నుంచి వచ్చిన ఇద్దరికి ‘కరోనా’
X
కొత్త స్ట్రెయిన్​ కరోనా నేపథ్యం లో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అలర్టయ్యింది. అయితే ఇప్పటివరకు రాష్ట్రంలో కొత్త కరోనా కేసులు నమోదుకాలేదని.. తెలంగాణ వైద్య ఆరోగ్యశాఖ పేర్కొన్నది. అయితే ఇటీవల బ్రిటన్​ నుంచి వచ్చిన వారిలో ఇద్దరికి కరోనా నిర్ధారణ అయ్యింది. ఇది కొత్త స్ట్రెయినా.. లేక పాత కరోనానా అన్న విషయంపై ఇంకా క్లారిటీ లేదు. ఈ నేపథ్యంలో వైద్య ఆరోగ్యశాఖ అప్రమత్తమైంది. విదేశాల నుంచి వచ్చినవారికి విధిగా పరీక్షలు చేస్తున్నారు. ప్రస్తుతం ఇటీవల యూకే నుంచి వచ్చినవారందరి వివరాలు వైద్య ఆరోగ్యశాఖ సేకరిస్తున్నది. డిసెంబర్​ 9 కి ముందు వచ్చిన వారందరికీ ఆర్టీపీసీఆర్​ పరీక్షలు నిర్వహించనున్నారు.

మరోవైపు కొత్త స్ట్రెయిన్​పై కేంద్ర ఆరోగ్యశాఖ కూడా అప్రమత్తమైంది. కేంద్ర ఆరోగ్యశాఖ కార్యదర్శి కొత్త స్ట్రెయిన్‌పై పది రాష్ట్రాల వైద్యశాఖ ముఖ్య కార్యదర్శులతో బుధవారం వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. బ్రిటన్​ నుంచి వచ్చిన వారందరికీ కరోనా పరీక్షలు నిర్వహించి.. జన్యు క్రమం తెలుసుకొనేందుకు హైదరాబాద్​లోని సీసీఎంబీకి పంపించాలని అన్ని రాష్ట్రప్రభుత్వాలను కేంద్రం ఆదేశించింది. డిసెంబర్​ 9 తర్వాత బ్రిటన్​ నుంచి తెలంగాణకు మొత్తం 1200 మంది వచ్చారు. వీరిలో గ్రేటర్​హైదరాబాద్​ తో పాటు, వివిధ జిల్లాలకు చెందిన వారు కూడా ఉన్నారు.ఈ నేపథ్యంలో ప్రస్తుతం వైద్య ఆరోగ్యశాఖ వారిని గుర్తించి క్వారంటైన్​కు పంపించనున్నది.

ఆయా జిల్లా కేంద్రాలతో పాటు.. గచ్చిబౌలిలోని టిమ్స్​ లోనూ క్వారంటైన్​ సెంటర్లు ఏర్పాటు చేశారు. బ్రిటన్​ నుంచి వచ్చినవారు 040-24651119, ఫోన్​ లేదా.. 91541 70960 నంబరుకు వాట్సాప్​లో సంప్రదిస్తే వారికి టెస్టులు చేస్తామని తెలంగాణ వైద్య ఆరోగ్యశాఖ ప్రకటిచింది. ఇటీవల బ్రిటన్​ నుంచి వచ్చినవాళ్లు 21 రోజుల పాటు హోం ఐసోలేషన్​ లో ఉండాలని.. ప్రభుత్వం సూచిస్తుంది. లక్షణాలు ఉన్నా లేకున్నా కచ్చితంగా పరీక్షలు చేయించుకోవాలని.. హోం ఐసోలేషన్​లో ఉండాలని వైద్యశాఖ అధికారులు సూచిస్తున్నారు.